Cinema News: వారం వారం.. అందాల హారం - telugu news heroines busy in 2021
close
Updated : 13/09/2021 10:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: వారం వారం.. అందాల హారం

‘సంక్రాంతికి ఒకటి.. ఉగాదికి మరొకటి.. దసరాకి ఇంకొకటి’ అంటూ వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ ముందు సందడి చేస్తుంటారు కథానాయికలు. సినీప్రియులకు సొగసుల వినోదం కొసరి కొసరి వడ్డిస్తుంటారు. అయితే వారి వేగానికి కొన్నాళ్లుగా కరోనా రూపంలో కళ్లెం పడ్డట్లయింది. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితులన్నీ కుదుటపడుతున్నాయి. మునుపటికంటే వేగంగా వారాల వ్యవధిలోనే తమ చిత్రాలతో వయ్యారి భామలు దూసుకొస్తున్నారు. వరుస చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.

జెట్‌ స్పీడ్‌తో కెరీర్‌ను  పరుగులు పెట్టించే కథానాయికలంతా.. వాయిదా పడిన వినోదాల్ని వడ్డీ సహా తీర్చేస్తున్నారు. వారానికొక చిత్రం చొప్పున బాక్సాఫీస్‌ ముందుకు తీసుకొస్తూ.. ప్రేక్షకుల్ని వినోదాల జల్లుల్లో తడిపేస్తున్నారు. చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నా.. కరోనా పరిస్థితుల వల్ల గతేడాది ఒక్క చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేక పోయింది నటి తమన్నా. ఇప్పుడా లోటును వారం వ్యవధిలోనే వరుస సినిమాలతో తీర్చే ప్రయత్నం చేస్తోంది మిల్కీబ్యూటీ. వినాయక చవితి సందర్భంగా ‘సీటీమార్‌’ చిత్రంతో బాక్సాఫీస్‌ ముందుకొచ్చిన ఈ భామ.. ఈ వారం ‘మాస్ట్రో’తో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల్ని పలకరించనుంది. తమన్నా ప్రతినాయక ఛాయలున్న ఓ శక్తిమంతమైన పాత్రలో కనిపించనుంది. అందుకే ఆమె కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన ఈ చిత్రం కోసం సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది తమన్నా నుంచి ‘గుర్తుందా శీతాకాలం’ అనే మరో సినిమా రానున్నట్లు తెలుస్తోంది. సత్యదేవ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం.. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది.

‘ఛల్‌ మోహనరంగ’ సినిమా తర్వాత పూర్తిగా తమిళ చిత్రసీమకే పరిమితమైపోయింది నటి మేఘా ఆకాష్‌. ఈ ఏడాది మాత్రం వారాల వ్యవధిలోనే రెండు తెలుగు చిత్రాలు విడుదల చేసి, ప్రేక్షకుల్ని మెప్పించింది. సెప్టెంబరు ఆఖరి వారంలో శ్రీవిష్ణుతో కలిసి ‘రాజ రాజ చోర’ సినిమాతో బాక్సాఫీస్‌ ముందుకొచ్చిన ఈ భామ.. ఈనెల తొలి వారం అరుణ్‌ అదిత్‌తో కలిసి ‘డియర్‌ మేఘ’గా థియేటర్లలో సందడి చేసింది. వీటిలో ‘రాజ రాజ చోర’కు సినీప్రియుల నుంచి మంచి ఆదరణ దక్కినా.. ‘డియర్‌ మేఘ’తో ఆశించిన    ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆమె ప్రస్తుతం ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

‘టాక్సీవాలా’ చిత్రం తర్వాత రెండేళ్ల పాటు వెండితెరపై కనిపించలేదు సీమ సుందరి ప్రియాంక జవాల్కర్‌. ఓవైపు వరుస సినిమాలతో సెట్స్‌పై తీరిక లేకుండా ఉన్నా.. కరోనా తెచ్చిన విరామం వల్ల వాటిని ప్రేక్షకులకు చూపించలేకపోయింది. ఇప్పుడా చిత్రాల్లో రెండింటిని వారాలా వ్యవధిలో బాక్సాఫీస్‌ ముందుకు తీసుకొచ్చి.. సినీప్రియులకు వినోదం పంచిచ్చింది. జులై ఆఖరి వారంలో ‘తిమ్మరుసు’ సినిమాతో థియేటర్లలో సందడి చేసిన ఈ అమ్మడు.. ఆ మరుసటి వారమే ‘ఎస్‌.ఆర్‌.కల్యాణమంపం’ చిత్రంతో బాక్సాఫీస్‌ తలుపు తట్టింది. ఇప్పుడీ భామ ‘గమనం’ సినిమాతో మళ్లీ సిద్ధమవుతోంది. శ్రియ, నిత్యా మేనన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో ప్రియాంక ఓ కీలక పాత్రలో నటించింది. సుజనారావు తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానుంది.

వీళ్లే కాదు.. ప్రస్తుతం ‘టక్‌ జగదీష్‌’ సినిమాతో ఓటీటీ వేదికగా వినోదాలు పంచుతున్న రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌ మరికొన్ని వారాల్లోనే మరో చిత్రంతో బాక్సాఫీస్‌ ముందుకు రానున్నారు. సాయితేజ్‌కు జోడీగా ఐశ్వర్య నటించిన ‘రిపబ్లిక్‌’ చిత్రం అక్టోబరు 1న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి  తెలిసిందే. ఇక నాగశౌర్యతో కలిసి రీతూ నటించిన ‘వరుడు కావలెను’ సినిమా సైతం అక్టోబరులోనే థియేటర్లలోకి రానుంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని