Varudu Kavalenu: అదొక్కటే నేను నమ్మే సిద్ధాంతం - telugu news Varudu Kavalenu Director Lakshmi Interview
close
Updated : 26/10/2021 07:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Varudu Kavalenu: అదొక్కటే నేను నమ్మే సిద్ధాంతం

‘‘దర్శకత్వం అంటే చాలా బాధ్యత గల వృత్తి. మనల్ని చూసి చాలా మంది స్ఫూర్తి పొందుతారు. కాబట్టి వాళ్లెవరినీ తప్పుదోవ పట్టించకూడదు. అందుకే నేను ఏ సినిమా చేసినా.. అది ప్రేక్షకులను నవ్వించడమో, లేదంటే ఏదైనా మంచి విషయం నేర్పించేలాగానో ఉండాలనుకుంటా’’ అన్నారు లక్ష్మీ సౌజన్య. ‘వరుడు కావలెను’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్న కొత్త దర్శకురాలు ఆమె. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు లక్ష్మీ సౌజన్య.

దర్శకురాలిగా తొలి ప్రయత్నంలోనే పెద్ద సంస్థలో చేసే అవకాశం దొరికింది. ఎలా అనిపిస్తుంది?  

చాలా ఆనందంగా ఉంది. తొలి అడుగులోనే ఇంత పెద్ద బ్యానర్‌లో పని చేసే అవకాశం రావడమంటే మామూలు విషయం కాదు. అందులోనూ ఓ కొత్త లేడీ డైరెక్టర్‌ను నమ్మి సినిమా ఇవ్వడమంటే గొప్ప అదృష్టమనే అనుకోవాలి. నేను 2017లో చిన్నబాబు సర్‌ని కలిసి ఓ స్టోరీ లైన్‌ చెప్పా. ఆ ఐడియా ఆయనకి బాగా నచ్చింది. అక్కడి నుంచి ఈ ప్రాజెక్ట్‌ పనులు మొదలయ్యాయి. అయితే కరోనా పరిస్థితుల వల్ల సినిమా రెండేళ్లు ఆలస్యమైంది.

ఈ కథ తొలుత మరో హీరోకి చెప్పినట్లున్నారు?

అవును. ఈ కథ తొలుత నాగచైతన్యకు చెప్పా. ఆయనకి చాలా నచ్చింది. కానీ, కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు. అప్పుడే నాగశౌర్యను కలిసి కథ వినిపించా. నిజానికి ఈ కథ రాసేటప్పుడు శౌర్యనే దృష్టిలో పెట్టుకున్నాను. ఎందుకంటే ఆత్మాభిమానం ఉన్న ఓ అమ్మాయి.. ఒక అబ్బాయిని ప్రేమించాలంటే అతనిలో చాలా క్వాలిటీస్‌ ఉండాలి. ముఖ్యంగా చూడగానే ఆకర్షించే అందం.. మంచి లక్షణాలుండాలి. అవన్నీ శౌర్యలో సహజంగానే చూశా.

పెళ్లి నేపథ్యంలో గతంలో చాలా చిత్రాలొచ్చాయి. వాటికీ ఈ సినిమాకి తేడా ఏంటి?

నేపథ్యాలు ఒకే తరహాలో ఉండొచ్చు కానీ, అందులోని కథ.. పాత్రలు, వాటి తాలూకూ నేపథ్యం, భావోద్వేగాలు అన్నీ భిన్నంగానే ఉంటాయి. వీటన్నింటినీ ఎంత కొత్తగా చూపించామన్నదే ముఖ్యం. ఆ కొత్తదనం
ఈ సినిమాలో ప్రతి ఫ్రేంలో కనిపిస్తుంది. మన చుట్టు పక్కల కనిపించే వ్యక్తుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకునే ఈ కథ సిద్ధం చేసుకున్నా. ఎలా ఉంటే అబ్బాయిలు.. అమ్మాయిలకు నచ్చుతారన్నది ఈ
సినిమాతో తెలుసుకుంటారు (నవ్వుతూ).

మీ నేపథ్యం ఏంటి? సినిమాల వైపు ఎలా వచ్చారు?

నేను పుట్టింది కర్నూల్‌ జిల్లాలోని వెంకటాపురం అనే గ్రామంలో. పెరిగిందంతా గుంటూరు జిల్లాలోని నరసరావు పేటలో. నాన్న మ్యాథ్స్‌ లెక్చరర్‌. నేను 11ఏళ్లకే పదో తరగతి పరీక్షలు రాశా. అప్పట్లో నేను ఆటలు బాగా ఆడేదాన్ని. అందుకే నాన్న నన్ను ఓ ప్లేయర్‌గా చూడాలనుకునే వారు. నాకు మాత్రం సినిమాల్లోకి రావాలని ఉండేది. ఆ ఆసక్తితోనే 18ఏళ్ల వయసులో హైదరాబాద్‌కు వచ్చేశాను. నేను చేసిన ఓ ప్రకటన చూసి తేజ సర్‌ నాకు సహాయ దర్శకురాలిగా అవకాశమిచ్చారు. అక్కడి నుంచి శేఖర్‌ కమ్ముల, కృష్ణవంశీ, క్రిష్‌, మంజుల ఇలా చాలా మంది ప్రముఖ దర్శకులతో కలిసి పని చేశాను. ఓవైపు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తూనే.. చాలా వాణిజ్య ప్రకటనలు రూపొందించాను.


‘‘నేను నమ్మే సిద్ధాంతమొకటే.. మనం పది మందిని బాగు చేయకపోయినా పర్లేదు కానీ, ఒక్కరిని కూడా చెడకొట్టకూడదు. నా చిత్రాలన్నీ దీనికి తగ్గట్లుగానే ఉండాలనుకుంటా. ప్రస్తుతం ఓ విభిన్నమైన నేపథ్యంలో ఒక చక్కటి కథ సిద్ధం చేశా. మనందరం గుర్తింపు కోసం చాలా తాపత్రయ పడుతుంటాం కదా. ఈ పాయింట్‌తోనే ఆధార్‌ కార్డ్‌ నేపథ్యంలో ఆ స్క్రిప్ట్‌ సిద్ధం చేశా. అది ఎవరితో ఉంటుంది? ఎప్పుడు మొదలవుతుంది? అన్నది త్వరలో తెలియజేస్తా’’.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని