పదవుల పంపంక!
eenadu telugu news
Published : 21/09/2021 03:17 IST

పదవుల పంపంక!

జడ్పీ వైస్‌ఛైర్మన్‌ పదవికి ఆశావహులు ఎందరో

ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు మంతనాలు

ఈనాడు-అమరావతి

పరిషత్‌ ఫలితాలు వెల్లడి కావడంతో జిల్లా, మండల పరిషత్‌ పదవులపై నేతలు మంతనాలు మొదలెట్టారు. జడ్పీటీసీ స్థానాలను అధికారపార్టీ వైకాపా క్లీన్‌ స్వీప్‌ చేయడంతో అన్ని పదవులు ఆ పార్టీ అభ్యర్థులకు దక్కనున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులుగా విజయం సాధించిన నేతలు పదవులను దక్కించుకోవడానికి నియోజకవర్గ నేతల వద్దకు వెళుతున్నారు. మండలంలో ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవి, కోఆప్షన్‌, జిల్లా పరిషత్‌లో జడ్పీ ఛైర్‌పర్సన్‌, జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్ష పదవులు రెండు, కోఆప్షన్‌ సభ్యుల పదవులు ఉంటాయి. వీటిపై పలువురు ఆశలు పెంచుకోవడంతో పోటీ పెరిగింది. జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ పదవి ఎస్సీ సామాజికవర్గానికి రిజర్వు కావడంతో కొల్లిపర నుంచి విజయం సాధించిన కత్తెర హెనీ క్రిస్టినా పేరు దాదాపు ఖరారైందని ఆపార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఉపాధ్య పదవుల కోసం నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఛైర్‌పర్సన్‌ పదవి ఎస్సీ సామాజికవర్గానికి ఇచ్చినందున ఉపాధ్యక్ష పదవులు రెండు బీసీ, ఓసీ సామాజికవర్గాలకు కేటాయిస్తారన్న అంచనాతో ఆయా సామాజికవర్గాల నేతలు మంతనాలు మొదలెట్టారు. ఎంపీలు, ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. పల్నాడు ప్రాంతం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన నేత ఒకరు జడ్పీ ఉపాధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు. సదరు నేత ప్రజాప్రతినిధి కుమారుడు. మంగళవారం జిల్లా పరిషత్‌ పదవుల ఎన్నికకు సంబంధించిన ప్రకటన వెలువడనుంది. ఈనేపథ్యంలో ఎంపికపై స్పష్టత వస్తుందని ఆపార్టీ నేత ఒకరు తెలిపారు.

స్పష్టత ఇస్తున్న నేతలు: జిల్లాలో దుగ్గిరాల మినహా మిగిలిన మండలాల్లో వైకాపా అభ్యర్థులు ఆధిక్యం సాధించడంతో ఎంపీపీ, మండల ఉపాధ్యక్ష పదవులకు నేతల ఎంపిక మొదలైంది. ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల సమయంలోనే ఎంపీపీ పదవి ఎవరికి ఇవ్వాలన్న విషయమై నియోజకవర్గ నేతలు చాలాచోట్ల స్పష్టత ఇచ్చారు. కొన్ని మండలాల్లో మాత్రం ఏకాభిప్రాయం రాకపోవడంతో గెలిచిన తర్వాత ఎంపీపీ పదవిపై చర్చిద్దామని నేతలు వాయిదా వేశారు. ఇలాంటిచోట్ల ఎంపీపీ పదవి కాలాన్ని పోటీపడుతున్న ఇద్దరికీ చెరిసగం ఇచ్చేలా నేతలు సర్దుబాటు చేస్తున్నారు. ఉపాధ్యక్ష పదవులను స్థానిక నేతల అభిప్రాయాల మేరకు కేటాయిస్తున్నారు.

దుగ్గిరాల పీఠంపై ఉత్కంఠ

దుగ్గిరాల మండలంలో తెదేపాకు 9 ఎంపీటీసీ స్థానాలు రాగా, వైకాపాకు 8, జనసేనకు 1 స్థానం వచ్చాయి. సాంకేతికంగా తెదేపాకు ఎంపీపీ పీఠం, ఇతర పదవులు దక్కనున్నాయి. అయితే ఆయా పార్టీల అభ్యర్థులకు ప్రత్యర్థి పార్టీ వారు వల వేసి వారి వైపు తిప్పుకుంటారోనని రెండు పార్టీలు శిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఎంపీటీసీ సభ్యులుగా గెలిచిన అభ్యర్థులను క్యాంపునకు తరలించి ప్రత్యర్థులకు అందుబాటులో లేకుండా చూస్తున్నారు. అయితే ఇరుపార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఎన్నిక సమయంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఎన్నిక సమయంలో 50శాతం కోరం ఉంటే ప్రక్రియ పూర్తిచేస్తారు. సభ్యులు చేతులు ఎత్తడం ద్వారా ఆమోదం తెలిపి ఎంపీపీని ఎన్నుకుంటారు. ఈక్రమంలో తమవైపు తిప్పుకున్న వారు సహకరించేలా చూసుకోవాలని రాజకీయ ఎత్తుగడలు ముమ్మరం చేశారు. జనసేన మద్దతు కూడా కీలకంగా మారడంతో ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఎన్నికకు మరో మూడురోజులు సమయం ఉన్నందున పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులను కాపాడుకుంటే ఎంపీపీ పీఠం దక్కుతుందని, కార్యాచరణ ప్రణాళికతో తెదేపా నేతలు ముందుకెళ్తున్నారు. ఎంపీపీ పీఠం ఎలాగైనా దక్కించుకోవాలన్న లక్ష్యంతో అధికార పార్టీ కూడా ప్రయత్నాలు చేస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని