‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ అప్పుడే సాధ్యం..! - global herd immunity possible in 2022
close
Published : 09/03/2021 21:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ అప్పుడే సాధ్యం..!

మిలిందా గేట్స్‌ అంచనా

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారిపై ఏడాదికి పైగా యావత్‌ ప్రపంచం పోరాడుతూనే ఉంది. ప్రస్తుతం కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ కొవిడ్‌ ఉద్ధృతి మాత్రం నియంత్రణలోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌పై హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడం 2022లోనే వీలవుతుందని బిల్‌గేట్స్‌ సతీమణి, గేట్స్‌ ఫౌండేషన్‌ సహ వ్యవస్థాపకురాలు మిలిందా గేట్స్‌ అభిప్రాయపడ్డారు.

‘కేవలం అమెరికానే కాకుండా దేశాలన్నీ కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమయంలో హెర్డ్‌ ఇమ్యూనిటీ కోసం యావత్‌ ప్రపంచం ఆశగా ఎదురుచూస్తోంది’ అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిలిందా గేట్స్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ జాన్సన్‌ & జాన్సన్‌ వంటి సింగిల్‌ డోసులో ఇచ్చే వ్యాక్సిన్‌ అన్ని దేశాలకు చేరడం లేదన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఇలాంటి వ్యాక్సిన్‌లు చాలావరకు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. తద్వారా వ్యాక్సిన్‌ను విస్తృతంగా పంపిణీ చేయడంతో హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించవచ్చని మిలిందా గేట్స్‌ అభిప్రాయపడ్డారు.

మరిన్ని మహమ్మారులపై సంసిద్ధత..

కొవిడ్ -19 మహమ్మారి బయటపడినప్పుడు ప్రపంచం సిద్ధంగా లేదు. కానీ, మరోసారి ఇలాంటి ఉపద్రవం వస్తే మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుందని భావిస్తున్నా’ అని మిలిందా గేట్స్ ఆశాభావం వ్యకంచేశారు. ప్రస్తుత సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని రానున్న రోజుల్లో వచ్చే మహమ్మారులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యూహాలతో సంసిద్ధంగా ఉండాలని ప్రపంచ దేశాలకు సూచించారు. ప్రపంచ దేశాలకు అందుబాటులో ఉండే హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంతో పాటు భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా ఇప్పటిలా కాకుండా వైరస్‌ల వ్యాప్తిని సాధ్యమైనంత వరకు నియంత్రించవచ్చని తెలిపారు.

ఇదిలాఉంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థకు గేట్స్‌ ఫౌండేషన్‌ భారీ ఎత్తున విరాళం ఇస్తోన్న విషయం తెలిసిందే. అమెరికా తర్వాత డబ్ల్యూహెచ్‌ఓకు అతిపెద్ద దాత వీరే కావటం గమనార్హం. కరోనాపై పోరాటంలో భాగంగా వివిధ కార్యక్రమాల కోసం గేట్స్‌ ఫౌండేషన్‌ భారీ విరాళాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని