రూపాయి ఇచ్చి పాఠాలు చెబుతున్న టీచర్‌ - story on krishna district teacher who gives daily one rupee to students
close
Published : 10/04/2021 14:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూపాయి ఇచ్చి పాఠాలు చెబుతున్న టీచర్‌

జీతంలో 30 శాతం విద్యార్థులకే!

కృష్ణా: పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు మాత్రమే ఉండటం చూసిన ఓ టీచర్‌ ఆ పరిస్థితిని మార్చాలనుకున్నారు. పిల్లలను బడిలో చేర్పిస్తే వారి పేరుమీద డబ్బులు జమ చేస్తానని తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. రోజుకు రూపాయి జమచేస్తూ వారి నమ్మకాన్ని చూరగొన్నారు. ఇలా పేద విద్యార్థులకు చదువుతోపాటు వారి బంగారు భవితకు బాటలు వేస్తున్నారు కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న జె.పద్మావతి. ప్రస్తుతం అవనిగడ్డ మండలం బందలాయి చెరువు ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు.

పద్మావతిని అందరూ ‘రూపాయి టీచర్‌’ అని ముద్దుగా పిలుస్తారు. రోజూ పిల్లలకు రూపాయి ఇచ్చి విద్యాబుద్ధులు నేర్పుతారు. గతంలో అవనిగడ్డ మండలం గుడివాకవారి పాలెం పాఠశాలలో పనిచేసిన పద్మావతి.. బడిలో ఆరుగురు విద్యార్థులు ఉండటం గమనించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలనుకుని ఓ మంచి ఆలోచనకు శ్రీకారం చుట్టారు. పిల్లల పేరు మీద రికరింగ్‌ డిపాజిట్‌ (ఆర్డీ) అకౌంట్‌ తెరిచి, ప్రతి విద్యార్థి పేరుమీద రోజుకు రూపాయి చొప్పున.. నెలకు రూ. 30 జమచేయాలని భావించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసి తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఆ టీచర్ మీద నమ్మకంతో అమ్మానాన్నలు తమ పిల్లలను బడిలో చేర్పించారు. అలా ఆరుగురు కాస్తా 45 మంది అయ్యారు.

పద్మావతి 30 శాతం జీతాన్ని విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఖర్చు చేస్తున్నారు. పొదుపు ఖాతాల్లో డబ్బులు జమచేయడమే కాకుండా పిల్లలకు అవసరమైనప్పుడు పుస్తకాలు, పెన్నులు అందజేస్తున్నారు. అలా విద్యార్థులకు విద్యతోపాటు, పొదుపుపై పాఠాలు చెబుతూ.. వారి ఉన్నత భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నారు. ఆమె ఏ పాఠశాలకు వెళ్లినా పొదుపు ఖాతాల విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఆమె కృషిని విద్యార్థుల తల్లిదండ్రులు, తోటి ఉపాధ్యాయులు కొనియాడుతున్నారు. పేదలకు వీలైనంత సేవ చేయడమే లక్ష్యమంటున్న పద్మావతి, ఉద్యోగ విరమణ తర్వాత వృద్ధులకు సేవ చేస్తానంటున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని