శుభకార్యం జరగాల్సిన ఇంట విషాదం
logo
Published : 22/06/2021 05:00 IST

శుభకార్యం జరగాల్సిన ఇంట విషాదం

అమెరికాలో బోటు ప్రమాదం
గుంటూరు జిల్లాకు చెందిన యువకుడి మృతి


సాయిప్రవీణ్‌ కుమార్‌ (పాత చిత్రం)

హైదరాబాద్‌ (మియాపూర్‌), న్యూస్‌టుడే: కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించాడు. పై చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. తన కలలు సాకారమయ్యే సమయంలోనే బోటు రూపంలో మృత్యువు యువకుడిని బలితీసుకుంది. ఈ విషాదకర సంఘటనకు సంబంధించి మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లా అమరావతి మండలం అత్తులూరు గ్రామానికి చెందిన మాదినేని వెంకట శ్రీనివాసరావు విద్యాశాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తూ ఉద్యోగ విరమణ పొందారు. ఆయన కుమారుడు ఎం.సాయి ప్రవీణ్‌ కుమార్‌(31)అమెరికాలోని వర్జీనియాలో ఆర్కిటెక్ట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం స్నేహితులతో కలిసి ఆస్టిన్‌లోని ఓ జిమ్‌కు వెళ్లి అనంతరం సమీపంలో ఉన్న లేక్‌ సందర్శనకు వెళ్లాడు. అక్కడ ఫెడల్‌ లాక్‌ బోటులో (నిల్చొని నడిపే బోటు) విహరిస్తూ ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యాడు. రెండు రోజుల క్రితం అతని మృతదేహాన్ని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం తిరుపతిలోని ఆయన సోదరికి అతని స్నేహితులు సమాచారం అందించారు. ఈ విషయం మియాపూర్‌ జనప్రియ వెస్ట్‌ సిటీలో నివాసముంటున్న తల్లిదండ్రులు శ్రీనివాసరావు, రమాదేవి దంపతులకు ఆదివారం తెలియడంతో వారి ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

సమయపాలన.. చదువుపై ఆసక్తి..: చిన్ననాటి నుంచి చదువుపై ఎంతో ఆసక్తి ఉన్న సాయిప్రవీణ్‌ కుమార్‌ దుండిగల్‌ పురపాలికలోని డీఆర్‌కే ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తిచేశాడు. అమెరికాలో ఉన్నత చదువులు చదవాలన్న కోరిక ఉండటంతో అక్కడే ఎంఎస్‌ పూర్తిచేసి మంచి జీతంతో ఉద్యోగంలో చేరాడు. చదువు పూర్తైన తర్వాత ఫోర్లిడాలో చార్టెడ్‌ కమ్యూనికేషన్‌లో ఉద్యోగిగా పనిచేశాడు. అనంతరం 2019 నుంచి వర్జీనియాలో 3 సంవత్సరాలుగా అమెజాన్‌లో సొల్యూషన్‌ అర్కిటెక్ట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 2019 నవంబరులో వర్జీనియాలో సొంతింటి నిర్మాణం చేపట్టాడు. ‘ఎప్పుడూ సమయాన్ని వృథా చేసేవాడు కాదు, చాలా తెలివిగా తాను విధులు నిర్వహిస్తున్న కంపెనీలో బాధ్యతలను నిర్వర్తించేవాడు. మరికొద్ది రోజుల్లో పదోన్నతి పొందే అవకాశాలు సుగమం చేసుకున్నాడు. సమయానికి ఎంతో విలువనిస్తూ ఇటీవల డ్రైవర్‌ లేకుండా నడిచే కారును కొనుగోలు చేశాడు. ఇంటి నుంచి కంపెనీకి వెళ్లే సమయంలోనూ ఆన్‌లైన్‌లోనే తన కంపెనీ పనులను చక్కబెట్టుకునేవాడు’ అని తండ్రి శ్రీనివాసరావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.  

వివాహం జరగాల్సిన వేళ..: అమెరికాలో స్థిరపడిన అతనికి ఇటీవల తల్లిదండ్రులు వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన రోజు గురువారం ఉదయం తమతో మాట్లాడి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సంభాషించాడని, అవే తమ కుమారుడి చివరి మాటలు అని తల్లిదండ్రులు ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే స్వస్థలానికి రావాల్సి ఉండగా కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రయాణం వాయిదా పడిందన్నారు. ఒకవేళ ఇక్కడికి వచ్చి ఉంటే ప్రమాదం తప్పి ఉండేదని వారు కన్నీటి పర్యంతమయ్యారు.

అత్తలూరులో విషాద ఛాయలు
అత్తలూరు (పెదకూరపాడు), న్యూస్‌టుడే: పెళ్లి చేసుకుని ఊరు వస్తానని చెప్పి.. అంతలోనే దూరమైపోయావా అంటూ అమెరికాలో బోటు ప్రమాదంలో మృతి చెందిన మాదినేని ప్రవీణ్‌కుమార్‌ అలియాస్‌ టింకు బంధువులు, మిత్రులు రోదించారు. ఆయన కన్నుమూశారని తెలియడంతో స్వగ్రామం గుంటూరు జిల్లా అమరావతి మండలం అత్తలూరులో విషాద ఛాయలు అలముకున్నాయి. పండగలు, బంధువుల ఇళ్లల్లో శుభకార్యాలకు తల్లిదండ్రులతో కలిసి ప్రవీణ్‌కుమార్‌ అత్తలూరు వచ్చేవారు. మూడేళ్ల కింద ఇక్కడికి వచ్చినప్పుడు వారి పొలాన్ని పరిశీలించి బంధువులతో సంతోషంగా గడిపారని ఆయన నాయనమ్మ సోదరుడు నెట్టెం వెంకయ్య తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని