బస్సు బాగుందా..
eenadu telugu news
Published : 21/10/2021 03:42 IST

బస్సు బాగుందా..

నిబంధనల అమలు అంతంతే..

విద్యార్థుల భద్రత దృష్ట్యా విద్యా సంస్థల బస్సులకు సంబంధించి మోటారు వాహనాల చట్టంలో పలు నిబంధనలను ప్రభుత్వం పొందుపర్చింది. ఏపీ మోటారు వాహన చట్టంలోని 185 (జి) నిబంధనలను నిర్దేశిస్తోంది.

పట్టాభిపురం, నెహ్రూనగర్‌, న్యూస్‌టుడే

విద్యార్థులను క్షేమంగా పాఠశాలకు తీసుకెళ్లి తిరిగి, ఇంటికి తీసుకువచ్చే బస్సులు ఒక్కోసారి పిల్లల పాలిట మృత్యు శకటాలుగా మారుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బడివానిపేట వద్ద పాఠశాల బస్సు అదుపు తప్పి, చెరువులోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. గతంలో గుంటూరు జిల్లాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. నిబంధనల ప్రకారం ఏటా పాఠశాలలు తెరిచే ముందే, మే నెలలో ఆయా బస్సులను రవాణాశాఖ అధికారులు తనిఖీ చేయాలి. నిబంధనల ప్రకారం ఉంటే వాటిని ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ (ఎఫ్‌సీ) ఇస్తారు. కొవిడ్‌ కారణంగా రెండు సంవత్సరాల నుంచి ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయి. ఈ రెండేళ్లూ బడి బస్సులకు సామర్ధ్య పరీక్షలు నిర్వహించడం రవాణాశాఖ అధికారులకు సాధ్యం కాలేదు.

జిల్లాలో జరిగిన ఘటనలు...

* గతంలో గుంటూరు జిల్లా వెల్లుర్తిలోని ఓ పాఠశాలకు చెందిన బస్సు శ్రీశైలం-మాచర్ల హైవే సమీపంలో ప్రమాదానికి గురయ్యింది. బస్సులో 50 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలు ఉన్నారు. మండాదిగోడు వంతెనను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులు గాయాలపాలవ్వగా ఆరుగురి పరిస్థితి ప్రమాదకరంగా మారింది.

* గుంటూరు గ్రామీణ మండలం బుడంపాడులో ఒక విద్యార్ధి పాఠశాల బస్సు కింద పడి మృతి చెందాడు. విద్యార్ధి బస్సు దిగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్ధి సరిగ్గా బస్సు దిగకుండానే డ్రైవర్‌ ముందుకు పోనివ్వడంతో వెనుకటైరు కింద పడి విద్యార్ధి కన్ను మూశాడు...పిల్లలు కేకలు వేసినా సరైన సమయంలో బ్రేకులు పడక పోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

తనిఖీ ఇలా...

జిల్లాలో పాఠశాలల పునఃప్రారంభానికి ముందే రవాణా శాఖ అధికారులు అన్ని ప్రైవేటు పాఠశాలలు/ కళాశాలల బస్సులను తనిఖీ చేసి ఎఫ్‌సీ ఇస్తుంటారు. యాజమాన్యాలు అన్ని క్షుణ్ణంగా బాగు చేయించుకున్న తర్వాత ఇక్కడికి తీసుకురావాలి. రవాణాశాఖ అధికారి రికార్డును పరిశీలిస్తారు. స్వయంగా వాహనం నడిపి బ్రేక్‌, స్టీరింగ్‌ పనితీరు పరిశీలిస్తారు. అన్నీ నిబంధనల మేరకు ఉంటే వెంటనే ఎఫ్‌సీ ఇస్తారు. ఏ ఒక్క నిబంధన సరిగ్గా లేకపోయినా ఎఫ్‌సీ నిరాకరిస్తారు. ఇలా పాఠశాల బస్సులకు 32 అంశాలను, కళాశాలల వాహనాలు అయితే 23 అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

ఉల్లంఘనలే ఎక్కువ..

బడి బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయి. తక్కువ రేటుకు వస్తుందని పక్క రాష్ట్రాల నుంచి వాహనాలు తీసుకువచ్చి, వాటిని బడి బస్సులుగా మార్చి తిప్పు తున్నారు. కొందరు వీటికి రవాణాశాఖ నుంచి అనుమతులు తీసుకోవటం లేదు. ● పిల్లలు కూర్చోడానికి చోటు ఉండడం లేదు. ఎక్కువ మందిని ఒకే వాహనంలో కుక్కుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో వారు నిలబడే ప్రయాణించాల్సి వస్తోంది. ● వెనుక వచ్చే వాహనాలను చూసేందుకు డ్రైవర్‌ పక్కన అద్దాలు ఉండడం లేదు. వాహనాల్లో విద్యార్థులు తమ సంచులను పెట్టుకోవడానికి అరలు లేవు. వాటిని ఒళ్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇరుక్కుని కూర్చుంటున్నారు. పిల్లల సంఖ్యకు తగినట్లుగా బస్సుల సంఖ్య ఉండడం లేదు.

తప్పనిసరిగా ఇవి పాటించాలి..●

* శబ్ద కాలుష్యం దృష్ట్యా ఎయిర్‌ హార్న్‌లు వినియోగించకూడదు.

* కచ్చితంగా ప్రథమ చికిత్స పెట్టె ఉండాలి. ఇందులో హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, యాంటి సెప్టిక్‌ ద్రావణం, ఆయింట్‌మెంట్‌, సాధారణ రుగ్మతలకు వాడే మందు బిళ్లలు, కట్టు వస్త్రం వంటివి ఉండాలి.

* వాహన చోదకుడికి చోదక లైసెన్స్‌ ఉండాలి. అతడు ఖాకీ దుస్తులు ధరించాలి.● విద్యార్థులంతా చోదకుడికి కనిపించేలా బస్సులో అద్దం ఉండాల్సిందే.

* వెనుక నుంచి వచ్చే వాహనాలను గమనించేందుకు బస్సు పక్కన అద్దం తప్పనిసరి.

* వాహనం వయసు 15 సంవత్సరాలకు పరిమితం.● బండి నడిపే వ్యక్తి కంటి చూపు బాగుండాలి.

* 60 ఏళ్లు వయసు మీరిన వారిని చోదకులుగా పెట్టుకోకూడదు. డ్రైవింగ్‌లో 5 సంవత్సరాలు అనుభవం తప్పనిసరి.

* అత్యవసర సమయంలో బయట పడేందుకు అత్యవసర ద్వారం ఉండాలి.● ప్రతి బస్సులో డ్రైవరుతో పాటు ఒక సహాయకుడు ఉండాలి.● అగ్ని ప్రమాదాలు సంభవిస్తే, ఎదుర్కొనేందుకు రక్షణ వ్యవస్థ అవసరం.

* ఏటా సంబంధిత విద్యా సంస్థ.. తమ వాహనాలను రవాణా శాఖ అధికారులతో పరీక్షలు చేయించి, సక్రమంగా ఉన్నట్లు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాలి.● ప్రతి బస్సులో ఫిర్యాదుల పుస్తకం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.

* విద్యా సంస్థ పేరు, మొబైల్‌ నెంబరు, పూర్తి చిరునామా, బస్సు ఎడమవైపున, ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలి.

* బస్సులో ప్రయాణించే విద్యార్థుల జాబితా ఉంచుకోవాలి.

* సీట్ల కింద బ్యాగులు పెట్టుకునేందుకు ఖాళీ ఉండాలి.●

* విద్యాసంస్థల బస్సు అని గుర్తించేలా పసుపు రంగు వేయాలి. దానిపై బడి బస్సు, కళాశాల బస్సు అని రాయాలి.

* తలలు బయట పెట్టకుండా కిటికీలకు మెష్‌ ఏర్పాటు చేయాలి.● లోపలికి ఎక్కేందుకు సులువుగా మెట్లు ఉండాలి. 325 మి.మీ. ఎత్తు దాటి ఉండకూడదు.

* పట్టుకుని ఎక్కేందుకు రెయిలింగ్‌ ఏర్పాటు చేయాలి.

యాజమాన్యాలదే బాధ్యత

పాఠశాలల బస్సులను సక్రమంగా ఉంచాల్సిన బాధ్యత యాజమాన్యాలదే. పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీలు తరచూ బస్సులను తనిఖీ చేస్తుండాలి. వారంలో ఒకసారైనా బస్సుల్లో ప్రయాణించి, దాని పనితీరును ప్రత్యక్షంగా గమనిస్తూ ఉండాలి. ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఫిర్యాదుల పుస్తకంలో నమోదు చేయాలి. యాజమాన్యంతో చర్చించి, వాటిని సరి చేయించాలి. ఇలా చేస్తే పాఠశాల బస్సులు ప్రమాదానికి గురికావు. విద్యార్థులకూ ఇబ్బందులు ఉండవు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని