మృతదేహాన్ని రోడ్డుపై వదిలేసిన 108 సిబ్బంది
logo
Updated : 12/05/2021 04:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మృతదేహాన్ని రోడ్డుపై వదిలేసిన 108 సిబ్బంది

సంఘటన స్థలంలో విచారణ చేస్తున్న ఎస్సై సుబ్రహ్మణ్యం

తిరువూరు, న్యూస్‌టుడే: కరోనాతో బాధపడుతూ చికిత్స నిమిత్తం వెళ్తుండగా మార్గమధ్యంలో కన్నుమూసిన వ్యక్తి మృతదేహాన్ని 108 సిబ్బంది రహదారి పక్కన వదిలేసిన ఘటన కృష్ణా జిల్లా తిరువూరు మండలం మునుకుళ్ల సమీపంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షేక్‌ సుభాని (40) కరోనా బారిన పడటంతో కుటుంబ సభ్యులు ఆయనకు ఇంటి వద్దనే చికిత్స అందిస్తున్నారు. మంగళవారం శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. వారు చికిత్సకు తీసుకెళుతుండగా మధ్యలో వంతెన సమీపంలో కన్నుమూశారు. దీంతో సిబ్బంది మృతదేహాన్ని రహదారి పక్కన వదిలి వెళ్లారు. రెండు గంటల పాటు అలా అది రోడ్డు పక్కన ఉన్న విషయం తెలుసుకున్న ఎస్సై సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు పోలీసులు, సచివాలయ సిబ్బంది సుభాని మృతదేహాన్ని గ్రామానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.

ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు: చంద్రబాబు
ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘తిరువూరులో కరోనాతో బాధపడుతున్న షేక్‌ సుభానీని 108 వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్తూ, మధ్యలో చనిపోతే మానవత్వం లేకుండా నడిరోడ్డు మీదే వదిలేయడం అమానుషం, అనాగరికం. కరోనా బాధితులను నడిరోడ్డున వదిలేసి కుయ్‌ కుయ్‌ మంటూ 108 వాహనాలు వెళ్లిపోతున్నాయి. ఈ ఘటనకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు’ అని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ట్వీట్‌ చేశారు. ఘటనకు సంబంధించిన ఓ వీడియోను ట్వీట్‌కు జత చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని