వీధికుక్కలకు విషమిచ్చి చంపారు

ప్రధానాంశాలు

Published : 28/10/2021 06:43 IST

వీధికుక్కలకు విషమిచ్చి చంపారు

స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదుతో కళేబరాల వెలికితీత

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: వీధి కుక్కలకు పురపాలక సిబ్బంది విషమిచ్చి చంపారనే ఫిర్యాదుతో వాటి కళేబరాలను వెలికితీసిన ఉదంతం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. దసరా నాడు పట్టణంలో ఆరుగురిపై ఓ పిచ్చికుక్క దాడిచేసి గాయపర్చింది. అనంతరం స్థానికుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు పురపాలిక పాలకవర్గ సమావేశం నిర్వహించి.. సిబ్బందితో వీధికుక్కలను పట్టించారు. వాటిలో 200లకు పైగా కుక్కలకు విషమిచ్చి చంపారని, పురపాలక సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీపుల్‌ ఫర్‌ యానిమల్‌ ఆర్గనైజేషన్‌ సహాయ మేనేజర్లు గౌతమ్‌, శివనారాయణ, జంతు ప్రేమికుడు పృథ్వీ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. శునకాల కళేబరాలను మెదక్‌ మార్గంలోని లక్ష్మీనారాయణస్వామి ఆలయ భూముల్లో పాతిపెట్టారన్న సమాచారంతో పోలీసుల సమక్షంలో బుధవారం జేసీబీతో తవ్వకాలు చేపట్టారు. కొన్ని కళేబరాలు బయటపడగా.. వాటికి పశుసంవర్ధకశాఖ ఏడీ డాక్టర్‌ జనార్దన్‌రావు పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ విషయమై నర్సాపూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ అశ్రిత్‌కుమార్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా... దసరా నాడు పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న కొందరిని పిచ్చికుక్క కరిచిందన్నారు. కొన్ని వీధి కుక్కలనూ కరిచిందని తెలిపారు. ఆగ్రహించిన స్థానికులు పిచ్చికుక్కతో పాటు దాని బారినపడ్డ వాటిని చంపేశారని వివరించారు. పురపాలికకు సమాచారం ఇవ్వడంతో కుక్కల కళేబరాలను సిబ్బంది పాతిపెట్టారని, వాటికి విషమిచ్చి చంపారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టంచేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన