కృష్ణా జలాలపై ఆంధ్రా దాదాగిరి
close
Published : 03/08/2021 02:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కృష్ణా జలాలపై ఆంధ్రా దాదాగిరి

ఏపీ ప్రభుత్వ అక్రమ ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు ఇబ్బంది
 కృష్ణా-గోదావరి అనుసంధానంతో సాగర్‌ ఆయకట్టును కాపాడతాం
 నాగార్జునసాగర్‌ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్‌
 దళితబంధుపై వెనక్కు తగ్గబోమని స్పష్టీకరణ

సాగర్‌ అభివృద్ధికి రూ.150 కోట్లు

ఈనాడు, నల్గొండ: కృష్ణా జలాలపై ఆంధ్రా దాదాగిరి చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టుల వల్ల భవిష్యత్తులో తెలంగాణకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందన్నారు. అందుకోసం గోదావరి జలాలను ఖమ్మం జిల్లా పాలేరు నుంచి సాగర్‌ ఎడమ కాల్వపై ఉన్న పెద్దదేవులపల్లి చెరువులోకి ఎత్తిపోసి గోదావరి - కృష్ణా నదులను అనుసంధానించి సాగర్‌ ఆయకట్టును రక్షిస్తామన్నారు. నల్గొండ జిల్లాలోని హాలియాలో సోమవారం జరిగిన సాగర్‌ నియోజకవర్గ సమీక్షా సమావేశానికి హాజరై ముఖ్యమంత్రి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ తెలంగాణ వ్యతిరేక వైఖరిని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ‘‘దళితబంధు పథకంపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఆరునూరైనా ఈ పథకాన్ని రాష్ట్రమంతా అమలు చేస్తాం. రూ.లక్ష కోట్లయినా ఖర్చుచేస్తాం.
రాష్ట్రంలోని పోడు భూముల సమస్యకు గతంలోనే 2005ను కటాఫ్‌ డేట్‌గా నిర్ణయించాం. కేంద్ర ప్రభుత్వ చట్టం అది. దాని ప్రకారమే రాష్ట్రంలోని పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాం.  ప్రస్తుతం దేశానికే తెలంగాణ అన్నం పెడుతోంది. రాష్ట్రంలో పండే పత్తి.. ప్రపంచంలోనే మేలు రకంగా ప్రసిద్ధి చెందింది. తలసరి విద్యుత్తు వినియోగంలో మనమే ప్రథమం. ప్రగతి ప్రస్థానం జీర్ణం కానివాళ్లు ఏదో మాట్లాడుతున్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత 15వసారి ఎడమ కాల్వకు నీటిని విడుదల చేస్తున్నాం. సాగర్‌ ఆయకట్టు కింద రెండు పంటలకూ నీళ్లిస్తున్నాం.

వైద్య సౌకర్యాలు పెంచాలి

రాబోయే రోజుల్లో 33 జిల్లా కేంద్రాల్లో వైద్య కళాశాలలను నిర్మిస్తాం. ప్రతి కళాశాలలో 500 పడకలను అందుబాటులో ఉంచుతాం. హైదరాబాద్‌లో మరో 4సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను కడుతున్నాం. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని 18 వేల పడకలను ఆక్సిజన్‌ బెడ్స్‌గా మార్చాం. ఆరోగ్య మౌలిక వసతుల కార్యక్రమం కింద సాగర్‌లోని పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్‌ చేస్తాం.

సాగర్‌ అభివృద్ధికి రూ.150 కోట్లు

నా విజ్ఞప్తిని మన్నించి సాగర్‌ ఉప ఎన్నికల్లో నోముల భగత్‌ను గెలిపించినందుకు ధన్యవాదాలు. మళ్లీ వస్తానని ఎన్నికలప్పుడే చెప్పా. కరోనా వల్ల రావడం కొంచెం ఆలస్యమైంది. ఇక్కడ సభ నిర్వహించిన తర్వాతే నేనూ కరోనా బారినపడ్డా. ఇక్కడ చాలా వెనుకబాటుతనం ఉంది. అందుకే సాగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లు మంజూరు చేస్తున్నా. మీ ఎమ్మెల్యే చాలా సమస్యలు నా దృష్టికి తీసుకువచ్చారు. మౌలిక వసతుల సమస్యలను మంత్రి జగదీశ్‌రెడ్డి నా వద్ద ప్రస్తావించారు. నియోజకవర్గంలోని హాలియా, నందికొండ పురపాలికల అభివృద్ధికి రూ.15 కోట్ల చొప్పున రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నాం. నియోజకవర్గంలో రహదారులు, 2 డిగ్రీ కళాశాలలకు భవనాలు, సిబ్బంది నియామకం, ఆసుపత్రుల అప్‌గ్రేడ్‌ పనుల కోసం మరో రూ.120 కోట్లు కేటాయిస్తున్నా. ఎమ్మెల్యే భగత్‌ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులందరితో మంత్రి జగదీశ్‌రెడ్డి చర్చించి ఎలా ఖర్చు చేయాలో నిర్ణయిస్తారు. అవసరమైతే పురపాలక మంత్రిని కలిసి సూచనలు తీసుకోండి.

ఏడాదిన్నరలో ఎత్తిపోతల పనులు పూర్తి

జిల్లాకు 15 ఎత్తిపోతలను మంజూరు చేస్తున్నాం. సాగర్‌ నియోజకవర్గంలో గుర్రంపోడు మండలంలో ఎత్తిపోతలను ఏర్పాటు చేస్తే 10వేల ఎకరాలకు నీళ్లందించవచ్చని చెబితే తక్షణం సర్వే చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చా. దీన్ని కూడా నెల్లికల్‌ లిఫ్ట్‌తో పాటు మంజూరు చేస్తాం. దేవరకొండ నియోజకవర్గంలో 5, మిర్యాలగూడలో 5, నకిరేకల్‌, హుజూర్‌నగర్‌లలో ఒక్కొక్కటి, మిగితా 3ఎత్తిపోతలకు సైతం త్వరలోనే జీవోలిస్తాం. వీటన్నింటినీ రాబోయే ఏడాది, ఏడాదిన్నరలోపు పూర్తి చేసి జిల్లా ప్రజలకు సాగునీరందిస్తాం.

అల్ట్రా మోడల్‌ విద్యుత్తు కేంద్రం జిల్లాకు గర్వకారణం

దామరచర్ల మండలం వీర్లపాలెంలో దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక టెక్నాలజీతో 4 వేల మెగావాట్ల అల్ట్రామోడల్‌ థర్మల్‌ విద్యుత్తు కేంద్రాన్ని రూ.30 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. ఇది పూర్తయితే లక్ష మంది జనాభా గల నగరంగా దామరచర్ల నిలుస్తుంది. ఇది జిల్లా ప్రజలకే గర్వకారణం’అని సీఎం అన్నారు. స్థానిక ఎమ్మెల్యే భగత్‌ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి, ఎమ్మెల్యేలు లింగయ్యయాదవ్‌, కిశోర్‌, శేఖర్‌రెడ్డి, సైదిరెడ్డి, భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రావు, రవీందర్‌నాయక్‌, మల్లయ్యయాదవ్‌, మండలి మాజీ ఛైర్మన్‌ సుఖేందర్‌రెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


జానారెడ్డి మాట తప్పారు

‘ఒకనాడు శాసనసభలో చర్చ సందర్భంగా రెండేళ్లలో తెలంగాణలోని అన్ని వర్గాలకు ముఖ్యంగా రైతాంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రకటించా. మీరు పదేళ్లయినా చేయలేరని, ఒకవేళ రెండేళ్లలో చేస్తే గులాబీ కండువా కప్పుకొంటానని అప్పటి సీఎల్పీ నాయకుడు జానారెడ్డి చెప్పారు. మేం చెప్పిన దాని ప్రకారం దేశంలోనే ఎక్కడా లేని విధంగా నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందిస్తున్నాం. జానారెడ్డి మాటతప్పి మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ కండువాతో పోటీ చేశారు’


సుమోటోగా చేశా..

కేసీఆర్‌ ఒక్కసారి మాటిచ్చాడంటే వెనక్కిపోడు. ఏ పనైనా మొండిగా చేస్తాడు. రాష్ట్రంలో మొత్తం 17 లక్షల దళిత కుటుంబాల్లో దళితబంధుకు అర్హమైనవి 12 లక్షలు. వీటిలో ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షల మేర లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వమే చొరవ తీసుకుంటుంది. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు అమలు చేస్తాం. వచ్చే ఏడాది నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రమంతా ఈ పథకం ద్వారా ఆర్థిక చేయూతనిస్తాం. దళితబంధును అమలు చేయాలని నాకెవరూ దరఖాస్తు చేయలేదు. సుమోటోగానే రూపకల్పన చేశా.

- సీఎం కేసీఆర్‌


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని