తప్పుల తడకగా పిల్లల రిజిస్ట్రేషన్‌
eenadu telugu news
Published : 01/08/2021 02:43 IST

తప్పుల తడకగా పిల్లల రిజిస్ట్రేషన్‌

ఒకే పేరుతో పలు ఖాతాలు తెరిచినట్లు నిర్ధారణ

ఆర్‌సీహెచ్‌ పోర్టల్‌లో వివరాలు సరిచేసి పంపాలని ఆదేశం

ఈనాడు, అమరావతి

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో పర్యవేక్షణ లోపించింది. వైద్యం జేసీ పరిధిలో ఉన్నా సంబంధిత వైద్య యంత్రాంగం విధి నిర్వహణలో అలసత్వంగానే ఉంటోంది. ఇది లబ్ధిదారులపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ దాకా ఆర్‌సీహెచ్‌ పోర్టల్‌లో చైల్డ్‌ రిజిస్ట్రేషన్‌ వివరాలను తప్పుల తడకగా నమోదు చేసి చేతులు దులుపుకొంది. దీంతో అర్హులైన వారికి ఆయా పథకాలు అందకుండా పోయే ప్రమాదం ఉంది. ఈ తప్పిదాన్ని కుటుంబ, ఆరోగ్య సంక్షేమశాఖ ఉన్నతాధికారులు గుర్తించి తిరిగి సరిచేసి పంపాలని ఆదేశించే వరకు ఈ తప్పిదాలను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ గుర్తించలేదు. తల్లులు, శిశువుల వివరాలను ఆర్‌సీహెచ్‌ పోర్టల్‌లో నమోదు చేస్తేనే సంబంధిత లబ్ధిదారులకు జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద పలు ప్రయోజనాలు వర్తింపజేస్తారు. ప్రధానంగా తల్లులకు ప్రసవ ఛార్జీలు, పోషకాహారం వంటివి అందిస్తారు. ఈ వివరాలే తప్పుల తడకగా ఉంటే ఎవరికి వాటిని వర్తింపజేయాలో తెలియక చివరకు యంత్రాంగం సైతం చేతులెత్తేస్తుంది. జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు 16,763 మంది చైల్డ్‌ రిజిస్ట్రేషన్లు చేయగా వాటిల్లో 2451 రిజిస్ట్రేషన్లకు చరవాణి నంబర్లు ఒకేలా ఉన్నాయి. ఒకే ఫోన్‌ నంబరు పలువురు లబ్ధిదారులకు పోర్టల్‌లో నమోదు చేసినట్లు ఉన్నతాధికారుల పరిశీలనలో బయటపడింది. 283 ఖాతాలకు తల్లి పేర్లు ఒకేలా ఉన్నాయి. ఈ నిర్వాకానికి ఏఎన్‌ఎంలతో పాటు సూపర్‌వైజర్లు బాధ్యులవుతారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏప్రిల్‌ నుంచి మే వరకు చాలా పీహెచ్‌సీలను మూసేశారు. ఇదే అదనుగా పలువురు పీహెచ్‌సీ వైద్యులు, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు, హెల్త్‌ అసిస్టెంట్లు, ఎంపీహెచ్‌ఈవోలు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయానికి కొవిడ్‌ రిపోర్టుల సేకరణ పేరుతో వచ్చారు. నెలలు తరబడి అనేక మంది డీఎంహెచ్‌వో కార్యాలయంలోనే తిష్ఠ వేయడంతో క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంలు, హెల్త్‌ సూపర్‌వైజర్లు చైల్డ్‌ రిజిస్ట్రేషన్లు ఎలా చేస్తున్నారో పరిశీలించే వారు లేకుండా పోయారు. దీనివల్లే అన్ని తప్పులు జరిగాయని వైద్యవర్గాలు అంటున్నాయి. జిల్లాలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టినా ఇంకా కొంతమంది డీఎంహెచ్‌వో కార్యాలయాన్ని అంటిపెట్టుకుని డిప్యూటేషన్లపై యధావిధిగా కొనసాగుతున్నారు. డిప్యూటేషన్‌పై ఉన్న ఉద్యోగులను తక్షణమే తిరిగి పీహెచ్‌సీలకు పంపాలని కుటుంబ, ఆరోగ్య సంక్షేమశాఖ కమిషనర్‌ నుంచి ఆదేశించినా జిల్లాలో మాత్రం ఇంకా కొందరిని రిలీవ్‌ చేయకుండా కార్యాలయం విధులకే వినియోగించుకోవటం గమనార్హం.

ఒప్పంద ఉద్యోగులకు కీలక బాధ్యతలు

డీఎంహెచ్‌వో కార్యాలయంలో పలు కీలక విభాగాలు ఒప్పంద ఉద్యోగులే పర్యవేక్షిస్తున్నారు. వారికి కీలక బాధ్యతలు అప్పగించటం సబబుకాదని వారికి జవాబుదారీతనం తక్కువని, అదే రెగ్యులర్‌ ఉద్యోగులు అయితే తప్పులు దొర్లటానికి ఆస్కారం ఉండదని వైద్యవర్గాలు అంటున్నాయి. జాతీయ ఆరోగ్య మిషన్‌కు సంబంధించిన అనేక పథకాలను ఒప్పంద ఉద్యోగులే పర్యవేక్షిస్తున్నారు. అదే ఆర్‌సీహెచ్‌ పోర్టల్‌లో ఇన్ని తప్పులు దొర్లటానికి కారణమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకే శిశువుకు తల్లిదండ్రుల పేర్లు ఒకేలా ఉన్నాయని వాటిని మరోసారి పరిశీలించి తప్పులను సవరించాలని ఉన్నతాధికారులు ఆదేశించటంతో ప్రస్తుతం ఆరీసీహెచ్‌ పోర్టల్‌లో నమోదైన శిశు రిజిస్ట్రేషన్ల ఆధారంగా డూప్లికేట్‌ పేర్లను తొలగించి పక్కా జాబితా రూపొందించే పనిలో యంత్రాంగం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని