ఆన్‌లైన్‌ జూదం.. జల్సాలతో డబ్బు హాంఫట్‌
eenadu telugu news
Updated : 18/09/2021 12:36 IST

ఆన్‌లైన్‌ జూదం.. జల్సాలతో డబ్బు హాంఫట్‌

తక్కువ ధరకు బంగారం కేసులో కొత్త విషయాలు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: తక్కువ ధరకు బంగారం ఇస్తానంటూ పలువురిని మోసగించిన కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నాగమణి అనే మహిళ రైల్వే ఉద్యోగి వెంకటేశ్వరరావుతో కలిసి తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానంటూ పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిన విషయం విదితమే. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన టాస్క్‌ఫోర్స్‌, సీసీఎస్‌ పోలీసులను నాగమణి రోజుకో మాట చెప్పి దర్యాప్తునకు సహకరించక ముప్పుతిప్పలు పెట్టారు. అయినా అధికారులు ఆమెను విచారించి కొత్త విషయాలు రాబట్టారు.

రమ్మీలో రూ.90 లక్షలు..

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగమణి ఆన్‌లైన్‌ రమ్మీ ఆడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆమె దాదాపు రూ.90లక్షల వరకు దీనిలో పోగొట్టుకున్నట్లు సమాచారం. బంగారం ఇప్పిస్తానంటూ పలువురి నుంచి తీసుకున్న డబ్బును జల్సాలకు వినియోగించినట్లు గుర్తించారు. పోలీసులు ఆమె ఇంట్లో తనిఖీలు చేయగా.. రూ.40వేలు విలువైన మద్యం సీసాలను గుర్తించారు. దీన్ని బట్టే ఆమె ఎంతటి జల్సాలకు పాల్పడిందో తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. 2018 నుంచి ఆమె బంగారం పేరిట పలువురు నుంచి దాదాపు రూ.8కోట్ల వరకు వసూలు చేశారు. ఒక వ్యక్తే ఆమెకు బంగారం కోసం రూ.2.6 కోట్లు చెల్లించారని పోలీసుల దర్యాప్తులో తేలడం విశేషం.

నష్టం వస్తున్నా...

తక్కువ ధరకు బంగారం ఇచ్చే సందర్భంలో నాగమణికి నష్టాలు వస్తాయని తెలిసినా.. 100 గ్రాముల బిస్కెట్‌ రూ.4 లక్షలకు కొనుగోలు చేస్తే దాన్ని రూ.3 లక్షలకు విక్రయించేవారు. ఇలా ఒక్కో బిస్కెఫట్టులో రూ.1 లక్ష వరకు నష్టం వస్తున్నా.. లావాదేవీలు ఆపలేదు. ఇలా ఆమె సుమారు 7 కిలోల వరకు బంగారం విక్రయించి సుమారు రూ.70 లక్షలు బంగారంలోనే పోగొట్టుకున్నట్లు గుర్తించారు. ఒకరి నుంచి డబ్బులు తీసుకుని బంగారం కొనుగోలు చేసి మరొకరికి ఇవ్వటం, ఆన్‌లైన్‌ రమ్మీ, బంగారం కొనుగోళ్లలో నష్టం రావడంతో డబ్బులు ఇచ్చిన వారికి సర్దుబాటు చేయలేక నెలల తరబడి పెండింగ్‌లో పెట్టటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

తాకట్టులో 4 కిలోల బంగారం

రైల్వే, దుర్గగుడి ఉద్యోగుల నుంచి తీసుకున్న డబ్బును ఏం చేశారు అనే అంశంపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రోజుకో మాట మార్చినా ఎట్టకేలకు కొన్ని విషయాలను రాబట్టారు. ఉద్యోగుల నుంచి తీసుకున్న డబ్బులు కొంత జల్సాలకు, ఆన్‌లైన్‌ రమ్మీలో కొంత పొగొట్టుకున్న కొంత సొమ్ముతో బంగారం కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇలా కొనుగోలు చేసిన 4 కిలోల బంగారం తాకట్టులో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మిగిలిన సొమ్ము ఏం చేశారు? అనే అంశంపై దృష్టి పెట్టారు. కాగా నాగమణి, వెంకటేశ్వరరావులపై పలువురు రైల్వే ఉద్యోగులు సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఇంకా మరికొంత మంది పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని