Published : 21/04/2021 05:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొత్త గుత్తేదారుకు ఇసుక రాశులు

58 రేవులు.. 40 లక్షల ఘనపు మీటర్లు..

ఈనాడు, అమరావతి

జిల్లాలో ఇసుక తవ్వకాలపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఆన్‌లైన్‌లో నమోదుకు అవకాశం ఉన్నా సరఫరా కావడం లేదని తీసుకోవడం లేదు. జిల్లాలో కేవలం ఒకే ఒక్క రీచ్‌లో కాంట్రాక్టర్‌ తవ్వకాలు జరుపుతున్నారు. మరోవైపు కొత్త విధానంలో గుత్తేదారుకు భారీగా ఇసుక రేవులను అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. జిల్లాలో దాదాపు 40లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వనుంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల నుంచి భారీగా ఇసుక అక్రమ రవాణా అవుతూనే ఉంది. మండలాల్లో ట్రాక్టర్ల యజమానులు సిండికేట్‌గా మారి ఇసుకను తరలిస్తున్నారు. ఒక అవగాహనకు వచ్చి పోలీసులతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. కొత్త మార్గదర్శకాలు వచ్చేంత వరకు భారీగా తరలించి నిలువ చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు.

సంధికాలం.. భలే సమయం..

ప్రస్తుతం జిల్లాలో సంధి కాలం నడుస్తోంది. వాస్తవానికి గుత్తేదారుకు ఈనెల 16నే ఇసుక రేవులు అప్పగించాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే గుత్తేదారుకు ఇసుక రేవులను అప్పగిస్తున్న విషయం తెలిసిందే. దీనికి గరిష్ఠంగా ఇసుక ధర క్యూబిక్‌ మీటరుకు రూ.475 నిర్ణయించారు. అంతకన్నా తక్కువకైనా విక్రయించవచ్ఛు సొంత వాహనంలో రేవు వద్ద ఇసుకను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. లేదా గుత్తేదారు వాహనంలో రవాణా చేస్తారు. రాష్ట్రం మొత్తం ఒకే గుత్తేదారు కావడంతో ధర తగ్గించే అవకాశం లేదని అంటున్నారు. ఉచిత ఇసుకలోనూ మార్పు చేశారు. కేవలం ఎడ్లబండిపై మాత్రమే సమీప గ్రామాల వారు తీసుకునే వెసులుబాటు ఉంది. వాగుల నుంచి గ్రామాల వారు ట్రాక్టర్లపై తీసుకొనే వీల్లేదు. జిల్లాలో మొత్తం 58 ఇసుక రేవులను కొత్తగా గుర్తించి వీటికి పర్యావరణ అనుమతులు తీసుకున్నారు. 58 రేవుల నుంచి దాదాపు 40లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక విక్రయాలకు సిద్ధం చేశారు. అంటే దాదాపు దీని విలువ సుమారు రూ.190 కోట్లు ఉంటుందని అంచనా. కానీ గుత్తేదారు చాలా తక్కువ ధరకే దీన్ని తీసుకున్నట్లు తెలిసింది. ఎల్‌1గా వచ్చిన గుత్తేదారుకు రీచ్‌లు అప్పగించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. వీడియోలు, సీసీ కెమెరాలు, కాటాలు(వేయింగ్‌ యంత్రాలు) ఇతర మౌలిక వసతులు అన్నీ గుత్తేదారుకు అప్పగించనున్నారు. రేవులు అప్పగించేందుకు ఇంకా తేదీ ఖరారు కాలేదు. దీంతో జిల్లాలో అక్రమ రవాణా జోరందుకుంది. కొంతమంది తమ పలుకుబడిని ఉపయోగించి రవాణా చేస్తున్నారు. కంచికచర్ల, నందిగామ ప్రాంతాల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతున్నారు. రొయ్యూరు, వల్లూరుపాలెం, చోడవరం, పెనమలూరు మండలం పరిధిలో పలు ప్రాంతాల్లో కృష్ణా నది నుంచి ఇసుక తరలిస్తున్నారు. కేవలం తోట్లవల్లూరులో ఒకే ఒక్క ప్రాంతంలో గుత్తేదారు ఇసుక కోసం వచ్చిన వారికి ఆన్‌లైన్‌ ప్రకారం విక్రయాలు జరుపుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ఎత్తేశారు. అనధికార తవ్వకాలు జరుపుతున్నారు. కొత్త గుత్తేదారుకు ఈనెల 20న అప్పగిస్తారని భావించారు. కానీ ఈనెలాఖరు వరకు ఆ అవకాశం లేదని తెలిసింది. ఈలోగా ఇసుకను రవాణా చేయాలని కొంతమంది భావిస్తున్నారు.


మరో 60లక్షలు..

జిల్లాలో మరో 60లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక అమ్మకాలకు సిద్ధమవుతోంది. ప్రకాశం బ్యారేజీలో పూడిక పేరుకుపోయిందని జలవనరుల శాఖ డ్రెడ్జింగ్‌కు టెండర్లను పిలిచిన విషయం తెలిసిందే. మొత్తం 12 ప్రాంతాల్లో 1.20కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఇసుక ఉందని బాతో మెట్రిక్‌ సర్వే ద్వారా తేలింది. దీనిలో 50శాతం వెలికి తీసేందుకు మాత్రమే టెండర్లను పిలిచింది. కోల్‌కతా కంపెనీ వీటిలో 7 ప్రాంతాలకు సింగిల్‌ టెండర్‌ ద్వారా దక్కించుకుంది. మరో 5 ప్రాంతాలను స్థానిక కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. త్వరలో వీటిని అప్పగించనున్నారు. నదిలో ఇసుక తవ్వి ఒడ్డుకు చేర్చడం ఈ గుత్తేదారుల పని. అక్కడి నుంచి దీన్ని స్టేజి 2 గుత్తేదారుల ద్వారా విక్రయించాలని ప్రణాళిక. దీన్ని ఇంకా ఖరారు చేయలేదు. క్యూబిక్‌ మీటరు రూ.475 చొప్పున ఈ ఇసుక విలువ రూ.285కోట్ల వరకు ఉంటుందని అంచనా. జలవనరుల శాఖ పిలిచిన టెండర్ల విలువ రూ.90కోట్లు మాత్రమే.


సిండికేట్‌..

గ్రామాల్లో, మండల కేంద్రాలో ఉన్న ట్రాక్టర్ల యజమానులు సిండికేట్‌గా మారుతున్నారు. వాగులు, వంకల నుంచి ఇసుక విక్రయాలకు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనికి కొంత మంది నేతలు సహకరిస్తున్నారు. కొత్త గుత్తేదారు వచ్చే లోగా భారీగా తరలించాలనేది వీరి ప్రణాళిక. గుత్తేదారు వచ్చిన తర్వాత అవగాహన ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. ఇసుక విక్రయాలు మే నెల నుంచి భారీగా పెరగనున్నాయి. ముహూర్తాలు ఉండడంతో ఇళ్లు, భవనాల నిర్మాణం ప్రారంభం కానుంది.


తేదీ నిర్ణయించలేదు.. - కె.మాధవీలత, జేసీ

ఇసుక రీచ్‌లను కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకు సిద్ధం చేశాం. దీనికి మార్గదర్శకాలు ఇంకా రాలేదు. ఎప్పటి నుంచి ఇవ్వాలనే దానిపై స్పష్టత లేదు. తేదీ వచ్చిన తర్వాత అప్పగించేందుకు 58 రీచ్‌లు ఉన్నాయి. అక్రమ రవాణా చేస్తే ఎస్‌ఈబీ పర్యవేక్షణ ఉంటుంది. కేసులు నమోదు చేస్తాం. ప్రకాశం బ్యారేజీ ఇసుకపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని