నగర అభివృద్ధికి పూర్తి సహకారం : కలెక్టరు
logo
Published : 13/06/2021 03:47 IST

నగర అభివృద్ధికి పూర్తి సహకారం : కలెక్టరు


కలెక్టరు నివాస్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: విజయవాడ నగర అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని కలెక్టరు జె.నివాస్‌ తెలిపారు. నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి శనివారం కలెక్టరు నివాస్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా మేయరు, కలెక్టరుతోపాటు వీఎంసీ కమిషనరు వి.ప్రసన్న వెంకటేష్‌ నగర అభివృద్ధిపై కాసేపు చర్చించారు. గతంలో వీఎంసీ కమిషనరుగా పని చేసిన నేపథ్యంలో నగర పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న క్రమంలో, సూచనలు, సలహాలు ఇవ్వాలని మేయరు కోరారు.

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కలెక్టరు జె.నివాస్‌ను, ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషను, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు నగరంలోని విడిది కార్యాలయంలో శనివారం మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు. ఐకాస ప్రధాన కార్యదర్శి వైవీ రావు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసొసియేషను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, కార్యనిర్వాహక కార్యదర్శి జి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కిశోర్‌ (కార్మిక శాఖ అధికారుల సంఘం) తదితరులు పాల్గొన్నారు.

సమష్టి కృషితో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రజలందరి భాగస్వామ్యంతోనే సాధ్యమని కలెక్టరు జె.నివాస్‌ పేర్కొన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని, ఎన్సీఎల్పీ, ఛైల్డ్‌లైన్‌-1098, ఫోరం ఫర్‌ ఛైల్డ్‌ రైట్స్‌ సంయుక్తంగా రూపొందించిన ప్రచార పత్రాలను నగరంలోని విడిది కార్యాలయంలో శనివారం కలెక్టరు ఆవిష్కరించారు. విద్యా హక్కు చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బడి ఈడు పిల్లలు పాఠశాలల్లో ఉండేలా చూడాలన్నారు. బాలల హక్కుల కోసం ప్రభుత్వ, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎన్సీఎల్పీ పీడీ డి.ఆంజనేయరెడ్డి, ఛైల్డ్‌లైన్‌ జిల్లా సమన్వయకర్త ఎ.రమేష్‌, బృంద సభ్యులు ఎస్‌.అబ్రహం, టి.సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని