Published : 12/05/2021 03:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాయితీ యంత్రం జాడేది?

సత్తెనపల్లి, న్యూస్‌టుడే

సాగును కొత్త పుంతలు తొక్కించేందుకు ఉద్దేశించిన యంత్రాలు, పరికరాలు అన్నదాతలకు సకాలంలో అందడం లేదు. ఏటా ఖరీఫ్‌ ప్రారంభం నుంచి రైతులకు రాయితీపై ప్రభుత్వం యంత్ర పరికరాలు అందించేది. 2019 నుంచి వీటి పంపిణీ నిలిచిపోయింది. 2020లో దరఖాస్తు చేసుకున్న వారికి అదే ఏడాది అక్టోబరు 2న అందజేస్తామని ప్రకటించినా కంపెనీలతో ఒప్పందం కుదరక ప్రక్రియ ఆగిపోయింది. ఈ నెల 17వ తేదీ నుంచి రాయితీపై విత్తనాల పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కావాల్సిన యంత్రాలు, పరికరాలను ఎంపిక చేసుకుని 10 శాతం వాటా చెల్లించాలని సంఘాల్ని అధికారులు కోరుతుండగా వారు ముందుకురాని పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంది.
పథకం : అద్దె విధానంపై యంత్ర పరికరాలు
ఎలా : రైతు భరోసా కేంద్రాని (ఆర్‌బీకే)కి ఒకటి చొప్పున జిల్లాలోని 57 మండలాల్లో కస్టమర్‌ హైరింగ్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ)ను ఏర్పాటు చేసి వాటి ద్వారా డిమాండ్‌ ఉన్న వాహనాలను గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు అందజేయడం. ఆర్‌బీకే పరిధిలోని అభ్యుదయ రైతులతో ఈ సంఘాలను ఏర్పాటు చేశారు. వాటికి శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు.
ఎన్ని సీహెచ్‌సీలు : జిల్లాలో 852 రైతు భరోసా కేంద్రాలకు 852 సీహెచ్‌సీలు ఏర్పాటయ్యాయి. వీటికి రూ.12 లక్షలు నుంచి రూ.15 లక్షలు విలువ చేసే యంత్ర పరికరాలు అందజేయాల్సి ఉంటుంది.
రైతుహబ్‌లు : బాపట్ల, తెనాలి, గుంటూరు, రొంపిచర్ల, పిడుగురాళ్లలో రైతు హబ్‌లు ఏర్పాటు చేశారు. వీటికి రూ.1.20 కోట్ల నుంచి రూ.1.30 కోట్లు విలువ చేసే యంత్ర పరికరాలను ఇస్తున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు.
ఏయే పరికరాలు: ట్రాక్టర్లు, గొర్రులు, తైవాన్‌ స్ప్రేయర్లు, కల్టివేటర్లు, రోటోవేటర్లు, పవర్‌వేటర్లు, పవర్‌ స్ప్రేయర్లు, ఇతర పరికరాల కోసం డీబీటీలో సీహెచ్‌సీలు వివరాలు నమోదు చేసుకోవాలి.  
40 శాతం రాయితీ : సీహెచ్‌సీలు కొనుగోలు చేసే యంత్ర పరికరాలకు రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం రాయితీ అందజేస్తుంది. మిగిలిన 60 శాతంలో 50 శాతం జిల్లాలోని 38 జీడీసీసీ బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించేలా ప్రణాళిక రూపొందించారు. మిగిలిన 10 శాతం తమ వాటాగా సంఘాలు చెల్లించాలి. డైరెక్ట్‌ బెన్‌ఫిట్‌ పోర్టల్‌ (డీబీటీ)ల సీహెచ్‌సీల బాధ్యులు వివరాలు నమోదు చేస్తే ఏవో, ఏడీఏ పరిశీలన చేసి జేడీఏకు నివేదిక అందజేస్తారు. అక్కడి నుంచి ప్రభుత్వానికి వెళ్లి ఆమోదముద్ర లభిస్తుంది. తాము రాయితీపై పొందిన యంత్ర పరికరాలను అద్దె ప్రాతిపదికన సంఘాలు అన్నదాతలకు ఇవ్వాలి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్ని సకాలంలో తిరిగి చెల్లించాలి. తక్కువ అద్దెకు రైతులకు పరికరాలు అందడంతో పాటు సంఘాలుగా ఏర్పాటైన రైతులకు ఉపాధి కల్పనకు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు.
ప్రస్తుత పరిస్థితి : గ్రామాల్లో స్థానిక అవసరాలకు ఉపయోగపడే యంత్ర, పరికరాలను సంఘాలు గుర్తించాయి. అయితే 10 శాతం వాటా చెల్లింపునకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దీంతో ఆ ప్రక్రియ ఆదిలోనే ఆగిపోయింది. ఏడీఏలు సంఘాల బాధ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి వాటా చెల్లించాలని కోరుతున్నారు. వారి వాటా చెల్లింపు తరువాత యంత్ర పరికరాల్ని అందించే చర్యలు చేపపడతామని అధికారులు చెబుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని