Srikanth: నాకు ఆ నమ్మకాన్నిచ్చింది ‘అఖండ’ - telugu news srikanth latest interview about akhanda movie
close
Updated : 26/11/2021 07:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Srikanth: నాకు ఆ నమ్మకాన్నిచ్చింది ‘అఖండ’

వందకిపైగా సినిమాలు చేసిన కథానాయకుడు శ్రీకాంత్‌. ప్రతినాయకుడిగా పరిశ్రమకి పరిచయమైన ఆయన, ఆ తర్వాత కథానాయకుడిగా విజయవంతమయ్యారు. ఇప్పుడు మళ్లీ ప్రతినాయకుడి అవతారం ఎత్తారు. ‘అఖండ’లో బాలకృష్ణని ఢీ కొడుతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. 

‘అఖండ’ కోసం మీ ఎంపిక ఎలా జరిగింది?

నేను విలన్‌గానే పరిశ్రమకి పరిచయమయ్యా. ఆ తర్వాత హీరోగా మారా. మధ్యలో ‘యుద్ధ శరణం’లో మళ్లీ విలన్‌గా చేశా. దానికి ముందే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘సరైనోడు’ చేశా. బాబాయ్‌గా సున్నితమైన పాత్రే అది. అప్పుడే ‘నువ్వు ఏది పడితే అది చేయొద్దు భయ్యా. ఈసారి నీ కోసం విలన్‌గా ఓ మంచి పాత్ర రాస్తా, చేస్తావా?’ అని అడిగారు. ఆ పాత్రల నుంచి వచ్చినవాణ్నే కదా, చేస్తా అని చెప్పా. ఆ తర్వాత మళ్లీ నావైన సినిమాల్ని, వెబ్‌సిరీస్‌ల్ని చేస్తూ వచ్చా. ఒక రోజు బోయపాటి ఫోన్‌ చేసి ‘అఖండ’లో ప్రతినాయకుడి పాత్ర గురించి చెప్పారు.

బాలకృష్ణని ఢీ కొట్టే విలన్‌ పాత్ర అని తెలిసినప్పుడు మీకేం అనిపించింది?

విలన్‌గా చేయడం వేరు, బాలకృష్ణ సినిమాలో విలన్‌గా చేయడం వేరు. చాలా శక్తిమంతంగా ఉంటాయి ఆ పాత్రలు. అందుకే నేను చేసిన వరద రాజులు పాత్ర గురించి చెప్పినప్పుడు భయపడ్డా. ఆ సంభాషణలు విని నేను చేయగలనా అని ఆలోచించా. ఏమాత్రం తక్కువ చేసినట్టు అనిపించినా నటుడిగా నాకు చెడ్డ పేరు వస్తుంది. అయితే ముందు గెటప్‌ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నా. రకరకాల ప్రయత్నాలు చేశాక ఓ గెటప్‌పై సంతృప్తి కలిగింది. ఆ గెటప్‌లో నన్ను నేను చూసుకున్నాక ఇది నేనేనా అని ఆశ్చర్యపోయా. అంత కొత్తగా అనిపించింది. ట్రైలర్‌ విడుదల తర్వాత నా పాత్ర గురించి చాలామంది ఫోన్లు చేశారు. మరి ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారనేది చూడాలి. కుటుంబ కథానాయకుడిగా పేరున్న నన్ను చూసి ‘ఎందుకు ఇలాంటివని మహిళలేమైనా తిడతారా?’ అనేది విడుదల తర్వాత తెలుస్తుంది. ఇందులో కచ్చితంగా భిన్నమైన శ్రీకాంత్‌ కనిపిస్తారు. ఇలాంటి పాత్రల్ని ధైర్యంగా చేయొచ్చనే ఓ నమ్మకం నాలో కలిగింది. ‘అఖండ’ హై ఓల్టేజ్‌ సినిమా. బాలకృష్ణ - బోయపాటి కలయిక అంటేనే ప్రతి ఒక్కరి నుంచీ అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా డైలాగులు విన్నప్పుడు సెట్లో అక్కడికక్కడే చప్పట్లు కొట్టిన సందర్భాలు చాలానే.

బాలకృష్ణతో కలిసి నటించిన అనుభవాల్ని పంచుకుంటారా?

ఆయనతో ఇది నాకు రెండో సినిమా. ఇదివరకు ‘శ్రీరామరాజ్యం’లో లక్ష్మణుడిగా చేశా. ఇప్పుడేమో రాముడి పక్కన రావణాసురుడి తరహా పాత్ర చేశా (నవ్వుతూ). సంభాషణల కోసం డబ్బింగ్‌ చెప్పుకొనేటప్పుడు నా గొంతుని కొంచెం మార్చి పలికా. బాలకృష్ణ చాలా ప్రోత్సాహం అందించారు. ‘శ్రీకాంత్‌ పాత్ర బలంగా ఉండాలి. అప్పుడే నా పాత్ర  పండుతుంద’ని చెప్పేవారు. బాలకృష్ణతో కలిసి మేమంతా క్రికెట్‌ ఆడేవాళ్లం. అప్పట్నుంచి ఆయనతో మంచి అనుబంధం ఉంది. సెట్లో కూడా ‘ఈ సినిమా తర్వాత భయంకరమైన పాత్రలు చాలానే వస్తాయి, ఒప్పుకోవద్దు. హీరోగా మంచి కథలు ఉన్నాయి, నేను చెబుతా నీకు’ అనేవారు. ఈ సినిమా కోసం మేం చాలా కష్టపడ్డాం. గనుల్లో ఓ పోరాట ఘట్టం కోసం తొమ్మిది రోజులు చిత్రీకరణ చేశాం. లెన్స్‌ పెట్టుకుని, ఆ మట్టిలో చేసిన ఆ సన్నివేశాల కోసం కష్టపడుతుంటే హీరోగానే బెటరేమో అనే పరిస్థితికి వచ్చా (నవ్వుతూ). 


‘‘జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటే అదే మనల్ని ముందుకు తీసుకెళుతుంది. హీరోగానే చేస్తాననే పట్టుదలతో నేనెప్పుడూ లేను. కథానాయకుడిగా బాగా బిజీగా ఉన్న సమయంలోనూ ‘సంక్రాంతి’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ సినిమాల్లో కీలక పాత్రలు చేశా. వెబ్‌ సిరీస్‌లూ చేస్తున్నా. ఖాళీగా ఉంటే నాకు చిరాకు. హీరోగానే ఆసక్తి ఎక్కువ కానీ, పాత్రలు నచ్చితే మాత్రం వదిలిపెట్టను. అది నాకొక సరదా. కన్నడలో పునీత్‌ రాజ్‌కుమార్‌ సినిమాలోనూ విలన్‌గా చేశా. అది ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలవుతుంది’’.


‘లెజెండ్‌’ తర్వాత జగపతిబాబు సినీ ప్రయాణం మరో మలుపు తీసుకుంది. దీని తర్వాత మీకూ అలాంటి గుర్తింపు వస్తుందేమో కదా...? 

ఇది చేస్తే అలా అవుతామనే లెక్కలంటూ ఏమీ ఉండవు నాకు. మనం అనుక్నుది చేసుకుంటూ వెళ్లిపోవడమే. నేను అనుకుంటే జరగదు ఏదీ. జగపతిబాబు కెరీర్‌కి ‘లెజెండ్‌’ మలుపునిచ్చిందన్న మాట నిజమే. నావరకు నేను నిర్ణయించుకుంది ఏమిటంటే.. అందమైన పాత్ర అనుకుంటే ఏదైనా చేద్దామనేదే నా ముందున్న లక్ష్యం.


బాలయ్యతో కలిసి అల్లు అర్జున్‌

‘అఖండ’ ముందస్తు విడుదల వేడుకకి కథానాయకుడు అల్లు అర్జున్‌ హాజరవుతున్నారు. ఈ నెల 27న హైదరాబాద్‌లో వేడుక జరగనున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ, అల్లు అర్జున్‌ కలిసి వేదికపై సందడి
చేయనున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని