కరోనా మరణాల్లేని 20 రాష్ట్రాలివే..!   - no covid deaths in 20states and uts
close
Published : 01/03/2021 16:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా మరణాల్లేని 20 రాష్ట్రాలివే..! 

ఆ 6 రాష్ట్రాలతోనే యాక్టివ్‌ కేసుల గ్రాఫ్‌ పైకి..

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతున్న ఈ జిత్తులమారి వైరస్‌ ప్రజల్ని కలవరానికి గురిచేస్తోంది. తాజాగా దేశ వ్యాప్తంగా ఈ వైరస్‌ ప్రభావం అంతగా కనబడనప్పటికీ కేవలం ఐదారు రాష్ట్రాల్లో మాత్రం తీవ్రంగానే ఉంది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త మరణాలు నమోదుకాకపోవడం విశేషం. నిన్న 106 కొవిడ్‌ మరణాలు నమోదైనప్పటికీ వీటిలో 87% మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, తమిళనాడులలోనే రావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఒక్క కొవిడ్‌ మరణం కూడా సంభవించలేదు.

ఇక్కడ కొత్త మరణాల్లేవ్‌..

దేశంలో 20 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్తగా మరణాలు సంభవించకపోవడం ఉపశమనం కలిగిస్తోంది. తెలంగాణ, యూపీ, రాజస్థాన్‌, ఏపీ, బిహార్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పుదుచ్చేరి, అసోం, మణిపూర్‌, సిక్కిం, మిజోరం, నాగాలాండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, త్రిపుర, లక్షద్వీప్‌, మేఘాలయ, లద్దాఖ్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు, ఉత్తరాఖండ్‌, దాద్రానగర్‌ హవేలీ డామన్‌ డయ్యూలలో కొత్తగా కొవిడ్‌ మరణాలు నమోదు కాలేదని కేంద్రం తెలిపింది. గడిచిన 24గంటల్లో 106 మరణాలు నమోదైనప్పటికీ వాటిలో 87శాతం కేవలం ఐదు రాష్ట్రాల్లోనే.  కొత్త మరణాల్లో మహారాష్ట్రలో 62, కేరళ 15, పంజాబ్‌ 7, కర్ణాటక 5, తమిళనాడు 3చొప్పున నమోదయ్యాయి.

ఆ 6 రాష్ట్రాలతోనే యాక్టివ్‌ కేసులు పైపైకి!

మరోవైపు, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ వైరస్‌ స్వైర విహారం చేస్తుండటంతో యాక్టివ్‌ కేసుల గ్రాఫ్‌ పైపైకి పోతోంది. ఆదివారం ఒక్కరోజే 15,510 కొత్త కేసులు రాగా.. వాటిలో 87.25% కేవలం ఆరు రాష్ట్రాల్లోనే వచ్చాయి. మహారాష్ట్ర (8293) కేరళ (3254), పంజాబ్‌ (579), కర్ణాటక (521), తమిళనాడు (479), గుజరాత్‌ (407)లలో కొత్త కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ప్రస్తుతం 1,68,627 యాక్టివ్‌ కేసులు (1.52%) ఉన్నాయి. వీటిలో కేవలం 5 రాష్ట్రాల్లోనే 84% యాక్టివ్‌ కేసులు ఉండటం గమనార్హం. ముఖ్యంగా మహారాష్ట్రలో 46.39% ఉండగా.. కేరళలో 29.49% ఉన్నాయి. ఇక కర్ణాటకలో 3.45%, పంజాబ్‌లో 2.75%, తమిళనాడులో 2.39% చొప్పున  ఉండగా.. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి యాక్టివ్‌ కేసుల శాతం 15.52% ఉంది.

అరుణాచల్‌ ప్రదేశ్‌లో ‘సున్నా’

21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో యాక్టివ్‌ కేసులు 1000 కన్నా తక్కువగానే ఉండగా.. 15రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో వెయ్యి కన్నా ఎక్కువ క్రియాశీల కేసులు ఉన్నట్టు కేంద్రం తెలిపింది. వీటిలో కేరళ, మహారాష్ట్రలో 10వేలకు పైగా కేసులు ఉండగా.. మిగతా 13 రాష్ట్రాల్లో వెయ్యి నుంచి 10వేల వరకు యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఒక్క యాక్టివ్‌ కేసు కూడా లేకపోవడం విశేషం.

శరవేగంగా కొవిడ్‌ టీకా పంపిణీ
మరోవైపు, దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 1,43,1266 వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. తొలి డోసు 66,69,985 మంది, రెండో డోసు 24,56,191 మంది ఆరోగ్య కార్యకర్తలకు పంపిణీ చేసినట్టు వివరించారు. అలాగే, 51,75,090 మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు తొలి డోసు అందించినట్టు తెలిపారు. మరోవైపు, నేటి నుంచి 60 ఏళ్లు పైబడిన వారితో పాటు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న 45 ఏళ్లు పైబడిన వారికి టీకాలు పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని