కొలువులు వదిలే..  సాగుకు కదిలి...
eenadu telugu news
Updated : 22/10/2021 06:31 IST

కొలువులు వదిలే..  సాగుకు కదిలి...

ఈనాడు, అమరావతి,  - అవనిగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే

దేశవాళీ విత్తనం కాలాబట్టు రకం వరిపైరు

ఉన్నత చదువులు చదువుకున్నారు.. పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. అయినా వారికి వ్యవసాయం అంటే ఇష్టం. రసాయన మిళితమైన పంటలు, సారం తగ్గిపోతున్న భూమిని చూసి చలించిపోయారు.నాటు రకం విత్తనాలతో నాణ్యమైన పంట పండిస్తూ.. భూమిని సారవంతం చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం వారు పండించే ప్రత్యేక రకం ధాన్యం తిరుమల ప్రసాదానికి పంపించేందుకు సన్నద్ధమవుతున్నారు.

అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామానికి చెందిన విద్యావంతులైన యువ రైతులు ప్రస్తుతం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మాదివాడ సురేంద్ర(40) ఇంజినీరింగ్‌ తర్వాత యూకెలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. అనంతరం అక్కడే కొంతకాలం ఉద్యోగం చేసి స్వదేశానికి తిరిగొచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. అక్కడ ఉద్యోగం చేస్తూనే.. నెలకు 15 రోజులు సొంతూరికి వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. అందరూ చేసే పద్ధతిలో కాకుండా భూమికి హాని చేయని ప్రకృతిసాగు చేస్తున్నారు. వేకనూరులోని 10 ఎకరాల్లో ధాన్యం పండిస్తున్నారు. చల్లపల్లి నూకలవారిపాలెంలో ఎనిమిది ఎకరాలు, తెలంగాణ రాష్ట్రం మేడ్చల్‌ జిల్లాలోని మూడుచింతలపల్లిలో ఎనిమిది ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అతడ్ని చూసి అదే గ్రామానికి చెందిన కె.భరద్వాజ్‌, బండ్రెడ్డి శివబాలకృష్ణ సహా మరో ఆరుగురు ముందుకొచ్చి ప్రకృతి సాగు బాట పట్టారు భరద్వాజ్‌ కూడా ఇంజినీరింగ్‌ పూర్తిచేశాడు. బెంగళూరులో కొన్నాళ్లు ఉద్యోగం చేసి ప్రస్తుతం ఊరికి వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. వారంతా కలిసి మరో 20 ఎకరాలకు పైగా సాగుచేస్తున్నారు.

తక్కువ పెట్టుబడితో.: సుభాష్‌ పాలేకర్‌ వ్యవసాయ విధానంలో ఎరుపు రంగులో ఉండే కుల్లాకర్‌ రైస్‌, మధుమేహ బాధితులు వినియోగించే నవారా ఎరుపు రైస్‌, విటమిన్‌ డి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు అధికంగా ఉండే.. నల్ల రంగు కాలాబట్‌ తదితర రకాలను సురేంద్ర పండిస్తున్నారు. ఇలాంటి పది రకాల దేశవాళీ విత్తనాలను వారు భద్రపరిచారు. ప్రకృతి విపత్తులు వచ్చినా.. తట్టుకొని నిలబడే రకాలను సేకరిస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో.. ప్రకృతి సాగుకు ఎరువును గోమూత్రం, పేడ, బెల్లంతో సొంతంగా తయారు చేసుకుంటారు. దేశవాళీ రకాలను పండించడం వల్ల ఎకరాకు రూ.10-15 వేల వరకు ఖర్చవుతుంది. 15 క్వింటాళ్లు పండినా రూ.45 వేలు వస్తుంది. రెండో ఏడాది నుంచి ఇది మరింత పెరుగుతుంది. ఎకరాకు రెండో ఏడాది నుంచి రూ.60 వేలకు పైనే ఆదాయం వస్తుందిన యువ రైతులు చెబుతున్నారు.


దేవుడికి నైవేద్యంగా..

తిరుమల తిరుపతి దేవస్థానం కోసం ప్రస్తుతం జె10 రకం ధాన్యం సాగు చేస్తున్నారు. తితిదేకు రోజుకు 200 కిలోల వరకు ప్రసాదం కోసం అవసరం. దేవుడిచ్చిన విత్తనం దేవుడికి నైవేధ్యంగా పెట్టాలనే భావనతో ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరామ్‌ ఆధ్వర్యంలో సురేంద్ర, మరికొంతమంది రైతులు భాగస్వాములయ్యారు. 365 రోజులు 365 రకాల ధాన్యాలతో స్వామి వారికి నైవేధ్యం పెట్టాలనేది ఆలోచన. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని 365 మంది రైతులకు ఒక్కో రకం ధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా సురేంద్ర, మరికొందరు రైతులకు విత్తనాలిచ్చారు. ఆ విత్తనాలను వారంతా దత్తత తీసుకొని.. దాన్ని కాపాడాలి. రసాయన ఎరువుల వినియోగం లేకుండా గోమూత్రం, ఆవుపేడ, బెల్లంతో తయారుచేసే ఎరువును వినియోగించి తితిదే సూచనల మేరకే పండిస్తున్నారు. ప్రస్తుతం తొలి పంట సిద్ధమైంది. సురేంద్ర సాగుచేసిన నాలుగు టన్నుల బియ్యం రెండు రోజుల్లో తితిదేకు పంపించేందుకు సిద్ధం చేస్తున్నారు. వాటిలో మూడు రకాలున్నాయి. ఎకరాకు 14 నుంచి 16 బస్తాల దిగుబడి వస్తోందని, తాము పండించే వడ్లు వెంకటేశ్వరుడి ప్రసాదానికి వినియోగపడటం ఎంతో అదృష్ణంగా భావిస్తున్నట్లు యువ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


భవిష్యత్తరాలను కాపాడాలనే..

సొంతూరులో సహజ సిద్ధంగా వ్యవసాయం చేయాలనే తపనతోనే ముందుకొచ్చాం. ఆరంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అందరూ మీకెందుకు ఇన్ని కష్టాలు అన్నారు. కానీ.. రసాయనాల నుంచి భూమికి విముక్తి ఇవ్వాలంటే ఇదొక్కటే మార్గమనేది మా నమ్మకం. అప్పుడే భవిష్యత్తరాలకు సారవంతమైన భూమిని, భవిష్యత్తును అందించగలం. ప్రస్తుతం ఏ ఆహారం తినాలన్నా రసాయనాలమయమే. అందుకే.. రసాయనాల రహిత ఆహారం పండించే మార్గాన్ని ఎంచుకున్నాం. ఉన్నత చదువులు చదివినా ఒకవైపు ఉద్యోగాలు చేసుకుంటూ వ్యవసాయం చేస్తున్న వాళ్లున్నారు. మేము పూర్తిగా వ్యవసాయంపైన ఆధారపడి కష్టపడుతున్నాం.

శివబాలకృష్ణ

సురేంద్ర

భరద్వాజ్‌


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని