కరోనా వైరస్‌: ఇక్కడ అన్ని చిత్రాలు రీషెడ్యూల్‌ చేయబడును - telugu movies deley due to coronavirus
close
Published : 28/08/2020 13:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా వైరస్‌: ఇక్కడ అన్ని చిత్రాలు రీషెడ్యూల్‌ చేయబడును

ఇంటర్నెట్‌డెస్క్‌: కంటికి కూడా కనిపించని ఒక చిన్న వైరస్‌ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. కరోనా వైరస్‌ ధాటికి అన్ని రంగాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. అందుకు సినిమా రంగం ఏమీ మినహాయింపు కాదు. కొత్త సినిమాలతో, ఐపీఎల్‌ మ్యాచ్‌లతో సరదాగా, సందడిగా సాగాల్సిన వేసవి లాక్‌డౌన్‌తో ముగిసిపోయింది. విడుదలకు సిద్ధమైన చిత్రాలు ఆగిపోగా, చిత్రీకరణ దశలో ఉన్నవి పేకప్‌ చెప్పేశాయి.

కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఆంక్షలు సడలిస్తోంది. ఇటీవల షూటింగ్‌లకు సైతం అనుమతులు ఇచ్చింది. దీంతో ఒక్కొక్కరూ క్లాప్‌బోర్డుల దుమ్ము దులుపుతున్నారు. తాజాగా ‘కేజీయఫ్‌2’ చిత్రీకరణ మొదలైంది. అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం ఇంకా షూటింగ్‌ దశలోనే ఉండిపోయింది. ప్రతి సినిమా పరిస్థితి ఇదే. అయితే, ఇప్పటికే ఫలానా రోజు వస్తామంటూ ప్రకటించిన చిత్ర బృందాలు ఇప్పుడన్నీ రీషెడ్యూల్‌ చేస్తున్నాయి.

‘ఉగాది కరోనా మొదలైంది.. వినాయకచవితికి వెళ్లిపోతుందేమో అనుకున్నారు. దసరా, సంక్రాంతికి కూడా వెళ్లేట్లు లేదు’ ఇది ఇటీవల వాట్పాప్‌లో కరోనాపై చక్కర్లు కొట్టిన వ్యంగ్యాస్తం. వేసవి తర్వాత చిత్ర పరిశ్రమకు కాస్త పెద్ద సీజన్‌ అంటే దసరా, దీపావళి. తెలుగుతో పాటు, అటు బాలీవుడ్‌, ఇటు కోలీవుడ్‌లోనూ సందడి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈసారి దసరాకు ఆ సందడి ఉండకపోవచ్చు. వేసవిలో విడుదల కావాల్సిన పవన్‌ ‘వకీల్‌ సాబ్‌’ దసరాకు తీసుకొద్దామని అనుకున్నారు. ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’, బాలకృష్ణ-బోయపాటి చిత్రం, వెంకటేశ్‌ ‘నారప్ప’ చిత్రాలు కూడా కాస్త అటూ ఇటూగానే రావాల్సి ఉంది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఈ ఏడాది వస్తాయా? అన్న అనుమానం నెలకొంది. అన్ని బాగుంటే బాలీవుడ్‌ చిత్రాలు ‘సూర్యవంశి’, ‘83’లకు దీపావళికి తీస్తుకొస్తామని చెబుతున్నా.. వచ్చే వరకూ నమ్మకం లేదు.

 

సంక్రాంతికి లేనట్టే..

లాక్‌డౌన్‌ ప్రకటించక ముందు వరకూ అందరి చూపు సంక్రాంతి 2021పైనే ఉండేది. పెద్ద పండగకు దాదాపు ఆరెడు నెలల ముందు నుంచే చిత్ర నిర్మాతల మధ్య తేదీల విషయంలో పోటీ నెలకొంటుంది. సంక్రాంతికి అగ్ర కథానాయకుల చిత్రాలకు ఉండే క్రేజ్‌ వేరు. అయితే, ఈ సారి ఏ సినిమాలు వస్తాయో? ఏవి రావో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. జనవరి 8న తమ చిత్రాన్ని తీసుకురానున్నట్లు ‘ఆర్‌ఆర్ఆర్‌’, బృందం గతంలోనే ప్రకటించింది. కరోనాతో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారు అయ్యాయి. ఇప్పటికిప్పుడు షూటింగ్‌ మొదలు పెట్టే పరిస్థితి లేదు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు సైతం కూల్‌గా ఉన్నారు. ‘షూటింగ్‌ ఎప్పుడు మొదలు పెడతారో చెప్పండి. మేకోవర్‌ మళ్లీ మొదలు పెడతాం’ అంటున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళినే స్వయంగా చెప్పారు. అన్ని జాగ్రత్తలతో షూటింగ్‌ మొదలు పెట్టినా, సినిమా పూర్తి కావడానికి ఏడెనెమిది నెలలు పట్టే అవకాశం ఉందని జక్కన చెబుతున్నారు.

అగ్ర కథానాయకుడు చిరంజీవి కొత్త చిత్రం పరిస్థితి కూడా అంతే, కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘ఆచార్య’ ఈ ఏడాదిలోనే విడుదల కావాల్సి ఉంది. ఒకవేళ కుదరకపోతే సంక్రాంతికి వద్దమని అనుకున్నారు. ఇప్పుడు ఏకంగా వచ్చే ఏడాది వేసవికి వెళ్లిపోయింది. మరోవైపు పవన్‌-క్రిష్‌ చిత్రం పరిస్థితి కూడా అంతే. ఆ సినిమా ప్రస్తుతానికి వాయిదా పడింది. ఇప్పుడు క్రిష్‌ మరో ప్రాజెక్టును మొదలు పెట్టేశారు.  మెగా హీరోలు అల్లు అర్జున్‌, వరుణ్‌ తేజ్‌ల పరిస్థితి కూడా అంతే. సుకుమార్‌ దర్శకత్వంలో బన్ని నటిస్తున్న చిత్రం ‘పుష్ప’ మళ్లీ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంతో చెప్పలేని పరిస్థితి.  బాక్సర్‌ వరుణ్‌ నటిస్తున్న చిత్రమూ అంతే.

ఇక వేగంగా చిత్రాలు తీయడంలో దర్శకుడు పూరి జగన్నాథ్‌ను మించిన వారు లేరు. విజయ్‌ దేవరకొండతో ఆయన తీస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘ఫైటర్‌’(వర్కింగ్‌ టైటిల్‌). ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తయింది. అన్నీ సవ్యంగా సాగి ఉంటే, ఈ ఏడాదిలోనే ‘ఫైటర్‌’ మనల్ని పలకరించేవాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యం. వీళ్లే కాదు, వేగంగా చిత్రాలు చేసే నాని, రవితేజ, చిత్రాలు సైతం మరింత ఆలస్యం కానున్నాయి. మహేశ్‌ ‘సర్కారు వారి పాట’, మంచు మనోజ్‌ ‘అహం బ్రహ్మాస్మి’ తదితర చిత్రాలు కొబ్బరికాయ కొట్టినా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ సినిమాలన్నీ ఎప్పుడు మొదలవుతాయో సమాధానం చెప్పాల్సింది కరోనాయే.

 

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని