అందని పుస్తకం... బోధనకు ఆటంకం..!
eenadu telugu news
Published : 23/09/2021 03:15 IST

అందని పుస్తకం... బోధనకు ఆటంకం..!

ఈనాడు-అమరావతి

జిల్లాలో ఇలా అనేక పాఠశాలల్లో పాఠ్య పుస్తకాల కొరత నెలకొంది. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమై నెల గడిచినా ఇంకా వాటి సమస్య తీరలేదు. మేడికొండూరు, సత్తెనపల్లి, పెదకూరపాడు, క్రోసూరు, బెల్లంకొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, మాచర్ల మండలాల్లో పుస్తకాల కొరత తీవ్రంగా ఉంది. అన్ని టైటిళ్లు పూర్తిగా రాకపోవడంతో చదువులకు అంతరాయం ఏర్పడుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

పుస్తకాల కొరతను అధిగమించడానికి కొందరు ప్రధానోపాధ్యాయులు గతేడాది పదో తరగతి విద్యార్థుల నుంచి పాతవి సేకరించి సర్దుబాటు చేస్తున్నారు. ఇలా చొరవ తీసుకుని పుస్తకాలు అందిస్తున్న ప్రధానోపాధ్యాయులు అరుదుగా ఉంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 3560 పాఠశాలల్లో 4.3లక్షల మంది విద్యార్థులకు 28.32 లక్షలు అవసరమని ఇండెంట్‌ ప్రతిపాదించగా ఇప్పటి వరకు 26.85 లక్షలు పంపారు. లక్షన్నరకు పైగా పుస్తకాలు ఇంకా అందాల్సి ఉంది. ఇవి కాకుండా నూతనంగా చేరిన విద్యార్థుల కోసం మరో 3 లక్షలకు పైగా పుస్తకాలు అవసరమని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ఇండెంట్‌కు మించి పది శాతం పుస్తకాలు పంపుతారు. కానీ ఈసారి ఇండెంట్‌లోనే కోతపడిందని చెబుతున్నారు. ముప్పాళ్ల మండలంలోని ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ ‘ఇండెంట్‌కు మించి ప్రతి పాఠశాలకు పంపాలి. ఒకవేళ కొత్తగా ఎవరైనా చేరితే వారికి వెంటనే పుస్తకాలు అందజేయడానికి వెసులుబాటు కలుగుతుంది. ఇంకా పూరిస్థాయిలో అన్ని టైటిళ్లు రాలేదు. ప్రతి తరగతిలో పుస్తకాల కొరత ఉందని’ చెప్పారు.

మేడికొండూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో 750 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 124 మంది పదో తరగతి. గతేడాది 9వ తరగతిలో ఉన్న సంఖ్య ఆధారంగా ఇండెంట్‌ పెట్టగా ఆ మేరకే పుస్తకాలు పంపారు. ఈ ఏడాది కొత్తగా 50 మంది చేరడంతో వారికి పుస్తకాలు లేవు.
పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో 30 మంది కొత్తగా చేరారు. వీరికి పుస్తకాలు ఇవ్వలేదు.
అమరావతి మండలం జలాలుపురం ప్రాథమిక పాఠశాలలో గతేడాది చదివింది 16 మంది విద్యార్థులే. ఈ ఏడాది ఆ పాఠశాలలో కొత్తగా 35 మంది చేరారు. వారికి పుస్తకాలు అందలేదు.
కరోనా మూడోదశ ఉండొచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో అసలు పాఠశాలలు తెరుచుకుంటాయో లేదోనన్న అనుమానంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు నుంచి తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ఇది కూడా పుస్తకాల కొరతకు కారణమైంది. మరోవైపు నాడు-నేడు పనులతో పాఠశాలల రూపురేఖలు మారడం, అమ్మఒడి వంటి పథకాలను దృష్టిలో పెట్టుకుని మరికొందరు విద్యార్థులు సర్కారీ పాఠశాల్లో ప్రవేశాలు పొందారు. సగటున ప్రతి బడిలోనూ ప్రవేశాలు పెరిగాయి. గతంతో పోల్చుకుంటే ప్రతి తరగతిలో కొందరు కొత్త పిల్లలు రావడంతో పుస్తకాల కొరత ఉన్న మాట వాస్తవమేనని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. బడులు తెరుచుకుని నెల గడిచినా ఇంకా పుస్తకాల సమస్య పరిష్కారం కాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు జిల్లా విద్యా శాఖ ఇప్పటికే మండల విద్యా శాఖ అధికారులను పాఠశాలల వారీగా తిరిగి ఇండెంట్‌ తీసుకుని తక్షణమే ఆ వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. వీటిని మండల విద్యాశాఖ అధికారులు తెలుసుకుని జిల్లా విద్యాశాఖకు పంపితే అక్కడి నుంచి అవి ప్రభుత్వానికి వెళ్లి పుస్తకాలు ముద్రించి పంపటానికి కనీసం నెల రోజులు పడుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

ఇండెంట్‌ మేరకు పంపాం  
పాఠశాలల వారీగా తొలుత ప్రతిపాదించిన ఇండెంట్‌ మేరకు ఇప్పటికే పంపాం. ఎక్కడైనా కొరత ఉందంటే దానికి నూతన చేరికలే కారణమై ఉండొచ్చు. వీరికి పుస్తకాలు అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. మండలాల వారీగా ఎన్ని అవసరమో జిల్లా విద్యాశాఖకు తెలియజేస్తే డీఈఓ ఆదేశాల మేరకు తిరిగి వాటిని ప్రచురించి అందజేస్తాం. మొదట ప్రతిపాదించిన ఇండెంట్‌లో కోతపెట్టలేదు. వచ్చే నెల ఒకటో తేదీలోపు అన్ని పాఠశాలలకు కొరత లేకుండా పుస్తకాలు సమకూర్చడానికి కసరత్తు జరుగుతోంది.  -వజ్రబాబు, మేనేజరు, పాఠ్యపుస్తకాల గోదాము, గుంటూరు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని