అటు వైరస్‌ ఇటు యాంటీబాడీలు
close
Published : 08/09/2020 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అటు వైరస్‌ ఇటు యాంటీబాడీలు

పిల్లలకు, యుక్తవయసువారికి కరోనా అంతగా సోకటం లేదు. సోకినా తీవ్రం కావటం లేదు. లక్షణాలూ అంతగా వేధించటం లేదు. దీనికి కారణమేంటి? పిల్లల నుంచి ఇతరులకు వైరస్‌ ఎలా సోకుతోంది? ఇవి మొదట్నుంచీ శాస్త్రవేత్తల మెదళ్లను తొలుస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఆశ్చర్యకరకమైన విషయం తాజాగా బయటపడింది. మామూలుగానైతే యాంటీబాడీలు పుట్టుకొచ్చాక చాలారకాల వైరస్‌లు ఒంట్లో ఉండవు. అయితే పిల్లల్లో కరోనా వైరస్‌తో పాటు యాంటీబాడీలూ ఒకే సమయంలో కనిపిస్తున్నట్టు అమెరికాలోని చిల్డ్రన్స్‌ నేషనల్‌ హాస్పిటల్‌ అధ్యయనంలో తేలటం విచిత్రం. అంటే యాంటీబాడీలు ఉన్నప్పటికీ పిల్లల ద్వారా ఇతరులకు వైరస్‌ వ్యాపించే అవకాశం ఉంటోందనే అర్థం. అందువల్ల పిల్లల విషయంలో నిర్లక్ష్యం తగదు. మాస్కు ధారణ, చేతుల శుభ్రత, ఇతరులకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు కచ్చితంగా పాటించేలా పిల్లలకు నేర్పించటం మంచిది. వీరిలో వైరస్‌ ఎంతకాలం పాజిటివ్‌గా ఉంటోందనే దాని మీదా పరిశోధకులు అధ్యయనం చేశారు. పిల్లల్లో వైరస్‌ నెగెటివ్‌గా మారటానికి సగటున 25 రోజులు పడుతుండగా.. యాంటీబాడీలు రక్తంలో కనిపించటానికి సగటున 18 రోజులు పడుతోంది. ఇక న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీలు తగినంత స్థాయికి చేరటానికి 36 రోజులు తీసుకుంటోంది. మళ్లీ కరోనా ఇన్‌ఫెక్షన్‌ బారినపడకుండా ఉండటానికి న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీలే కీలకం. వయసుల వారీగానూ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. వైరస్‌ నెగెటివ్‌గా మారటానికి 6-15 ఏళ్ల పిల్లల్లో సగటున 32 రోజులు పడుతుండగా.. 16-22 ఏళ్ల వారిలో 18 రోజులే పడుతోంది. 6-15 ఏళ్ల పిల్లల్లో అమ్మాయిల్లోనైతే మరింత ఎక్కువ సమయమే తీసుకుంటోంది. మగపిల్లల్లో సగటున 25.5 రోజులకు, అమ్మాయిల్లో 44 రోజులకు నెగెటివ్‌గా మారుతోంది. ప్రస్తుతం పెద్దవారిలో కరోనా వైరస్‌ ప్రభావం గురించి చాలా సమాచారమే అందుబాటులో ఉంది. కానీ పిల్లల్లో అంతగా లేదు. ఈ నేపథ్యంలో పిల్లల మీద కరోనా తీరుతెన్నులను అర్థం చేసుకోవటానికి తాజా అధ్యయనం ఉపయోగపడగలదని భావిస్తున్నారు.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని