ఎఫ్‌డీల గోల్‌మాల్‌పై చురుగ్గా దర్యాప్తు
eenadu telugu news
Published : 19/10/2021 04:02 IST

ఎఫ్‌డీల గోల్‌మాల్‌పై చురుగ్గా దర్యాప్తు

సాగుతున్న బ్యాంకు ఖాతాల పరిశీలన
ఈనాడు, అమరావతి

ఆయిల్‌ఫెడ్‌, గిడ్డంగుల సంస్థల్లో వెలుగుచూసిన రూ.14.6కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణంపై విజయవాడ సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. భవానీపురం ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు, వీరపనేనిగూడెంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకుల నుంచి పోలీసులు వివరాలు తీసుకున్నారు. అసలు ఎఫ్‌డీ ఖాతాల నుంచి ఎవరెవరి ఖాతాలకు సొమ్ము తరలిపోయింది? ఏయే ఖాతాలకు ఎంత మొత్తం జమ అయింది?, తదితర అంశాలను వడపోస్తున్నారు. బ్యాంకు స్టేట్‌మెంట్ల నుంచి వివరాలు రాబడుతున్నారు. రెండు సంస్థల ఎఫ్‌డీల సొమ్ము ప్రధానంగా ఏపీ మర్కంటైల్‌ కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీకి తరలాయని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు. ఆయిల్‌ఫెడ్‌ ఎఫ్‌డీలు ఉన్న సప్తగిరి గ్రామీణ బ్యాంకు నుంచి రూ.5కోట్ల సొమ్ము మర్కంటైల్‌ క్రెడిట్‌ సొసైటీకి, అక్కడి నుంచి కోస్టల్‌ ఏరియా లోకల్‌ బ్యాంకులోని ఖాతాలకు వెళ్లింది. రెండు సంస్థల కుంభకోణాల్లో నిందితులు ఒకరే అని భావిస్తున్నారు. సాయికుమార్‌, వెంకటరమణ, సత్యనారాయణ, సోమశేఖర్‌, రాజేష్‌ల ప్రమేయం ఉందని భావిస్తున్నారు.

* గిడ్డంగుల సంస్థకు చెందిన రూ.9.6 కోట్ల సొమ్మును ఐవోబీలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌కుగాను ఈ ముఠా కొంత మొత్తాన్ని మాత్రమే జమ చేసింది. రూ.3కోట్లు ఎఫ్‌డీ చేశారు. మిగిలిన మొత్తాన్ని గిడ్డంగుల సంస్థ పేరుతో నకిలీ లేఖలతో ఖాతాలు తెరిచి, వాటిల్లో వేశారు. ఈ మొత్తంలో రూ.1.9 కోట్లను కూడా ఏపీ మర్కంటైల్‌ కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీకి వెళ్లాయని తెలిసింది. ఈ బ్యాంకు ఎండీ సత్యనారాయణను గత నెలలో విజయవాడలోని కృష్ణలంకలో హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. మొత్తం కుంభకోణంలో రెండు బ్యాంకుల్లో అప్పటి మేనేజర్ల పాత్ర ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. వీరి సహకారంతోనే నకిలీ ఎఫ్‌డీ బాండ్లు తయారు చేసి ఉంటారని భావిస్తున్నారు. నకిలీ లేఖలతో ఆయా సంస్థ పేరుతోనూ ఖాతాలు తెరిచి ఉంటారని సమాచారం. రెండు కేసుల్లోనూ ఆయిల్‌ఫెడ్‌, గిడ్డంగుల సంస్థలకు అసలు కాకుండా నకిలీ బాండ్లు ఇచ్చినట్లు గుర్తించారు.

* ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఆధారంగా సాయికుమార్‌ ఈ కుంభకోణంలో ప్రధాన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఇతను 2012 నుంచి ఇదే పద్ధతిలో బ్యాంకు అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ రంగ సంస్థల సొమ్మును దారి మళ్లిస్తున్నాడని భావిస్తున్నారు. నిందితులను ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు. రెండు సంస్థల్లోని ఉద్యోగుల పాత్రపై ఇంకా ఆధారాలు లభ్యం కాలేదు. నిందితుల్లో దాదాపు అందరినీ హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని పీటీ వారెంట్‌పై విజయవాడకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడికి తెచ్చిన అనంతరం కస్టడీ పిటిషన్‌ వేసి, విచారణ చేయాలని భావిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని