ఆక్సిజన్‌ నిర్వహణలో... సదా అప్రమత్తం
logo
Published : 12/05/2021 03:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆక్సిజన్‌ నిర్వహణలో... సదా అప్రమత్తం

ఈనాడు -ఈటీవీతో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివశంకర్‌
ఈనాడు, అమరావతి  

‘తిరుపతి రుయా ఆస్పత్రిలో తలెత్తిన సమస్య ఎక్కడైనా ఎప్పుడైనా రావచ్చు. ఇవి ప్రమాదవశాత్తు జరిగే ఘటనలు.. రోడ్డు ప్రమాదం తరహాగానే భావించాలి. విపత్తులు జరిగినప్పుడు నష్టం తీవ్రంగానే ఉండవచ్చు. ప్రజలు దీన్ని అంగీకరించే స్థితిలో ఉండాలి. దానికి ఎవరేం చేయలేం. మన విజయవాడ ఆస్పత్రిలోనూ ప్రాణవాయువు సమస్య తలెత్తింది. మా సాంకేతిక బృందం అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ప్రమాదం తప్పింది. బృందం నిత్యం సిద్ధంగా ఉంటోంది. ఆక్సిజన్‌ ట్యాంకర్లు నింపే సమయంలో బోల్టులు లీకేజీ కావచ్చు. పైపులు తుప్పు పట్టి ప్రాణవాయువు లీకు కావచ్చు. మన ఇంటి నీటి పైపులైను వ్యవస్థ తరహాలో ఉంటుంది’ అని విజయవాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివశంకర్‌ స్పష్టం చేశారు. రుయా ఘటన నేపథ్యంలో విజయవాడ జనరల్‌ ఆస్పత్రిలో పరిస్థితిపై భిన్నకథనాలు వస్తున్నాయి. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివశంకర్‌ ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.
రోజుకు 16 నుంచి 24 టన్నులు..!
విజయవాడ జీజీహెచ్‌లో ఎంత ఆక్సిజన్‌ అవసరం అనేది రోగుల సంఖ్య వినియోగాన్ని బట్టి ఉంటుంది. మనకు దాదాపు 16 నుంచి 24 టన్నుల వరకు అవసరం ఉంటుంది. మనదగ్గర 847 పడకలు ఉంటే 816 పడకలు ఆక్సిజన్‌ మీద ఏర్పాటు చేశాం. ఇవి కాకుండా క్యాజువాలిటీలోనూ ఏర్పాటు చేస్తున్నాం. రోగుల పరిస్థితిని బట్టి ఆక్సిజన్‌ అందిస్తాం. రోగ లక్షణాలు ఓ మాదిరిగా ఉంటే 5లీ. నుంచి 10 లీటర్ల వరకు ఆక్సిజన్‌ అందిస్తాం. కొంత క్లిష్ట పరిస్థితి ఉంటే 15 లీటర్ల వరకు ఇస్తాం. వెంటిలేటర్‌ అంటే ఆక్సిజన్‌ను బలవంతంగా రోగి ఊపిరితిత్తులలోకి నెట్టడమే. రోగులు స్వయంగా ప్రాణవాయువు పీల్చుకునే స్థితిలో ఉంటే తక్కువ అవసరం ఉంటుంది. బలవంతంగా నెట్టాల్సిన పరిస్థితిలో ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. ఆస్పత్రికి ప్రతి రోజూ ఆక్సిజన్‌ అందేవిధంగా కలెక్టర్‌, జేసీ ఏర్పాట్లు చేస్తున్నారు.
వచ్చే రోగులు 2వేలు..!
ఆసుపత్రిలో పడకలన్నీ నిండాయి. ప్రస్తుతం కొన్ని మాత్రమే ఖాళీ ఉన్నాయి. పడకలు ఖాళీ అయితే లేదా ఎవరైనా దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతే ఆ పడకలను ఇతరులకు కేటాయిస్తున్నాం. రోజుకు 2వేల మంది వస్తున్నారు. ఇంతమందికి పడకలు ఎలా సర్దుబాటు చేస్తాం. మొదటి దశలో నాలుగు నెలలకు 800 కేసులకు చేరుకొన్నాం. ప్రస్తుతం 45 రోజుల్లేనే ఆ స్థాయికి వచ్చాం. వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది. రోజుకు 100 ప్రవేశాలు ఇస్తున్నాం. 60, 70 ప్రవేశాలు సాధారణంగా జరుగుతున్నాయి. మిగతా ప్రవేశాలకు పడకలు ఖాళీని బట్టి ఇస్తున్నాం. అంతవరకు క్యాజువాలిటీలో ఉంచి చికిత్స చేస్తున్నాం. మెరుగుపడి ఇంటికి చేరే వారు ప్రస్తుతం తక్కువగా ఉంటున్నారు. మెరుగుపడిన వారిని ఆక్సిజన్‌ పడకల నుంచి ఖాళీ చేయించి సాధారణ పడకలపై ఉంచుతున్నాం. రెండు రోజులు పరిశీలనలో ఉంచి తర్వాత డిశ్ఛార్జ్‌ చేస్తున్నాం. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి జీజీహెచ్‌కే వస్తున్నారు. దీంతో సమస్య ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తోంది. సాధ్యమైనంత వరకు పడకలు కేటాయిస్తున్నాం. జీజీహెచ్‌కు అనుబంధంగా వెన్యూ ఫంక్షన్‌ హాలు తీసుకుని 100 పడకలు ఆక్సిజన్‌తో ఏర్పాటు చేస్తున్నాం. వైద్య కళాశాలలో ట్రైఏజ్‌ కేంద్రంలో 30 పడకలు ఏర్పాటు చేస్తున్నాం. వచ్చిన వారిని ఇక్కడ పరిశీలన చేసి పడకలు ఇస్తాం.
వైద్య సిబ్బందికి..!
జీజీహెచ్‌లో వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. 26 శాఖల సిబ్బంది కరోనా సేవలు అందిస్తున్నారు. పీపీఈ కిట్లు వేసినా ఎక్కువ సమయం నేరుగా రోగులతో కలిసి ఉండడం వల్ల వైరస్‌ ప్రభావానికి గురవుతున్నారు. గతంలో వైద్య సిబ్బందికి ప్రత్యేక వార్డులు కేటాయించాం. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇస్తున్నాం. 30 శాతం కరోనా వైరస్‌కు గురైతే 15 శాతం సిబ్బందికి చికిత్స అవసరం ఉంటుంది. ఉమ్మడి కుటుంబాలు కావడంతో వారి కుటుంబ సభ్యులు ప్రభావితమవుతున్నారు. దాదాపు అందరికి వ్యాక్సిన్‌ వేయించాం. హౌస్‌ సర్జన్‌ విద్యార్థులకు ఇటీవల ఒక డోసు వేయించాం. మరో డోసు వేయించాల్సి ఉంది. వ్యాక్సిన్‌ వేయించుకున్నవారికి స్వల్ప లక్షణాలు వచ్చినా కోలుకుంటున్నారు.

అంతే వేగంగా తగ్గుతుంది..!
కరోనా రెండో దశ ఎంతో వేగంగా దూసుకొచ్చింది. కేవలం నెల రోజుల్లోనే జిల్లాలో 800 కేసులు సగటున వస్తున్నాయి. మొదటి దశలో పోల్చితే చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. తిరిగి అంతే వేగంగా తగ్గిపోతుందని అంటున్నారు. మరో 5, 6 రోజుల్లో తగ్గుదల కనిపిస్తుందని భావిస్తున్నాం. ఎంత వేగంగా వస్తే.. అంతే వేగంగా తగ్గుదల ఉంటుందని నా అనుభవం ద్వారా చెబుతున్నాను. దీనికి ప్రతి ఒక్కరూ ముందు చికిత్స కన్నా నివారణ ముఖ్యం. మాస్క్‌, శానిటైజేషన్‌, భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. స్వల్ప లక్షణాలు ఉన్న వారు ఇంటి వద్ద హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స తీసుకోవాలి. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు మందులు అందిస్తారు. ట్రైఏజ్‌ కేంద్రం నుంచి సూచనలు, సలహాలు తీసుకోవచ్చు. అనవసరంగా భయపడి ఆస్పత్రికి చేరేవారు ఎక్కువగా ఉన్నారు. మూడింట రెండొంతుల మంది అనవసరంగా ఆస్పత్రిలో చేరేవారే ఉన్నారు. సీరియస్‌గా ఉన్నవారికి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం చికిత్స, ఔషధాలు ఇస్తున్నాం. ఇమ్యూనిటీ బాగుంటే త్వరగా రెస్పాండ్‌ అయి కోలుకుంటున్నారు. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు పోరాటం చేస్తున్నారు. ఇమ్యూనిటీ పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని