close
Published : 16/02/2021 12:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇకపై విరామం రాదు 

హైదరాబాద్‌: పా‌ట హిట్టైతే సినిమా హిట్టే అనే స్థాయిలో సంగీతం ప్రభావం చూపిస్తోంది. దాంతో పాటల్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కసరత్తులు చేస్తున్నాయి చిత్రబృందాలు. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రంలోని ‘గుచ్చే గులాబి...’ పాటని ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేశారు. అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రమిది. పాటకి లభించిన ఆదరణపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంది చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌తో ‘ఈనాడు సినిమా’ ముచ్చటించింది. ఆయన చెప్పిన విషయాలివీ... 

నా సినిమాల్లో సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఆ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధే తీసుకుంటా. ఇప్పుడే కాదు... ఎప్పుడైనా సంగీతం ప్రేక్షకులకు చేరువైందంటే అది సినిమాకి పెద్ద బలం. నా గత సినిమాల స్థాయిలోనే ఈ సినిమాకి కూడా సంగీతంపై దృష్టిపెట్టి పనిచేశాం. కథ రీత్యా మంచి ఎనర్జిటిక్‌ మెలోడీ ఉండాలనుకున్నా. గోపీసుందర్‌ అలాంటి పాటలే ఇచ్చారు. ఇందులో ఐదు పాటలుంటాయి. ఇప్పటివరకు రెండు పాటలొచ్చాయి. ‘గుచ్చే గులాబి..’ పాటకి వచ్చిన స్పందన మాలో మరింత ఉత్సాహాన్నిచ్చింది. త్వరలోనే మిగిలిన మూడు పాటల్నీ విడుదల చేస్తాం.


రొమాంటిక్‌ కథలకే కాదు, యాక్షన్‌ సినిమాల్లో కూడా సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. కాకపోతే రొమాంటిక్‌ కథలు అనేసరికి పాటలతోనే ఆ మూడ్‌ బయటకి కనిపించేలా చేయాలి. మన కథ, అందులోని సందర్భాలు, ఆ తర్వాత అంచనాలు... ఇలా అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుంటాం. 

వైవాహిక జీవితం నుంచి ఏంఆశిస్తారనే ప్రశ్న టీజర్‌లో ప్రముఖంగా వినిపించింది. ఆ నేపథ్యంలోనే వినోదం పండించాం. జీవితాల్లో కొన్ని ప్రశ్నల్ని మనకు మనంగా లేవనెత్తుకోం. కానీ వాటి సమాధానాలు మాత్రం మనకి 
అవసరమవుతాయి. సినిమాలో అలాంటి ప్రశ్నే ఉంటుంది. దాని జవాబు అవసరం పెళ్లి  చేసుకున్నవాళ్లకీ అవసరమే, చేసుకోబోయేవాళ్లకీ అవసరమే. ఆ జవాబు ఏంటనేది సినిమాలోనే చూడాలి. ఇది అందరి జీవితాల్ని ప్రతిబింబించే కథే. స్ఫూర్తి అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు 

ప్రేక్షకుల అభిరుచుల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి. ఇప్పుడొక కథని కథలాగే చూస్తున్నారు. అదొక మంచి సంకేతం. మంచి సినిమాలొచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది పరిశ్రమకి కూడా మంచిదే. అనుకున్న కథని అనుకున్నట్టుగా చెప్పొచ్చనే ఓ స్వేచ్ఛ ఇప్పుడు దర్శకుల్లో కనిపిస్తోంది’’. 

స్వతహాగా నాకు యాక్షన్‌ సినిమాలంటే బాగా ఇష్టం. తీయడం కోసం కూడా అలాంటి కథల్ని సిద్ధం చేసుకున్నా. తదుపరి అదే చేస్తానేమో. అనుకోకుండా మధ్యలో ఓ కొత్త అంశం గుర్తుకొస్తుంది. కొత్త విషయం గురించి ఆలోచిస్తూ, ఆ నేపథ్యంలో సినిమా తీయడం కూడా ఓ సవాలే కదా. అలా ఇప్పటివరకు ఎక్కువగా సున్నితమైన అంశాల్నే స్పృశిస్తూ సినిమాలు చేశా. తదుపరి యాక్షన్‌ కథనే చేస్తానేమో. ఇక నుంచి మాత్రం విరామం రాదు. మధ్యలో అనుకోకుండా తమిళంలో ఓ సినిమా చేశా. ఆ తర్వాత అలా అలా విరామం వచ్చింది. 

ఈ సినిమాలోని పాత్రలకీ, ప్రేక్షకులకూ మధ్య సంబంధమే హైలెట్‌. మన జీవితాల్లో నుంచి తీసుకున్న సంఘటనే కాబట్టి... అది అందరికీ కనెక్ట్‌ అవుతుంది.  అఖిల్‌ చాలా సహజంగా చేశాడు. ఆయన లుక్స్‌ కానీ, నటన కానీ చాలా బాగుంటుంది. పూజా హెగ్డే కూడా అంతే. తన పాత్రరీత్యా మరిన్ని కసరత్తులు చేసి నటించాల్సి వచ్చింది.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని