నూతన పాలనకు నాంది
eenadu telugu news
Published : 25/09/2021 02:20 IST

నూతన పాలనకు నాంది

మండల, జిల్లా పరిషత్తులకు పాలకవర్గాలు
నేడు జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం 

ఈనాడు, గుంటూరు  జిల్లా పరిషత్తు పాలనకు శనివారం నూతన పాలకవర్గం కొలువుదీరనుంది. మండల ప్రజా పరిషత్తు అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక శుక్రవారం పూర్తికావడంతో పాలకవర్గాలు కొలువుదీరాయి. శనివారం జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారంతోపాటు జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్, ఉపాధ్యక్షులు, కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకుంటారు. దీంతో మండల పరిషత్తు, జిల్లాపరిషత్తులో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల పాలన ప్రారంభమవుతుంది. రెండేళ్లకు పైగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న వాటిల్లో ప్రజాప్రతినిధుల పాలనతో అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి. జిల్లా పరిషత్తు, మండల పరిషత్తులను అధికార పార్టీ కైవసం చేసుకుంది. జిల్లా పరిషత్తు ప్రతిపక్ష సభ్యులు లేకుండా కొలువుదీరడం ఇదే తొలిసారి. జడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవికి కత్తెర హెన్రీ క్రిస్టినా ఎంపిక లాంఛనమే. ఉపాధ్యక్షులుగా రెంటచింతల జడ్పీటీసీ సభ్యుడు శొంఠిరెడ్డి నర్సిరెడ్డి, చేబ్రోలు జడ్పీటీసీ సభ్యురాలు బత్తుల అనూరాధ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కోఆప్షన్‌ సభ్యులను కూడా శనివారం ఎన్నుకోనున్నారు. 

రెండేళ్లకుపైగా ప్రత్యేకాధికారుల పాలన
గత పాలకవర్గం పదవీకాలం జులై 4, 2019తో ముగిసింది. తర్వాత రోజు నుంచి ప్రత్యేకాధికారుల పాలన అమలులోకి వచ్చింది. రెండేళ్లకుపైగా ప్రత్యేకాధికారుల పాలనలో మండల, జిల్లాపరిషత్తులు కొనసాగాయి. మండల పరిషత్తులో పాలకవర్గాలు కొలువుదీరాయి. జిల్లా పరిషత్తులో శనివారం నుంచి ప్రజాప్రతినిధుల పాలన అమలులోకి వస్తుంది. ప్రత్యేకాధికారులు వారి శాఖా విధులతోపాటు అదనంగా మండల, జిల్లా పరిషత్‌లో సమస్యల పరిష్కారం, పాలనపై దృష్టి సారించాల్సి ఉంది. పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామస్థాయి సమస్యలు జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించే అవకాశాలు తక్కువగా ఉండేవి. దీంతో పల్లెల్లో రెండేళ్లుగా అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. వీటన్నిటికి కొత్త పాలకవర్గాలతో పరిష్కారం లభించే అవకాశాలున్నాయి. ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయించడం, నిధులు మంజూరు చేయించుకోవడం, పనులు చేపట్టడంపై శ్రద్ధ వల్ల ప్రగతి పనులు వేగవంతం కానున్నాయి. దీనికితోడు ఎన్నికైన వారిలో పాలనా అనుభవం ఉన్నవారు, విద్యావంతులు ఉండటంతో సమస్యల పరిష్కారంలో చొరవ చూపే అవకాశం ఉంది. 

రెండుచోట్ల ఆగిన ఎంపీపీ ఎన్నిక
జిల్లాలో 54 మండల పరిషత్తులకు అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్షన్‌ పదవులకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. దుగ్గిరాల, పెదకూరపాడు మండల పరిషత్తుకు ఎన్నిక వాయిదా పడింది. నరసరావుపేట మండల ఉపాధ్యక్ష పదవికి ఎవరూ పోటీచేయనందున ఉపాధ్యక్షుని ఎంపిక శనివారానికి వాయిదా వేశారు. మిగిలినచోట ఎంపీపీ, ఉపాధ్యక్షుడు, కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక పూర్తయింది. దుగ్గిరాలలో ఎంపీపీ, ఉపాధ్యక్షుడు, కోఆప్షన్‌ సభ్యుల ఎంపికకు తెదేపా, జనసేన ఎంపీటీసీ అభ్యర్థులు హాజరుకాకపోవడంతో కోరం లేక శనివారానికి వాయిదా వేశారు. పెదకూరపాడులో కోఆప్షన్‌కు నామినేషన్‌ ఎవరూ వేయకపోవడంతో అక్కడా ఎన్నిక వాయిదా పడింది. వీటికి శనివారం ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. పెదకూరపాడులో అధికార పార్టీ అన్ని ఎంపీటీసీ స్థానాలు కైవసం చేసుకున్నా నేతల నడుమ పదవులపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమావేశానికి ఎవరూ హాజరుకాలేదు. ఇప్పటికీ చర్చలు కొలిక్కి రాకపోవడంతో శనివారం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. దుగ్గిరాలలో కూడా తెదేపా, జనసేన సభ్యులు శనివారం హాజరవుతారా? లేదా? అన్న అంశంపైనే ఎన్నిక ఆధారపడి ఉంది. ఇక్కడి ఎన్నికను రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఆసక్తి నెలకొంది.  

జడ్పీలో భారీగా ఏర్పాట్లు 
జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాపరిషత్తు ఛైర్‌పర్సన్, ఉపాధ్యక్షుల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జడ్పీలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం ఉదయం పది గంటలకు నూతన జడ్పీటీసీ సభ్యులను సమావేశ మందిరం లోపలికి అనుమతిస్తారు. మొత్తం 52 మంది సభ్యుల్లో 21 మంది సభ్యులు హాజరైతే కోరం ఉన్నట్లు భావించి కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తారు. దీంతో జడ్పీటీసీ సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల కోసం ప్రత్యేకంగా సీట్లను కేటాయించారు. జడ్పీ వేదిక మీద కలెక్టరు వివేక్‌ యాదవ్, సీఈవో చైతన్య మాత్రమే కూర్చుని ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తారు. పోలీసు శాఖ అధికారులు జడ్పీలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. మీడియా ప్రతినిధులను సమావేశ మందిరం లోపలికి అనుమతించడంపై నిర్ణయం తీసుకునే విషయంలో స్పష్టత లేదు. పాసులు ఉన్న వారిని అనుమతించాలని సూచించారు.
* జడ్పీ ఛైర్‌పర్సన్, ఉపాధ్యక్షులు, కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికల కోసం హాజరయ్యే ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీ సభ్యుల కోసం ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని