Anukoni Athidhi review: రివ్యూ: అనుకోని అతిథి - anukoni athidhi telugu movie review
close
Updated : 28/05/2021 16:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Anukoni Athidhi review: రివ్యూ: అనుకోని అతిథి

నటీనటులు: ఫహద్‌ ఫాజిల్‌, సాయిపల్లవి, ప్రకాశ్‌రాజ్‌, అతుల్‌ కులకర్ణి తదితరులు; సంగీతం: పీఎస్‌ జయహరి, జిబ్రాన్‌ (నేపథ్య సంగీతం); సినిమాటోగ్రఫీ: అను మూతేదత్‌; ఎడిటింగ్‌: ఆయూబ్‌ఖాన్‌; స్క్రీన్‌ప్లే: పి.ఎఫ్‌.మాథ్యూస్‌; నిర్మాత: రాజు మాథ్యూ; దర్శకత్వం: వివేక్‌; విడుదల: ఆహా

ఓటీటీలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాక ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. గతేడాది లాక్‌డౌన్‌తో ఓటీటీల్లో సినిమాలు వీక్షించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఓటీటీలు సైతం ఇతర భాష చిత్రాలను డబ్బింగ్‌ చేయడమో.. సబ్‌టైటిల్స్‌తో ఇవ్వడమో చేస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను డబ్‌ చేసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. అలా మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అథిరన్‌’ను ‘అనుకోని అతిథి’ పేరుతో విడుదల చేసింది. ఫహద్‌ ఫాజిల్‌, సాయిపల్లవి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఎలా ఉంది? ఎవరీ అనుకోని అతిథి?

కథేంటంటే: డాక్టర్‌ బెంజిమన్‌ (అతుల్‌ కులకర్ణి) ఊరికి దూరంగా ఒక విశాలమైన భవనంలో పిచ్చాసుపత్రిని నిర్వహిస్తుంటాడు. ఆస్పత్రి తనిఖీల్లో భాగంగా తిరువనంతపురం వైద్య కళాశాలలో సీనియర్‌ సైకియాట్రిస్ట్‌ అయిన కిషోర్‌ నందా (ఫహద్‌ ఫాజిల్‌) వస్తాడు. సాధారణ పిచ్చాసుపత్రికి భిన్నంగా అక్కడో ఏదో జరుగుతోందని నందా గుర్తిస్తాడు. రోగుల పట్ల బెంజిమన్‌ ప్రవర్తన కూడా దారుణంగా ఉంటుంది. అక్కడే పనిచేసే సిబ్బంది కూడా బెంజిమన్‌కు అనుకూలంగా ఉంటారు. దీంతో సరైన నివేదిక ఇవ్వకపోతే ‘నిన్ను వాళ్లు చంపేస్తారు’ అని నందాను బెంజిమన్‌ బెదిరిస్తాడు. అయినా నందా ఏమాత్రం భయపడకుండా తన పరిశీలనను కొనసాగిస్తాడు. ఈ క్రమంలో ఓ గదిలో బంధించి ఉంచిన నిత్య (సాయి పల్లవి)ని చూస్తాడు. ఆమె గురించి వివరాలు సేకరించగా సంపన్న కుటుంబానికి చెందినదిగా తెలుస్తుంది. అసలు నిత్య ఎవరు? ఆమె పిచ్చాసుపత్రికి ఎందుకు వచ్చింది?ఆమె గతం ఏంటి? నందా ఈ ఆస్పత్రికి రావడం వెనుక కారణం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఒక చిన్న పాయింట్‌. దాని చుట్టూ బిగి సడలని కథనం. ప్రతి సన్నివేశంలోనూ ఉత్కంఠ.. ఇవే థ్రిల్లర్‌ మూవీకి కావాల్సిన ముడి సరకు. వీటికి సరైన నటీనటులు దొరికితే ఆ సినిమాకు తిరుగుండదు. ఇలా అన్ని కలిసిన మలయాళ చిత్రమే ‘అతిరన్‌’. తెలుగులో ‘అనుకోని అతిథి’ పేరుతో ‘ఆహా’ విడుదల చేసింది. కేరళలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఓ ఇంట్లో ముగ్గురు హత్యకు గురికావడంతో సినిమా మొదలవుతుంది. అక్కడ కట్‌ చేస్తే పిచ్చాసుపత్రికి నందా రావడం.. తన పరిశీలన కొనసాగించడం, మధ్యలో బెంజిమన్‌ బెదిరింపులు ఇలా ప్రథమార్ధం సాగుతుంది. ఎప్పుడైతే పిచ్చాసుపత్రిలో నిత్య కనిపించిందో అప్పటి నుంచి కథ, కథనాల్లో ఉత్కంఠ మరింత పెరుగుతుంది. సైకలాజికల్‌ థ్రిల్లర్‌కు హారర్‌ హంగులు జోడించడంతో మరింత ఆసక్తికరంగా మారింది. అసలు కథను ద్వితీయార్ధంలో రివీల్‌ చేసుకుంటూ వచ్చాడు దర్శకుడు. రెగ్యులర్‌గా థ్రిల్లర్‌ సినిమాలు చూసేవారికి క్లైమాక్స్‌ అర్థమైపోతుంది. కొత్తగా చూసేవారికి మాత్రం ‘అనుకోని అతిథి’ కొత్తదనాన్ని పంచుతుంది. 

ఎవరెలా చేశారంటే: మలయాళంలో విభిన్న కథలను, పాత్రలను ఎంచుకునే నటుడు ఫహద్‌ ఫాజిల్‌. సాయి పల్లవిది అదే దారి. వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం సినిమాపై అంచనాలను పెంచాయి. అందుకు తగినట్టుగానే వారి నటన అలరిస్తుంది. మానసిక వైద్యుడిగా ఫహద్‌, మానసిక రోగిగా సాయి పల్లవి ఒదిగిపోయి నటించారు. అయితే, క్లైమాక్స్‌ ట్విస్ట్‌ తెలిసిన తర్వాత ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. అతుల్‌ కులకర్ణి, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. పాటలు పెద్దగా ఆకట్టుకోవు. జిబ్రాన్‌ నేపథ్య సంగీతం మాత్రం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకుడు లీనమయ్యేట్లు చేసింది. అను మోతేదత్‌ కెమెరా పనితనం బాగుంది. అడవి, పిచ్చాసుపత్రులను అద్భుతంగా చూపించారు. ఇంకొన్ని సన్నివేశాలకు కత్తెర వేసి ఉంటే బాగుండేది. కేరళలో జరిగిన వాస్తవ ఘటనతో పాటు, హాలీవుడ్‌ చిత్రం ‘స్టోన్‌హార్ట్‌’ను స్ఫూర్తిగా తీసుకుని ‘అనుకోని అతిథి’ని తీర్చిదిద్దారు దర్శకుడు వివేక్‌. అయితే, అక్కడక్కడా సన్నివేశాలు మరీ సాగదీసినట్లు అనిపిస్తాయి. 

బలాలు బలహీనతలు
+ కథ, కథనాలు - అక్కడక్కడా సాగదీతగా అనిపించే సన్నివేశాలు
+ ఫహద్‌ ఫాజిల్‌, సాయి పల్లవి - తెలుగు నేటివిటీకి దూరంగా ఉండటం
+ సాంకేతిక బృందం పనితీరు  

చివరిగా: ‘అనుకోని అతిథి’.. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే థ్రిల్‌ పంచుతాడు. 

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని