మెదడులో కల్పిత జ్ఞాపకాలు!
close
Updated : 16/06/2021 08:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెదడులో కల్పిత జ్ఞాపకాలు!

మట్టిలో విత్తనాలు నాటినట్టు మెదడులో జ్ఞాపకాలు నాటొచ్చా? అదీ కల్పిత జ్ఞాపకాలను! అసాధ్యమేమీ కాదని నిరూపించారు బ్రిటన్‌, జర్మనీ శాస్త్రవేత్తలు. ఇలా 52 మందిలో నాలుగు జ్ఞాపకాలను ప్రవేశపెట్టటంలో విజయం సాధించారు. వీటిల్లో రెండు నిజమైనవైతే, రెండు కల్పిత జ్ఞాపకాలు. ఇంతకీ కల్పిత జ్ఞాపకాలంటే? ఎన్నడూ జరగనివి. కానీ జరగటానికి ఆస్కారమున్నవి. ఉదాహరణకు- తప్పిపోవటం, పారిపోవటం, ప్రమాదానికి గురికావటం వంటివి. అధ్యయనంలో పాల్గొన్నవారి తల్లిదండ్రులు సహకరించటంతోనే ఇది సాధ్యమైంది. ఆయా జ్ఞాపకాలకు సంబంధించిన సంఘటనలు నిజంగానే జరిగాయని తమ పిల్లలను గట్టిగా ఒప్పించగలిగారు. దీంతో అవి నిజమేనని 40% మంది నమ్మటం విశేషం. అంటే జరగని సంఘటనలనూ జరిగినట్టు నమ్మించటమే కాదు, అవి మెదడులో స్థిరపడేటట్టూ శాస్త్రవేత్తలు చేయగలిగారు. అనంతరం అవన్నీ కల్పిత జ్ఞాపకాలని అసలు విషయాన్ని బయటపెట్టారు. కుటుంబ సభ్యుల కథనాలతో, ఫొటోలతో గానీ గుర్తుకుతెచ్చుకోవాలంటూ పదే పదే అడగటంతో గానీ మెదడులో ఇలాంటి సంఘటనలను జొప్పించే అవకాశముందని వారికి వివరించారు. దీంతో నిజమేనని నమ్మిన జ్ఞాపకాలను 74% మంది నిరాకరించారు. జరగనివి జరిగినట్టు చెప్పటమెందుకు? జ్ఞాపకాలుగా మెదడులో జొప్పించటమెందుకు? తిరిగి అవన్నీ కల్పితమని వివరించటమెందుకు? ఇంత కష్టం ఎందుకనేగా మీ సందేహం. కోర్టుల్లో కల్పిత, తప్పుడు జ్ఞాపకాలను సాక్ష్యాలుగా పేర్కొంటే తీర్పులు తారుమారైపోతాయి కదా. అందుకని జ్ఞాపకాలు ఎలా రూపొందుతాయో, వీటిని గుర్తించటమెలాగో, మార్చటమెలాగో తెలుసుకుంటే పలు విధాలుగా తోడ్పడగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యం, మానసిక పరిశోధనల వంటి వాటికీ ఉపయోగపడగలవని నిపుణులు భావిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని