Chandrababu: ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఏం చేయాలో చేసి చూపిస్తా: చంద్రబాబు
eenadu telugu news
Updated : 21/10/2021 17:28 IST

Chandrababu: ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఏం చేయాలో చేసి చూపిస్తా: చంద్రబాబు

మంగళగిరి: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏం చేయాలో చేసి చూపిస్తానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో 36 గంటల నిరసన దీక్ష చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యాలయాలపై దాడులకు నిరసనగా మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో దీక్ష చేపట్టిన చంద్రబాబు మాట్లాడారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌ ప్రతిబింబం అని.. అటువంటి కార్యాలయంపై దాడి జరిగిందన్నారు. 70లక్షల మంది కార్యకర్తలు నిర్మించుకున్న దేవాలయమిది అని చెప్పారు. దాడి జరిగిన చోటే దీక్ష చేయాలని సంకల్పించినట్లు వివరించారు. పట్టాభి ఇంటిపైనా దాడి చేసి విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పక్కా ప్రణాళికతో దాడి

‘‘విశాఖ, హిందూపురం, కడప పార్టీ కార్యాలయాలతో పాటు చాలా చోట్ల దాడులు జరిగాయి. తెదేపా కార్యాలయాలు, నేతలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. కార్యకర్తల మనోభావాలపై దాడి చేసే పరిస్థితికి వచ్చారు. దాడులు విషయంపై డీజీపీకి ఫోన్‌ చేస్తే స్పందించలేదు. నా ఫోన్‌ కాల్‌ తీసుకోవడానికి డీజీపీ నిరాకరించారు. దాడుల గురించి  వివరించేందుకు డీజీపీకి ఫోన్‌ చేస్తే స్పందించరా?మనపైనే కాదు.. ప్రజాస్వామ్యంపైనే దాడి జరిగింది. పక్కా ప్రణాళికతో పార్టీని తుదముట్టించాలనే కుట్రతోనే దాడి చేశారు. పోలీసులు స్పందించకుంటే నాకేమైనా ఫరవాలేదని వెంటనే పార్టీ కార్యాలయానికి వచ్చా. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలయ్యాయి. మమ్మల్ని కొట్టి మాపైనే కేసులు నమోదు చేస్తారా?పట్టాభి వాడిన పదజాలం తప్పు అన్నారు. జగన్‌, ఆయన మంత్రులు వాడిన పదజాలంపై చర్చకు సిద్ధమా?విలువలతో కూడిన పార్టీ తెలుగుదేశం.

ఎదురు కేసులు పెడతారా?

దాడి చేసిన వారిని పోలీసులు దగ్గరుండి సాగనంపడం సిగ్గుచేటు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాష్ట్రపతి పాలన కోరలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలు, పార్టీ కార్యాలయాలపైనే దాడులా? పార్టీ కార్యాలయంలోకి చొరబడిన వ్యక్తిని పట్టుకున్నాం. చొరబడిన వ్యక్తిని పోలీసులకు అప్పగిస్తే ఎదురు కేసులు పెడతారా?దాడి చేసిన వారితో ఎదురు కేసులు పెట్టించిన డీజీపీని ఏమనాలి?చేతగాకపోతే పోలీస్‌ వ్యవస్థను మూసేయండి. స్టేట్‌ స్పాన్సర్డ్‌ టెర్రరిజంపై పోరాడాలనే దీక్ష.

డ్రగ్స్‌ను పూర్తిగా నివారించాలి

మాస్కు అడిగాడని సుధాకర్‌ను పిచ్చోడిగా మార్చేశారు. రఘురామకృష్ణరాజును విచక్షణారహితంగా కొట్టారు. డ్రగ్స్‌ వాడకం పెరిగితే జాతీ నిర్వీర్యమవుతుంది. పిల్లల భవిష్యత్తు నాశనమయ్యే పరిస్థితి వస్తుంది. డ్రగ్స్‌ సరఫరా చేసేవారిని పట్టుకోమంటే మాపైనే కేసులా?భావితరాల కోసం ఆలోచిస్తే డ్రగ్స్‌ను పూర్తిగా నివారించాలి. చట్టం కొంతమంది చుట్టం కావడానికి వీల్లేదు. ఇప్పటికైనా మారాలని వైకాపా నాయకులను కోరుతున్నా.

కొందరి వల్ల పోలీస్‌ వ్యవస్థకే చెడ్డపేరు

ఎప్పుడైనా ఆలయాలు, మసీదులు, చర్చిలపై దాడులు జరిగాయా?కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేదెవరో ప్రజలకు తెలుసు. పదవుల కోసం ఆలోచించవద్దని పోలీసులు, వైకాపా నేతలను కోరుతున్నా. తెదేపా ఏటా పోలీసుల సంస్మరణ దినాన్ని జరుపుతోంది. ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరులకు నివాళులర్పిస్తున్నా. మత విద్వేషాలు, సంఘ విద్రోహ శక్తులపై పోరాడిన ఘనత పోలీసులది. కొందరి తీరు వల్ల పోలీస్‌ వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది’’ అని చంద్రబాబు అన్నారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని