అతడికి నలుగురు..!

తాజా వార్తలు

Updated : 07/11/2020 11:43 IST

అతడికి నలుగురు..!

మొత్తంగా నాలుగు పెళ్లిళ్లు
సూర్యాపేటలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మహేశ్‌ నిర్వాకం
న్యాయం చేయాలని రెండో భార్య వేడుకోలు

సూర్యాపేట నిఘావిభాగం: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకొని ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నిత్య పెళ్లికొడుకులా చలామణి అవుతున్నాడు. విడాకుల కేసు న్యాయస్థానంలో నడుస్తుండగానే తాజాగా నాలుగో పెళ్లి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. తన కుమారుడితో పుట్టింట్లో ఉంటున్న అతడి రెండో భార్య తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు. బాధితురాలి వివరాల మేరకు.. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలానికి చెందిన రావుల మహేశ్‌ అలియాస్‌ మల్లయ్య ప్రస్తుతం సూర్యాపేట ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతను 2014లో మోతె మండలానికి చెందిన ఒక యువతిని వివాహం చేసుకున్నాడు. ఏడాదిలోనే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
*2016లో చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరికి చెందిన స్రవంతిని వివాహమాడాడు. ఆమెకు ప్రస్తుతం ఓ కుమారుడు ఉన్నాడు. కుమారుడు కడుపులో ఉండగానే భర్త వేధింపులు తాళలేక స్రవంతి పుట్టింటికి వెళ్లిపోయారు. 2018లో ఆమె చివ్వెంల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కానిస్టేబుల్‌పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వరకట్న వేధింపులు, భరణం కేసులు న్యాయస్థానంలో కొనసాగుతున్నాయి.
*ఆరు నెలల క్రితం ఓ యువతికి మహేశ్‌ మాయమాటలు చెప్పి ఇంట్లో నుంచి తీసుకెళ్లి సికింద్రాబాద్‌లోని మహంకాళి ఆలయంలో వివాహం చేసుకున్నాడు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పెన్‌పహాడ్‌ పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. కేసు నమోదు కావడంతో నాలుగు రోజుల తర్వాత యువతిని తీసుకొని కానిస్టేబుల్‌ సూర్యాపేట డీఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చిన పోలీసులు యువతిని సూర్యాపేటలోని సఖి కేంద్రానికి అప్పగించారు. అనంతరం ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. అయినా అతనిపై ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు.
* తాజాగా ఈ ఏడాది అక్టోబరు 29న సూర్యాపేట మండలానికి చెందిన మరో యువతిని ఆమనగల్‌ దేవాలయంలో వివాహమాడాడు.
* ఈ విషయం తెలుసుకున్న అతడి భార్య స్రవంతి చివ్వెంల పోలీసులను ఆశ్రయించారు. రుజువులు చూపితేనే ఫిర్యాదు స్వీకరిస్తామంటూ అక్కడి పోలీసులు తెలిపారని బాధితురాలు వాపోయారు. తనకు తన కుమారుడికి న్యాయం చేయాలని ఎస్పీని ఆమె వేడుకుంటున్నారు. ఆ విషయాన్ని సూర్యాపేట ఎస్పీ భాస్కరన్‌ వద్ద ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించగా.. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మహేశ్‌ నాలుగు వివాహాలు చేసుకున్న విషయం ఇంతవరకు తన దృష్టికి రాలేదని, వెంటనే విచారించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటానన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని