గంజాయి కేసులో నిందితుడి పరారీ
eenadu telugu news
Published : 20/09/2021 05:33 IST

గంజాయి కేసులో నిందితుడి పరారీ


పోలీసులు అరెస్టు చేసిన నిందితులు

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: పట్టాభిపురం పోలీసుల కళ్లు గప్పి గంజాయి కేసులో నిందితుడు పరారయ్యాడు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు నిందితుడిని తీసుకువచ్చిన క్రమంలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడంతో గోడ దూకి పారిపోయాడు. ఒంగోలుకు చెందిన దర్శి శ్యామ్‌కుమార్‌, శ్రీకర్‌ తేజ, సాయికుమార్‌, అగస్తేన్‌, గుంటూరు కొరిటెపాడుకు చెందిన రాజేష్‌, దుర్గి మండలం మూదుకూరుకు చెందిన పులి బాబు, రాజుపాలెం మండలం నెమలిపురికి చెందిన నరసింహారెడ్డి ఒక ముఠాగా ఏర్పడి గంజాయి వ్యాపారం చేస్తున్నారు. శ్యామ్‌కుమార్‌, శ్రీకర్‌ తేజ, సాయికుమార్‌, అగస్తేన్‌ సులువుగా డబ్బు సంపాదించి లాభాలు గడించాలన్న ఉద్దేశంతో విశాఖ జిల్లా నర్సీపట్నం సమీపంలోని చింతపల్లి ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి గుంటూరు, ఒంగోలు, చెన్నై నగరాలకు గంజాయిని సరఫరా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నలుగురు శనివారం సాయంత్రం కారులో పెద్ద ఎత్తున గంజాయి బండిళ్లు తీసుకువచ్చి జేకేసీ కళాశాల రోడ్డులో రాజేష్‌, పులిబాబు, నరసింహారెడ్డికి ఇస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఏడుగుర్ని అదుపులోకి తీసుకుని కారు డిక్కీలో ఉన్న 12 బండిల్స్‌తో కూడిన 44.5 కేజీల గంజాయితో పాటు కారు, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి నిందితులను పట్టాభిపురం ఠాణాకు తరలించి విచారించారు. కోర్టుకు హాజరుపర్చే హడావుడిలో పోలీసులు ఉండగా, మరుగుదొడ్డికి వెళ్లిన ఎ1 శ్యామ్‌కుమార్‌ పోలీసుల కళ్లు గప్పి గోడ దూకి పరారయ్యాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని