High Court: మరమ్మతులకు దశాబ్దాలు కావాలా? - telangana high court fires on roads repair
close
Updated : 20/07/2021 16:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

High Court: మరమ్మతులకు దశాబ్దాలు కావాలా?

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్ఎంసీ) పరిధిలో రోడ్ల గుంతలపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం పనితీరుపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. రోడ్ల మరమ్మతులు పూర్తి చేసేందుకు ఎన్ని దశాబ్దాలు కావాలని ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలు పోతుంటే మరమ్మతులకు దశాబ్దాలు కావాలా?అంటూ తీవ్రం అసహనం వ్యక్తం చేసింది.

విశ్రాంత ఉద్యోగి గంగాధర్ తిలక్ పింఛను డబ్బుతో గుంతలు పూడ్చటంపై జరిగిన విచారణలో జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. రోడ్ల పరిస్థితిపై హైకోర్టుకు నివేదిక సమర్పించారు. 9,013 కి.మీ. రోడ్లలో 6వేల కి.మీ. పైగా సిమెంట్ రోడ్లు వేశామని కోర్టుకు నివేదించారు. వర్షాకాలంలో గుంతల పూడ్చివేత పనులు రోజూ జరుగుతున్నాయని పేర్కొన్నారు. రోడ్ల మరమ్మతుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.

ప్రతీ వర్షాకాలంలో నీళ్లు నిలిచే ప్రాంతాలను గుర్తించి సరిచేయాలని ఈ సందర్భంగా హైకోర్టు అధికారులను ఆదేశించింది. వరద నీటి కాలువలు, రోడ్ల మరమ్మతులు పెంచాలని, రాష్ట్రమంతటికీ ఆదర్శంగా నిలిచేలా హైదరాబాద్ ఉండాలని న్యాయమూర్తి సూచించారు. అంతర్జాతీయంగా పేరున్న హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి అవసరమన్న హైకోర్టు వసతులు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని తెలిపింది. రోడ్ల మరమ్మతుల విషయంలో రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది.

పింఛను డబ్బుతో తిలక్‌ దంపతులు గుంతలు పూడుస్తున్నారన్న ఓ పత్రికలో కథనంపై వారం రోజుల కిందట హైకోర్టు విచారణ చేపట్టింది. వృద్ధ దంపతులు రోడ్ల మరమ్మతులు చేస్తుంటే జీహెచ్‌ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని అప్పట్లో హైకోర్టు ప్రశ్నించింది. రోడ్ల దుస్థితి చూడలేక వృద్ధ దంపతులు నడుం బిగించడం జీహెచ్‌ఎంసీకి సిగ్గుచేటని హైకోర్టు వ్యాఖ్యానించింది. జీహెచ్‌ఎంసీ అధికారుల వేతనాలను తిలక్‌ దంపతులకు ఇవ్వడం మేలని అభిప్రాయపడింది. వర్షా కాలంలో దెబ్బతినే రోడ్ల మరమ్మతుల కోసం ప్రణాళికలేంటని జీహెచ్‌ఎంసీని ప్రశ్నించిన హైకోర్టు.. జోన్ల వారీగా జోనల్‌  కమిషనర్లు, ఎస్‌ఈలు నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. దీంతో అధికారులు నివేదకలను మంగళవారం కోర్టుకు సమర్పించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని