close
టాలీవుడ్‌
సినిమా మన సమాజానికి ఉపయోగపడాలి

- తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

‘‘సమాజంపై సినిమా ప్రభావం గొప్పది. ఎంతోమంది అభిమానాన్ని, గౌరవాన్ని సంపాదించుకోవడానికి సినిమా ఓ మంచి వేదికగా నిలుస్తోంది. సినీ తారల ప్రతిభ... వారి ప్రయత్నాలు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి’’ అన్నారు తెలంగాణ రాష్ట్ర    గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌. ఆమె   శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్స్‌ సౌత్‌ - 2019 వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు తారలకి పురస్కారాల్ని అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ‘‘నేను రాజ్‌   భవన్‌కి రాకముందు మేం చెన్నైలోని సాలీ గ్రామంలో నివాసం ఉండేవాళ్లం. సినీ తారలు నివసించే ప్రాంతం అది. మా ఇంటి ఎదురుగానే నటుడు వడివేలు ఉండేవారు. మా వీధి అవతలే విజయ్‌కాంత్‌, విజయ్‌ ఇల్లు ఉంటాయి. ఇప్పుడు ఇంత మంది తారల మధ్య ఒక గవర్నర్‌గా ఈ వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉంది. నేను తంజావూరులో మెడికల్‌ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు తమిళనాడు ప్రభుత్వం పోలియో గురించి ప్రకటనలు ఇచ్చేది. నటులు రజనీకాంత్‌, మనోరమ వాటిలో నటించేవారు. అప్పట్లో జనం వచ్చి మా పిల్లలకి పోలియో డ్రాప్స్‌ ఇవ్వండని అడగకుండా... రజనీకాంత్‌ డ్రాప్స్‌, మనోరమ డ్రాప్స్‌ ఇవ్వమని అడిగేవాళ్లు. తారలు అంతగా ప్రేక్షకులపై ప్రభావం చూపిస్తుంటారు. మంచి సినిమాలు నిర్మించడానికి, మంచి నటనని ప్రదర్శించడానికి నటులు, సాంకేతిక నిపుణులు నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు. వాళ్లకి పురస్కారాలు ఇవ్వడం అభినందనీయం’’ అన్నారు. దాదాసాహెబ్‌ ఫాల్కే మనవడు చంద్ర శేఖర్‌ పుసాల్కర్‌ ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘‘రికార్డులంటే ‘మొఘల్‌ ఎ అజమ్‌’, ‘షోలే’ గుర్తు చేస్తుంటారు. వాటికంటే ముందే 1917లోనే మా తాత తీసిన ‘లంకాదహన్‌’ సినిమా రికార్డుల్ని సృష్టించింది. చెన్నైలో వచ్చిన వసూళ్లని పోలీసు భద్రత నడుమ ఎడ్ల బండ్లలో తరలించారట. నేను సినిమా రంగంలో లేకపోయినప్పటికీ ఫాల్కే మనవడిగా గర్వపడుతున్నా. భారతీయ సినిమాని ప్రపంచమంతా చూస్తోంది. దక్షిణాది చిత్ర పరిశ్రమ బాలీవుడ్‌ని అనుసరించకుండా... ఒక ప్రత్యేకమైన శైలి, గుర్తింపుతో ముందుకెళుతోంది. ఫాల్కే 150వ జయంతిని పురస్కరించుకొని ‘భారతరత్న’ పురస్కారాన్ని సినిమా రంగం నుంచి దాదాసాహెబ్‌ ఫాల్కే ఇస్తే బాగుంటుంది. ప్రభుత్వం ఆ దిశగా ఓ నిర్ణయం తీసుకోవాలి’’ అన్నారు. ‘రంగస్థలం’ చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా పురస్కారం అందుకొన్న దర్శకుడు సుకుమార్‌ మాట్లాడుతూ ‘‘సినిమా అనేదే ఓ వేడుక. పురస్కారాలతో కూడిన ఇలాంటి వేడుకలు మాకు మరింత ఉత్సాహాన్నిస్తుంటాయి. దాదా సాహెబ్‌ ఫాల్కేని గుర్తు చేసుకుంటూ ఈ పురస్కారాన్ని స్వీకరించడం మరింత ఆనందంగా ఉంది’’ అన్నారు. ఉత్తమ సంగీత దర్శకుడిగా పురస్కారం స్వీకరించిన  దేవిశ్రీ  ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘చిన్నప్పట్నుంచి దాదాసాహెబ్‌ ఫాల్కే పేరును వింటున్నా. మా నాన్నకి ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నా. సుకుమార్‌ ‘రంగస్థలం’తో విభిన్నమైన సంగీతం అందించే అవకాశాన్నిచ్చార’’న్నారు. ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా పురస్కారం అందుకొన్న రత్నవేలు మాట్లాడుతూ ‘‘ఈ పురస్కారాన్ని నా కుటుంబానికి అంకితం చేస్తున్నా. నా అభిమాన దర్శకుడు సుకుమార్‌. 15 ఏళ్లుగా మా ప్రయాణం కొనసాగుతోంది’’ అన్నారు. ఎల్బీ శ్రీరామ్‌ మాట్లాడుతూ ‘‘ఒకప్పుడు ఆకాశంలో చందమామలా ఉండే సినిమా... ఇప్పుడు అరచేతిలో సినిమా అయిపోయింది. దీనికి ఆదిపురుషుడు ఎవరని తిరిగి చూసుకుంటే వందేళ్ల కిందట భగీరథ ప్రయత్నం చేసిన ఫాల్కే కనిపిస్తారు. విదేశీ సినిమాని భారతదేశానికి తీసుకురావాలని తపించారు ఫాల్కే. సినిమా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనకి రుణపడి ఉంటార’’న్నారు. ఉత్తమ కథానాయకుడిగా పురస్కారం అందుకున్న యశ్‌ మాట్లాడుతూ ‘‘ప్రతిష్ఠాత్మకమైన ఈ పురస్కారాన్ని స్వీకరించడం ఆనందంగా ఉంది. ‘కేజీఎఫ్‌’ని తెలంగాణ, ఆంధ్ర  ప్రదేశ్‌ల్లో బాగా స్వీకరించారు. ఈ పురస్కారాన్ని ‘కేజీఎఫ్‌’ బృందానికి అంకితం ఇస్తున్నా’’ అన్నారు. ప్రముఖ నటుడు మోహన్‌బాబుకు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రకటించారు. ఉత్తమ నటుడిగా ఎంపికైన మహేష్‌బాబు తరఫున ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్‌, ఉత్తమ పరిచయ కథానాయికగా పాయల్‌ రాజ్‌పుత్‌ పురస్కారం అందుకున్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి ఫగన్‌ సింగ్‌ కులస్తేతో పాటు సినీ, వ్యాపార రంగ ప్రముఖులు నభానటేష్‌, సురభి, హంసానందిని, రవివర్మన్‌, కేవీబీ రెడ్డి, అనిల్‌, ఫర్హాత్‌ హుస్సేన్‌, అవికాగోర్‌, అనూప్‌సింగ్‌ ఠాకూర్‌, జతిన్‌ అహుజా తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.