బాలుకు పాటాభిషేకం - Telugu News Special Programme On SP Balu
close
Updated : 26/09/2021 09:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలుకు పాటాభిషేకం

నేటి సాయంత్రం 6 గంటలకు ఈటీవీలో ‘బాలుకు ప్రేమతో’

గానగంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం పుణ్యలోకాలకు తరలిపోయి ఏడాది కాలం గడిచింది. ప్రథమ వర్ధంతి సందర్భంగా బాలుకు నివాళిగా రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది ఈటీవీ. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు బాలు చిత్రపటం ముందు దీపారాధన చేశారు. ‘స్వరాభిషేకం’, ‘పాడుతా తీయగా’ కార్యక్రమాల్లో బాలు వాడిన మైక్‌ను ఆయన తనయుడు ఎస్‌.పి.చరణ్‌కు ఆశీస్సులతో అందించారు. ప్రముఖ సినీ నటులు రాజేంద్రప్రసాద్‌, సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి, మణిశర్మ, కోటి, ఆర్పీ పట్నాయక్‌, కె.ఎమ్‌. రాధాకృష్ణ, వాసూరావు, రామాచారి, గేయ రచయితలు జొన్నవిత్తుల, అనంత్‌ శ్రీరామ్‌, గాయనీగాయకులు మనో, చిత్ర, కల్పన, సునీత, విజయప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు. ‘బాలుకు ప్రేమతో’ అనే శీర్షికతో ఈ కార్యక్రమం ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది.


మా స్నేహానికి అదే సాక్ష్యం
- ఇళయరాజా

‘‘ఎస్పీబీ గాత్రం, నా కృషి వల్లే ఎన్నో అద్భుతమైన పాటలను శ్రోతలు వినగలిగార’’ని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పేర్కొన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి కార్యక్రమం సినీ సంగీత కళాకారుల సంఘం ఆధ్వర్యంలో శనివారం చెన్నైలో జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్పీబీ చిత్ర పటానికి నివాళులర్పించిన అనంతరం రాజా మాట్లాడుతూ ‘‘నాకు, ఎస్పీబాలుకు మధ్య ఉన్న స్నేహం అందరికీ తెలిసిందే. నేను సంగీత దర్శకుడిగా మారిన తర్వాతా మా స్నేహం చెక్కుచెదరలేదు. మా ఇద్దరి కృషి వల్లే ప్రేక్షకులు మధురమైన పాటలెన్నో వినగలిగారు. ఎస్పీబీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ‘బాలు నేను ఎదురుచూస్తున్నా.. త్వరగా కోలుకుని రా..’ అని మాట్లాడి ఓ వీడియో ఆయనకు పంపా. దాన్ని చూసిన బాలు వీడియోలో ఉన్న నన్ను ఎంతో ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నారని ఆయన కుమారుడు చరణ్‌ చెప్పారు. అంతేకాకుండా నన్ను చూడాలని ఆయన ఆశపడ్డారని చెప్పారు. అదే మాస్నేహానికి సాక్ష్యం’’ అంటూ చెమ్మగిల్లిన కళ్లతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు శ్రీకాంత్‌దేవా, సంఘం అధ్యక్షుడు దీనా తదితరులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, కోడంబాక్కంమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని