వైకాపా ఆగడాలకు గుణపాఠం చెబుతాం
eenadu telugu news
Published : 21/10/2021 03:42 IST

వైకాపా ఆగడాలకు గుణపాఠం చెబుతాం

మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న

విద్యాధరపురం, న్యూస్‌టుడే : వైకాపా రౌడీ మూకల ఆగడాలకు తగిన గుణపాఠం చెబుతాం అని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న హెచ్చరించారు. వైకాపా దాడులకు నిరసనగా ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంకన్న, అనుచరులు పది మందిని పశ్చిమ ఏసీపీ హనుంతరావు, వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం అరెస్టు చేసి స్టేషనుకు తరలించారు. సంఘీభావం తెలిపేందుకు తెలుగు మహిళ, పశ్చిమ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు వన్‌టౌన్‌ పోలీసుస్టేషనుకు చేరడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంకన్న మాట్లాడుతూ తెదేపా హయాంలో రాష్ట్ర పోలీసు వ్యవస్థపై దేశవ్యాప్తంగా గౌరవం ఉండేదన్నారు. ప్రస్తుత డీజీపీ వైకాపా అల్లరిమూకల కనుసన్నల్లో విధులు నిర్వర్తిస్తున్నారని ఆరోపించారు. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన నిందితులను ఇంతవరకు పట్టుకోలేకపోవడం సిగ్గు చేటన్నారు. రౌడీయిజాన్ని ఎదుర్కోవడం తెదేపాకు కొత్తకాదన్నారు. తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్‌, ఎస్‌. ఏడుకొండలు, తెలుగు మహిళ విభాగం నాయకులు తుపాకుల రమణమ్మ, ప్రసన్న లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

వైకాపా, తెదేపా నాయకుల మధ్య తోపులాట

తెదేపా నాయకులను ముందు జాగ్రత్తగా అరెస్టు చేసిన నేపథ్యంలో వైకాపా నాయకుడు తంగెళ్ల రామచంద్రరావు, దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు నేతృత్వంలో పలువురు వన్‌టౌన్‌ పోలీసుస్టేషనుకు వచ్చారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని దూషించిన తెదేపా నాయకులు పట్టాభిరామ్‌, ప్రోత్సహించిన అధినేత చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని సీఐ వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని, మంత్రులను దూషిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అక్కడే ఉన్న తెదేపా నాయకులు ఈ మాటలు విని తమపై దాడి చేయడమే కాకుండా పోలీసుస్టేషనుకు వచ్చి హెచ్చరిస్తారా అని ఆగ్రహం వ్యకం చేశారు. దీంతో పరస్పరం తోపులాటలు జరిగాయి. పోలీసులు రెండు వర్గాల వారికి సర్దిచెప్పి విడదీయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

నీచ రాజకీయాలను తిప్పికొడతా: వంగవీటి రాధా

కరెన్సీనగర్‌ (విజయవాడ), న్యూస్‌టుడే: ‘గుణదల నీచ రాజకీయాలు తిరిగి పురుడు పోసుకుంటున్నాయి. వాటికి ముగింపు ఎలా పలకాలో నాకు తెలుసు. ఇళ్లల్లో ఉన్న మహిళలపై దాడి చేసేంత హేయమైన చర్యలకు ముగింపు ఏంటో చూపిస్తా. మహిళలు, చిన్న పిల్లలను భయభ్రాంతులకు గురి చేయడం దారుణం. గుణదల రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని’ తెదేపా నేత వంగవీటి రాధాకృష్ణ అన్నారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై మంగళవారం అల్లరిమూకల దాడి నేపథ్యంలో ఆయన ఇంటికి వచ్చారు. పట్టాభి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జరిగిన నష్టాన్ని, దాడి జరిగిన తీరు ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని