హర్భజన్‌ స్పిన్‌ సుడిగుండంలో ఆసీస్‌..! - india scripted new record against australi on this day 20 years back
close
Updated : 22/03/2021 15:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హర్భజన్‌ స్పిన్‌ సుడిగుండంలో ఆసీస్‌..!

చారిత్రక విజయం సాధించిన గంగూలీ సేన

ప్రపంచ క్రికెట్‌లో ఏ జట్టుకైనా ఆస్ట్రేలియాతో పోరంటే అటు ఆటగాళ్లకే కాకుండా ఇటు అభిమానులకూ తీవ్ర ఆసక్తి కలుగుతుంది. మరీ ముఖ్యంగా 20 ఏళ్ల క్రితం ఆ జట్టు ఎంత భీకరంగా ఉండేదో అందరికీ తెలిసిందే. స్టీవ్‌వా నేతృత్వంలో ఓటమి ఎరగకుండా, వరుసగా 16 టెస్టులు గెలుస్తూ వచ్చిన కంగారూలను చివరికి గంగూలీ సారథ్యంలోని భారత జట్టు గడగడలాడించింది. యువ స్పిన్నర్‌గా హర్భజన్‌ తన గూగ్లీలతో కంగారు పెట్టించాడు. మూడు టెస్టుల్లో 32 వికెట్లు తీసి చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే టీమ్‌ఇండియా 2-1 తేడాతో ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. అది జరిగి నేటికి రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నాటి విశేషాలు మరోసారి గుర్తుచేసుకుందాం.


అలవోకగా ఆడిన హెడెన్‌, గిల్‌క్రిస్ట్‌..

మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ముంబయిలోని వాంఖడేలో జరిగింది. టీమ్‌ఇండియా 176 పరుగులకే చాపచుట్టేసిన వేళ అదే పిచ్‌పై ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ హెడెన్‌(119), గిల్‌క్రిస్ట్‌(122) శతకాలు బాదారు. వాళ్లిద్దరూ అలవోకగా ఆడడంతో ఆస్ట్రేలియా 349 పరుగులు చేసింది. ఆపై భారత్‌ 219 పరుగులకు రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌటవ్వగా, కంగారూలు మిగతా 47 పరుగులు సాధించి పది వికెట్లతో ఘన విజయం సాధించారు. దాంతో సిరీస్‌లో బోణీ కొట్టి భారత్‌ను ఆదిలోనే భయపెట్టింది. ఇక ఈ మ్యాచ్‌లో హర్భజన్‌ నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు.


బ్రేకులు వేసిన లక్ష్మణ్‌, ద్రవిడ్‌, హర్భజన్‌..

తొలి టెస్టులో పది వికెట్ల ఘోర పరాభవంతో రెండో టెస్టుకు సిద్ధమైన టీమ్‌ఇండియా ఇక్కడా పేలవంగా ఆరంభించింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పుంజుకొని కోల్‌కతా ఈడెన్‌లో చారిత్రక విజయం నమోదు చేసింది. తొలుత కంగారూలు 445 పరుగులు చేయగా, టీమ్‌ఇండియా 171 పరుగులకే ఆలౌటైంది. దాంతో మరో భారీ ఓటమి తప్పదని అంతా భావించారు. కానీ, ఫాలోఆన్‌ ఆడిన టీమ్‌ఇండియా అద్భుతం చేసింది. లక్ష్మణ్‌(281), ద్రవిడ్‌(180) పోరాటానికి రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ సాధించింది. చివరికి 657/7 స్కోర్‌ వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఆపై ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో హర్భజన్‌ హ్యాట్రిక్‌ వికెట్లు తీయడంతో 212 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతోనే ఆ జట్టు 16 టెస్టుల జైత్రయాత్రకు టీమ్‌ఇండియా బ్రేకులు వేసింది. ఈ మ్యాచ్‌లో భజ్జీ మొత్తం 13 వికెట్లు పడగొట్టడం విశేషం.


20లో 15 భజ్జీవే..

ఇక చెన్నైలోని చిదంబరం స్టేడియంలో హోరాహోరీగా జరిగిన మూడో టెస్టులో టీమ్‌ఇండియా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ నువ్వా నేనా అనే రీతిలో తలపడ్డాయి. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో హెడెన్‌(203) ద్విశతకం బాదడంతో ఆ జట్టు 391 పరుగులు చేసింది. ఆపై సచిన్‌(126) సెంచరీకి ఇతర బ్యాట్స్‌మెన్‌ రాణించడంతో టీమ్‌ఇండియా 501 పరుగులు చేసింది. ఆపై కంగారూలు రెండో ఇన్నింగ్స్‌లో 264 పరుగులకు ఆలౌటయ్యారు. చివరికి టీమ్‌ఇండియా ఎనిమిది వికెట్లు నష్టపోయి 155 పరుగులు సాధించింది. దాంతో భారత్‌ 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో హర్భజన్‌ ఒక్కడే 15 వికెట్లు తీయడం విశేషం. అలా టీమ్‌ఇండియా చారిత్రక విజయంలో భజ్జీ‌ 32 వికెట్లు సాధించి ముఖ్యభూమిక పోషించాడు.

-ఇంటర్నెట్‌డెస్క్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని