కరోనా కరోనా కరోనా!
close
Published : 24/11/2020 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా కరోనా కరోనా!

ఇంటా బయటా అందరి నోటా కరోనా మాటే. అందరి మనసుల్లోనూ అదే భయం. దీన్ని ఎదుర్కోవటం మీదే అందరి దృష్టి. కరోనా విజృంభణ మొదలైనప్పట్నుంచీ రోజుకో కొత్త సంగతి బయటపడుతూనే ఉంది. చికిత్సలో కొత్త మందుల ప్రస్తావన వస్తూనే ఉంది. కొన్ని కొత్త భయాలను సృష్టిస్తే, మరికొన్ని సరికొత్త భరోసాను కల్పిస్తున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన అలాంటి సంగతులతో కూడిన సమాహారం మీకోసం.


మరణాలు తగ్గుముఖం

ఒకప్పటితో పోలిస్తే కరోనా మరణాల శాతం బాగా తగ్గిపోయింది. ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేస్తున్నాయి. మొదట్లో కరోనా జబ్బు ఎక్కువగా పెద్ద వయసువారిలో కనిపిస్తే, ఇప్పుడు చిన్న వయసువారిలో ఎక్కువగా కనిపిస్తోంది. కరోనా బారినపడుతున్నవారి సగటు వయసు 46 నుంచి 38కి పడిపోయింది. చిన్నవయసువారు జబ్బును బాగా తట్టుకుంటుండటం వల్ల మరణాలూ తక్కువగానే నమోదవుతున్నాయి. అవగాహన పెరగటం, తొలిదశలోనే కరోనాను నిర్ధారిస్తుండటం, పరీక్షల సంఖ్య పెరగటం, మధుమేహం వంటి ఇతరత్రా సమస్యలను గట్టిగా అదుపులో పెట్టుకోవటం, వాపు ప్రక్రియను తగ్గించే ఆహారం మీద దృష్టి సారించటం, వైరస్‌ బలహీనపడుతుండటం, క్రమంగా సామూహిక రోగనిరోధక శక్తి పెరుగుతుండటం, ముప్పు ఎక్కువగా గలవారు ఇప్పటికే జబ్బు బారినపడటం వంటివీ ఇందుకు దోహదం చేస్తున్నాయి. అలాగే ప్రాణాలు కాపాడే చికిత్సలూ మెరుగయ్యాయి. ముందుగానే స్టిరాయిడ్లు, రక్తం గడ్డకట్టకుండా చూసే మందులు ఆరంభించెయ్యటం.. డాక్టర్లలో, ప్రజల్లో భయం తగ్గటం సైతం ఇందుకు తోడ్పడుతున్నాయి.


ఇంటి పరీక్ష సిద్ధం

గర్భధారణ పరీక్ష మాదిరిగా కరోనా పరీక్షనూ ఎవరికి వారు ఇంట్లోనే తేలికగా చేసుకోగలిగితే? ఫలితమూ వెంటనే బయటపడితే? ప్రత్యేకంగా పరీక్ష కోసం బయటకు వెళ్లటం తప్పుతుంది. వైరస్‌ వ్యాప్తి సైతం తగ్గుముఖం పడుతుంది. ప్రపంచమంతా ఇలాంటి పరీక్ష కోసమే ఎదురుచూస్తోంది. నేడు కాకపోతే రేపైనా రాకపోదా అని నిరీక్షిస్తోంది. దీన్ని సాకారం చేస్తూ ఆల్‌ఇన్‌ వన్‌ టెస్ట్‌ కిట్‌ అందుబాటులోకి వచ్చింది. దీనికి అమెరికా ఎఫ్‌డీఏ ఇటీవలే ఆమోదం తెలిపింది. ప్రస్తుతానికి అమెరికాలో అందుబాటులోకి వచ్చినప్పటికీ త్వరలోనే అన్ని దేశాలకూ విస్తరించొచ్చు. ఇది ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష మాదిరిగానే పనిచేస్తుంది. కిట్‌లో పరీక్ష పరికరం, దూదిపుల్ల, సూచనల వంటివి ఉంటాయి. నమూనాను సేకరించే దూదిపుల్లను ముక్కులో నాలుగైదు సార్లు తిప్పి, పరికరంలో పెడితే చాలు. అరగంటలోనే పాజిటివా? నెగెటివా? అన్నది తేలిపోతుంది. పెద్దవాళ్లు తమకు తామే నమూనా తీసుకోవచ్చు. 14 ఏళ్ల కన్నా చిన్నవారైతే వైద్య సిబ్బంది సాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది 98% కచ్చితత్వంతో ఫలితాలు వెల్లడిస్తుంది. అంటే పరీక్ష నెగెటివ్‌గా తేలితే 98% వరకు కరోనా లేనట్టే.


అశ్వగంధ రక్షణ

ఆయుర్వేదం వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల గురించి ప్రస్తావించకపోయినప్పటికీ అలాంటి లక్షణాలు గల జబ్బులను తగ్గించే ఎన్నో మందులను పేర్కొంది. వీటిల్లో అశ్వగంధ ఒకటి. దీనికి వైరస్‌లను నిర్మూలించే గుణముంది. ఇది రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. ఒత్తిడినీ తగ్గిస్తుంది. కొవిడ్‌ తీవ్రం కావటానికి రోగనిరోధక వ్యవస్థ గతి తప్పటం, ఒత్తిడి కారణమవుతుండటం గమనార్హం. కరోనా వైరస్‌ మీద ముల్లులాంటి ప్రొటీన్‌ పైకి పొడుచుకొని ఉంటుంది. దీని తల భాగం ఏస్‌2 గ్రాహకానికి అంటుకునే స్వభావం ఉండటం వల్లనే వైరస్‌ కణాల్లోకి ప్రవేశిస్తోంది. అశ్వగంధ సరిగ్గా దీన్నే అడ్డుకుంటుంది. ప్రస్తుతం యాంటీబాడీలు తప్ప వైరస్‌ను గ్రాహకాలకు అంటుకోకుండా చూసే మందులేవీ లేవు. అందువల్ల ఇది కరోనా నివారణకు తోడ్పడగలదని భావిస్తున్నారు. తొలి వారం రోజుల్లో వైరస్‌ విజృంభణ తగ్గటానికి, తిరిగి ఇన్‌ఫెక్షన్‌ బారినపడకుండా చూడటానికీ ఉపయోగపడగలదని ఆశిస్తున్నారు.


కుంగుబాటు మందు ఆశ!

కరోనా చికిత్సలో రోజుకో కొత్త మందు పేరు ముందుకొస్తోంది. తాజాగా ఫ్లువోక్సమిన్‌ కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. దీన్ని తొలిదశలోనే వాడితే కొవిడ్‌-19 తీవ్రం కాకుండా కాపాడుతున్నట్టు తేలింది. నిజానికి ఫ్లువోక్సమిన్‌ మందును ఆందోళన, కుంగుబాటు చికిత్సలో వాడుతుంటారు. ఇది వాపు ప్రక్రియ తగ్గటానికీ తోడ్పడుతుంది. ఇలా తీవ్ర కొవిడ్‌ నివారణకూ పనిచేస్తోంది. వాపు ప్రక్రియను ప్రేరేపితం చేసే ఐఎల్‌-6ను ఫ్లువోక్సమిన్‌ అడ్డుకుంటున్నట్టు.. ఇలా వాపు ప్రక్రియ, సెప్పిస్‌ తగ్గటానికి తోడ్పడుతున్నట్టు గత అధ్యయనాల్లో బయటపడింది. కొవిడ్‌-19లోనూ ఇది ఇలాంటి ప్రభావమే చూపుతున్నట్టు బయటపడింది. ఫ్లువోక్సమిన్‌ మందు పెద్దవారికే ఇస్తుంటారు. పిల్లలకు, యుక్తవయసు వారిలో ఇది విపరీత పరిణామాలకు దారితీస్తుంది.


మౌత్‌వాష్‌తో కట్టడి!

నోటిని శుభ్రం చేసే మౌత్‌వాష్‌లతో కరోనా వైరస్‌ను కట్టడి చేయొచ్చా? జర్నల్‌ ఆఫ్‌ డెంటల్‌ రీసెర్చ్‌లో ప్రచురితమైన అధ్యయనం అవుననే చెబుతోంది. పొవొడిన్‌ అయోడిన్‌, క్లోరెక్సెడిన్‌, కొన్ని సుగంధ నూనెల వంటి వాటితో కూడిన మౌత్‌వాష్‌లు నోట్లో వైరస్‌ సంఖ్య తగ్గటానికి తోడ్పడగలవని తేలటమే దీనికి నిదర్శనం. ఫలితంగా వైరస్‌ వ్యాప్తీ తగ్గుతుంది. ఎవరికి కరోనా సోకిందో తెలుసుకోవటం కష్టం కాబట్టి అంతా వైరస్‌ల నిర్మూలించే పదార్థాలతో కూడిన మౌత్‌వాష్‌లు వాడుకోవటం మంచిదని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. రోజూ ఉదయం, సాయంత్రం ఒకసారి.. ఏదైనా సమావేశానికి వెళ్లే ముందు రోజు మూడు సార్లు మౌత్‌వాష్‌తో నోటిని పుక్కిలించొచ్చు. కరోనా బాధితులైతే 7-8 రోజుల వరకు తరచూ మౌత్‌వాష్‌తో శుభ్రం చేసుకోవటం మంచిది.


కరోనా రక్షణ ఎంతకాలం?

కొవిడ్‌-19 నయమయ్యాక మళ్లీ వస్తుందా? రక్షణ ఎంత కాలం ఉంటుంది? అందరి మనసులను తొలుస్తున్న ప్రశ్న ఇదే. అందరిలో కాకపోయినా చాలామందిలో ఇన్‌ఫెక్షన్‌ తగ్గిన తర్వాత ఆరు నెలల వరకు కొవిడ్‌ రక్షణ కొనసాగుతున్నట్టు తాజా అధ్యయనం దీనికి సమాధానమిస్తోంది. నిజానికి కొవిడ్‌ రక్షణ ఏళ్ల కొద్దీ కొనసాగే అవకాశముందనీ వివరిస్తోంది. వైరస్‌లను గుర్తుంచుకునే రోగనిరోధక కణాలు స్థిరంగా ఉంటుండటమే దీనికి కారణం. మన రోగనిరోధక వ్యవస్థలో భాగమైన కొన్ని బి, టి లింఫ్‌ కణాలు ఆయా వైరస్‌లను గుర్తించి, జ్ఞాపకం పెట్టుకుంటాయి. తిరిగి ఎప్పుడైనా ఆ వైరస్‌లు దాడి చేస్తే వాటిని ఎదుర్కొనే యాంటీబాడీలు పుట్టుకొచ్చేలా చేస్తాయి. కొవిడ్‌-19 బాధితుల్లో ఇవి స్థిరంగా కొనసాగుతూ వస్తున్నట్టు తేలింది. కరోనా వైరస్‌ మీదుండే ముల్లులాంటి ప్రొటీన్‌కు ప్రతిస్పందనగా పుట్టుకొచ్చే యాంటీబాడీలు 6-8 నెలల తర్వాత తగ్గటం ప్రారంభిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అంటే కనీసం ఆరు నెలల వరకు తిరిగి ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశం ఉండదని అనుకోవచ్చు. అయితే వైరస్‌లను గుర్తుంచుకునే రోగనిరోధక కణాలు స్థిరంగా ఉంటుండటం వల్ల చాలాకాలం రక్షణ కొనసాగే అవకాశమంటుంది.


ఊబకాయంతో తీవ్రం

యాబై ఏళ్లలోపున్నారా? ఊబకాయులు కూడానా? అయితే తీవ్ర కరోనా జబ్బు ముప్పు పొంచి ఉన్నట్టే. 50 ఏళ్లు, అంతకన్నా తక్కువ వయసు కొవిడ్‌-19 బాధితులకు కృత్రిమశ్వాస కల్పించాల్సిన అవసరం పెరుగుతున్నట్టు, వీరికి ఆసుపత్రిలో మరణించే ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. మనలో రెండు రకాల కొవ్వు కణాలుంటాయి. కొన్ని తెల్లగా, మరికొన్ని గోధుమ రంగులో ఉంటాయి. ఊబకాయుల్లో కొవ్వు కణాల సైజు పెరుగుతుంది. కాలేయంలోని కొవ్వు కణాలు, అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వు కణాలూ పెద్దగా అవుతాయి. ఇవి వాపు ప్రక్రియ ప్రేరేపితమయ్యేలా చేస్తాయి. ఫలితంగా ఐఎల్‌6, ఐఎల్‌1 బీటా, టీఎన్‌ఎఫ్‌ అల్పా వంటి వాపు ప్రక్రియల సూచికల స్థాయులు పెరుగుతాయి. ఇలాంటి స్థితిలో కొవిడ్‌ బారినపడితే వాపు ప్రక్రియ మరింత ఎక్కువవుతుంది. ఇది కొవిడ్‌ దుష్ప్రభావాలు మరింత తీవ్రయమ్యేలా చేస్తుంది. అందువల్ల ఊబకాయాన్ని తగ్గించుకోవటం ముఖ్యం. బొజ్జ చుట్టుకొలత మగవారిలో 90 సెంటీమీటర్లు, ఆడవారిలో 80 సెంటీమీటర్ల కన్నా మించితే వెంటనే తగ్గించుకోవటం మీద దృష్టి సారించండి.


రక్తం మీద దెబ్బ

కరోనా వైరస్‌ రక్తాన్ని దెబ్బతీస్తోంది, ఫెరిటిన్‌ స్థాయులు పెరిగేలా చేస్తోంది. ఎర్ర రక్తకణాలను విచ్ఛిన్నం చేసి, దీనిలోని భాగాలు రక్తనాళాల నుంచి లీకయ్యేలా చేస్తోంది. దీని ప్రభావం జబ్బు తగ్గిన తర్వాతా కొనసాగుతుండటం గమనార్హం. ఒక మాదిరి నుంచి తీవ్ర కరోనా జబ్బు తలెత్తిన 60 రోజుల తర్వాత కూడా 30% మందిలో ఐరన్‌ లోపం,  9% మందిలో రక్తహీనత ఉంటున్నట్టు బయటపడింది. మనదేశంలో మొదట్నుంచే ఐరన్‌ లోపం ఎక్కువ. సుమారు 80% మంది రక్తహీనత గలవారే! దీనికి కరోనా తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్టే. మామూలుగానే రక్తహీనతలో శ్వాసకోశ జబ్బులు తీవ్రమవుతుంటాయి. కరోనా ప్రధానంగా శ్వాసకోశ జబ్బే. కరోనాతో రక్తహీనత తలెత్తినవారిలో ఐఎల్‌-6, సీఆర్‌పీ వంటి వాపు ప్రక్రియ సూచికల స్థాయులూ ఎక్కువగానే ఉంటున్నాయి. అందువల్ల ఐరన్‌ దండిగా లభించే ఆహారం తీసుకోవటం వంటి జాగ్రత్తలతో హిమోగ్లోబిన్‌ స్థాయులు తగ్గకుండా చూసుకోవటం ముఖ్యం. దీంతో కరోనా బారినపడ్డా తీవ్రం కాకుండా చూసుకోవచ్చు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని