INDvsENG: మూడో టెస్టుకు బలంగా కనిపిస్తున్న కోహ్లీసేన - telugu news team india looking better than england in third test
close
Published : 25/08/2021 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

INDvsENG: మూడో టెస్టుకు బలంగా కనిపిస్తున్న కోహ్లీసేన

రెండు మార్పులతో ఇంగ్లాండ్‌ బరిలోకి..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య మరో రసవత్తరపోరుకు సమయం దగ్గరపడింది. బుధవారం నుంచి ఇరు జట్లూ హెడింగ్లీ లీడ్స్‌ వేదికగా మూడో టెస్టులో తలపడనున్నాయి. ఇప్పటికే లార్డ్స్‌లో ఘన విజయం సాధించిన టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్‌లో దూసుకుపోవాలని చూస్తోంది. మరోవైపు రెండో టెస్టులో అధికభాగం ఆధిపత్యం చెలాయించిన ఆతిథ్య జట్టు చివరిరోజు అనూహ్య రీతిలో ఓటమిపాలైంది. దాంతో మూడో టెస్టులోనైనా కోహ్లీసేననను ఓడించి సిరీస్‌ సమం చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మరో ఆసక్తికర టెస్టు తప్పదనే అనిపిస్తోంది.

ఆ ముగ్గురు రాణిస్తే..

టీమ్‌ఇండియా ప్రస్తుత పరిస్థితుల్లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ మినహా అన్ని విభాగాల్లో ఇంగ్లాండ్‌ కన్నా బలంగా కనిపిస్తోంది. ఓపెనర్ల నుంచి టెయిలెండర్ల వరకు ఆటగాళ్లంతా తమపని తాము చేసుకుపోతున్నారు. ఓపెనర్లు రోహిత్, రాహుల్‌ శుభారంభాలతో గట్టి పునాదులు వేస్తుండగా తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్‌లో పుజారా, కోహ్లీ, రహానె కాస్త ఆందోళన కలిగిస్తున్నారు. అయితే, రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పుజారా, రహానె.. 50 ఓవర్లు బ్యాటింగ్‌ చేసి మళ్లీ లయ అందుకున్నట్లు కనిపించారు. అలాంటప్పుడు కోహ్లీ కూడా మూడో టెస్టులో భారీ ఇన్నింగ్స్‌ ఆడితే ఆతిథ్య జట్టుకు కష్టాలు తప్పవు. మిడిల్‌ ఆర్డర్‌లో పంత్‌, జడేజా వీలైనన్ని పరుగులు చేస్తున్నారు. ఇక టెయిలెండర్లలో బుమ్రా, షమి ఎలాంటి పరుగులు చేశారో అందరికీ తెలిసిందే. బౌలింగ్‌లోనూ ప్రతి ఒక్కరు వికెట్లు తీస్తుండటంతో భారత్‌ మెరుగైన స్థితిలో కొనసాగుతోంది.

రూట్‌ ఒక్కడు విఫలమైతే..

ఇక ఇంగ్లాండ్‌ జట్టులో కెప్టెన్‌ జోరూట్ మినహా పెద్దగా ఎవరూ బ్యాటింగ్‌ చేయలేకపోతున్నారు. ఓపెనర్లు డోమ్‌ సిబ్లీ, రోరీ బర్న్స్‌ శుభారంభాలు చేయలేక చతికిల పడుతున్నారు. ఈ క్రమంలోనే మూడో టెస్టుకు సిబ్లీని తొలగించి జట్టు యాజమాన్యం డేవిడ్‌ మలన్‌ను తుదిజట్టులోకి తీసుకుంది. ఇక ఆతిథ్య జట్టులో ఎవరైనా నిలకడగా పరుగులు చేస్తున్నారా అంటే రూట్‌ ఒక్కడే కనిపిస్తున్నాడు. అతడిని ఎంత త్వరగా ఔట్‌ చేస్తే టీమ్‌ఇండియాకు అంత మంచి అవకాశం లభించినట్లే. మిడిల్‌ ఆర్డర్‌లో జానీ బెయిర్‌స్టో, జోస్‌బట్లర్‌ పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తున్నా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. అనుభవజ్ఞులైన వీరిద్దరు భారీ ఇన్నింగ్స్‌ ఆడలేకపోతున్నారు. ఇక ఆల్‌రౌండర్లుగా మంచి పేరున్న మొయిన్‌ అలీ, రాబిన్‌సన్‌ సైతం విఫలమవుతున్నారు. వీరు బంతితో వికెట్లు తీస్తున్నా బ్యాట్‌తో పరుగులు సాధించలేకపోతున్నారు. మరోవైపు రెండో టెస్టులో ఐదు వికెట్లతో ఆకట్టుకున్న మార్క్‌వుడ్‌ గాయం కారణంగా మూడో మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఇంగ్లాండ్‌ సకీబ్‌ మహ్మూద్‌ను ఎంపికచేసింది. చివరగా ప్రధాన పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ ఒక్కడే టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నాడు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని