గట్టుఎక్కిన ప్రతిపాదన
close
Published : 21/09/2021 04:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గట్టుఎక్కిన ప్రతిపాదన

1.32 టీఎంసీలతో జలాశయం నిర్మాణానికి అనుమతి

న్యూస్‌టుడే, గద్వాల వ్యవసాయం


మల్లాపురంతండా, సిద్దోనిపల్లి తండాల వద్ద జలాశయ నిర్మాణం చేపట్టే ప్రాంతం

గట్టు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఎట్టకేలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2018 జూన్‌లో ఈ పథకానికి సీఎం శంకుస్థాపన చేసినా.. జలాశయం నిర్మాణ విషయంలో పలు ప్రతిపాదనలతో వాయిదా పడుతూ వచ్చింది. రెండు నెలల కిందట ప్రభుత్వ ఆదేశాల మేరకు జలాశయం నిర్మాణానికి సంబంధించి నాలుగు విధాలుగా అంచనాలను సిద్ధం చేసి నీటి పారుదలశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. గురువారం గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డితో మాట్లాడిన సీఎం కేసీఆర్‌ 1.32 టీఎంసీల నీటి నిల్వతో జలాశయ నిర్మాణ అంచనాతో పనులు చేపట్టేందుకు తుది నిర్ణయం తీసుకున్నారు.

ఫిబ్రవరి నెలలో 3 టీఎంసీల సామర్థ్యంతో జలాశయం నిర్మాణానికి అంచనా వేశారు. ఈ అంచనా వ్యయం రూ.1,250 కోట్లు కావడంతో ఉన్నతాధికారులు నీటి నిల్వ సామర్థ్యంలో పలు రకాల అంచనాలను పంపాలని ఏప్రిల్‌ నెలలో జూరాల ఇంజనీర్లను ఆదేశించారు. 1.32 టీఎంసీ నీటి నిల్వకు రూ.650 కోట్లు, 1.50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో జలాశయ నిర్మాణం చేపడితే రూ.720 కోట్లు, 2.00 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో జలాశయ నిర్మాణం చేస్తే రూ. 1,050 కోట్లు వ్యయం అవుతుందని నివేధికలను సిద్ధం చేసి జులై రెండో వారంలో ఉన్నతాధికారులకు పంపారు.

మూడేళ్లుగా కాలయాపన : జలాశయ నీటి నిల్వ సామర్థ్యం, ఎక్కడి నుంచి నీటిని పంపింగ్‌ చేయాలనే అంశం తెరపైకి రావడంతో మూడేళ్లుగా పలు రకాల నమూనాలు, ఆలోచనలు, సర్వేలతో కాలయాపన చేశారు. మొదట్లో అయిదు వేల ఎకరాల ఆయకట్టు సామర్థ్యంతో గట్టు మినీ ఎత్తిపోతల పథకం చేపట్టేలా సర్వే ప్రారంభించారు. ఎత్తిపోతల లెవెల్స్‌ను అంచనా వేసి, 33 వేల ఎకరాలకు సాగు నీటిని అందించవచ్చని తేల్చారు. దీంతో 2010లో తుది సర్వేకు అనుమతి వచ్చింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎత్తిపోతలపై సర్వే మళ్లీ ముందుకు కదిలింది. 2018 జూన్‌లో గట్టు ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు రూ. 562 కోట్ల అంచనాతో ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది.

33 వేల ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా : గట్టు, కాలూరు తిమ్మన్‌దొడ్డి మండలాలలో 33 వేల ఎకరాలకు కాలువల ద్వారా సాగు నీటిని అందించడంతో పాటు, 40 చెరువులు, కుంటలను నీటితో నింపడమే లక్ష్యంగా ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన ర్యాలంపాడు జలాశయం వద్ద ఇన్‌టెక్‌వెల్‌ నిర్మాణం చేసి, అక్కడి నుంచి 6.30 కి.మీల మేరకు నీటిని పంపింగ్‌ చేస్తారు. గట్టు, కేటిదొడ్డి మండలాల మధ్య ఉన్న మల్లాపురంతాండ, సిద్దోనిపల్లి తాండల సమీపంలోని గజ్జెలమ్మగట్టు వద్ద భారీ జలాశయ నిర్మాణం చేపడతారు. గట్టు ఎత్తిపోతల జలాశయం నుంచి కుడి, ఎడమ ప్రధాన కాలువ ద్వారా నీటిని 33 వేల ఎకరాలకు సాగు నీటిని, చెరువులు, కుంటలను నీటితో నింపేందుకు 15 డిస్ట్రిబ్యూటరీలను నిర్మాణం చేసేలా ఆకృతి చేశారు.


త్వరలోనే టెండర్లు : గట్టు ఎత్తిపోతల శంకుస్థాపన నాటి అంచనా 1.32 టీఎంసీలతో జలాశయం నిర్మిస్తారు. సీఎం కేసీఆర్‌తో మాట్లాడాను. పాత అంచనాలతోనే టెండర్లు పిలుద్దామన్నారు. అధికారికంగా ఆదేశాలు రాగానే టెండర్లు పిలుస్తారు. 1.50 టీఎంసీల సామర్థ్యం జలాశయానికి టెండర్లు పిలవాలని నేను కోరా. ఎత్తిపోతల పథకం పనులు త్వరలోనే చేపట్టే అవకాశం ఉంది.

- కృష్ణమోహన్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని