Vaccine విధానంలో కోర్టు జోక్యం తగదు - little room for judicial interference in vaccine policy says centre in affidavit
close
Updated : 10/05/2021 12:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vaccine విధానంలో కోర్టు జోక్యం తగదు

అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్రం

దిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ ధరలు, టీకాల కొరతపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ విధానాన్ని కేంద్రం సమర్థించింది. ప్రస్తుత మహమ్మారి సంక్షోభం వేళ ప్రజాప్రయోజనాల దృష్ట్యా నిపుణులు, శాస్త్రీయ సలహాలతో టీకా విధానాన్ని రూపొందించామని తెలిపింది. ప్రజాప్రయోజనాల నిర్ణయాల్లో న్యాయవ్యవస్థ జోక్యం తగదని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో 218 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది. 

దేశంలో కరోనా పరిస్థితులు, కొవిడ్‌ నిర్వహణ, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయస్థానం నేడు విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో కోర్టు నోటీసులపై ఆదివారం అర్ధరాత్రి కేంద్రం ఈ అఫిడవిట్‌ దాఖలు చేసింది. టీకా విధానంతో పాటు కొవిడ్‌ నిర్వహణను కేంద్రం ఇందులో వివరించింది. ‘‘కొవిడ్ మహమ్మారి పరిస్థితుల్లో దేశం అవలంబిస్తున్న విధానాలు, వ్యూహాలు పూర్తిగా వైద్య నిపుణులు, శాస్త్రీయ సలహాలతో చేపడుతున్నవే. వీటిలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడం తగదు. అలా చేస్తే మునుపెన్నడూ చూడని అనాలోచిత పరిణామాలను చూడాల్సి వస్తుంది’’ అని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది. 

దేశంలో టీకా ధరలు సహేతుకమే గాక, దేశమంతటా ధరలు ఏకరీతిన ఉన్నాయని తెలిపింది. పోటీతత్వ మార్కెట్ ఏర్పాటు.. ప్రయివేటు వ్యాక్సిన్ తయారీదారులకు ప్రోత్సాహక డిమాండ్‌ను సృష్టించే పద్ధతిలో భాగంగానే టీకా ధరల్లోనే వ్యత్యాసాలు ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. దీని ద్వారా ఉత్పత్తి పెరగడంతో పాటు  విదేశీ టీకా తయారీదారులు కూడా దేశంలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతారని అభిప్రాయపడింది. తద్వారా వ్యాక్సిన్ల లభ్యతను పెంచొచ్చని తెలిపింది. అయితే ధరలు ఎలా ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా అందరికీ ఉచిత టీకా అందుతోందని కేంద్రం వివరించింది. 18-45 మధ్య వయస్కులకు అనేక రాష్ట్రాలు ఉచిత టీకాలు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది.  

ఈ సందర్భంగా కొవిడ్‌ నిర్వహణ గురించి కూడా కేంద్రం వివరించింది. కరోనా బాధితులు దేశంలో ఎక్కడైనా చికిత్స తీసుకునే వెసులుబాటును కల్పిస్తూ జాతీయ విధానంలో మార్పులు చేసినట్లు తెలిపింది. కొవిడ్‌ కేంద్రాలు, పడకలు, సిబ్బందిని పెంచామని, వైద్య విద్యార్థులను కూడా కొవిడ్‌ సేవల్లో భాగస్వాములను చేసినట్లు పేర్కొంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని