కరోనా తగ్గినా న్యుమోనియా భయపెడుతోంది
close
Published : 27/04/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా తగ్గినా న్యుమోనియా భయపెడుతోంది

సమస్య సలహా

సమస్య: నాకు 62 ఏళ్లు, నా భార్యకు 55. ఫిబ్రవరిలో మా ఇద్దరికీ కొవిడ్‌ వచ్చింది. మూడు వారాలు ఇంట్లో విడిగా ఉన్నాం. డాక్టర్‌ సూచించిన సీబీపీ, డీ డైమర్‌, సీఆర్‌పీ, ఛాతీ సీటీ స్కాన్‌ పరీక్షలన్నీ చేయించుకున్నాం. సీటీ స్కాన్‌లో నాకు కోరాడ్స్‌ 4, నా భార్యకు కోరాడ్స్‌ 3 అని వచ్చింది. మందులన్నీ సక్రమంగా వాడుకున్నాం. మార్చిలో కొవిడ్‌ నెగెటివ్‌ నిర్ధారణ అయ్యింది. నిస్సత్తువ తప్ప పెద్దగా ఇబ్బందులేవీ లేవు. నా సందేహం ఏంటంటే సీటీ స్కాన్‌లో నిర్ధారణ అయిన న్యుమోనియా నుంచి పూర్తిగా బయటపడటమెలా? ఇదే బాగా కలవరపెడుతోంది. దీనికి పరిష్కారం తెలియజేయండి. - పి.రాధాకృష్ణ, హైదరాబాద్‌

సలహా: ఎలాంటి తీవ్రమైన దుష్ఫ్రభావాలు లేకుండా మీరు కొరాడ్స్‌4, మీ భార్య కొరాడ్స్‌3తోనే జబ్బు నుంచి బయటపడ్డారు. ఇప్పుడు దీనికి మందులు అవసరం లేదు. ఛాతీలో కొవిడ్‌ మార్పులు గలవారికి మందులు అవసరమైతే మొదట్లోనే.. 7-8 రోజుల్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. అదీ జ్వరం విడవకుండా వేధిస్తుంటే, ఆక్సిజన్‌ శాతం తక్కువగా ఉంటే కరోనా మందులు, స్టిరాయిడ్‌ మందులు ఇస్తారు. మీరు మామూలు మందులు వాడుకునే, విడిగా ఉంటూ జబ్బు నుంచి బయటపడ్డారు. చాలా సంతోషం. లక్షణాలేవీ లేవు కాబట్టి ఇప్పుడు మీరు న్యుమోనియా గురించి పెద్దగా బాధపడాల్సిన పనిలేదు. కంగారూ పడక్కర్లేదు. ఇది వైరస్‌ న్యుమోనియా కాబట్టి దానంతటదే తగ్గుతుంది. కాకపోతే కొంత సమయం పడుతుంది. మన శరీరానికి దీన్ని సరిచేసే గుణం ఉంది. సాధారణంగా 6 వారాల నుంచి 6 నెలల లోపు చాలా వరకు కుదురుకుంటుంది. ఇంకా త్వరగా ఫలితం కనిపించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి పోషకాహారం, నోటికి హితవుగా ఉండే ఆహారం తీసుకోవాలి. నీళ్లు బాగా తాగాలి. ఎందుకంటే వృద్ధాప్యంలో దాహం వేస్తున్న విషయాన్ని గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది. ఎండకాలం ఇది మరింత ముఖ్యం. రోజూ 10 నిమిషాల సేపు శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. రోజూ ప్రాణాయామం చేయటం మంచిది. ఇది ఊపిరితిత్తులను సాగేలా చేస్తుంది. వీలుంటే సేతు బంధాసనం, ధనురాసనం, భుజంగాసనం కూడా చేయొచ్చు. ఇవి ఊపిరితిత్తులకు అనుబంధంగా పనిచేసే కణజాలాన్ని సాగేలా చేస్తాయి. మీరు, మీ భార్య రోజూ వేసుకునే మాత్రలను ఎప్పటిలాగానే వాడుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. కరోనా జబ్బు పోయినప్పటికీ బయటకు వెళ్లేటప్పుడు విధిగా మాస్కు పెట్టుకోవాలి. ముక్కు, నోరు పూర్తిగా కప్పి ఉండేలా మాస్కు ధరించాలి. అద్దం ముందు నిలబడి ఒకసారి మాస్కు పెట్టుకున్న తర్వాత ఇంటికి తిరిగి వచ్చేంత వరకు మాస్కును ముట్టుకోవద్దు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని