AP News: గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు
eenadu telugu news
Updated : 24/10/2021 07:18 IST

AP News: గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు

తక్కెళ్లపాడులో ప్రారంభం!

వచ్చే నెల నుంచి మరో నాలుగు గ్రామాల్లో

ఈనాడు, అమరావతి

స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ అంటే సామాన్యులకు అదో బ్రహ్మపదార్థం..! భూముల క్రయవిక్రయాల్లో మధ్యవర్తుల జోక్యం ఎక్కువ. కొనుగోలుదారులు, విక్రయదారులు కలిసి ఓ దస్తావేజు లేఖరిని ఆశ్రయించడం.... ఆయన చెప్పిన విధంగా రుసుములు చెల్లించడం.. తన కమిషన్‌తో పాటు అధికారి పేరుతో 1శాతం సొమ్ము వసూలు చేయడం.. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సహజంగా జరిగే తంతు! దీనికి మించి డుబుల్‌ రిజిస్ట్రేషన్లు.. ప్రభుత్వ భూములు.. వివాదస్పద భూములు రిజిస్ట్రేషన్లు చేసి ఎక్కువ మొత్తంలో కమిషన్లు గుంజుతున్నారు. ‘మీరుమీరు తన్నుకోండి.. కోర్టులో తేల్చుకోండి.. మేం రిజిస్ట్రేషన్‌ చేసేశాం..!’ అని తమ తప్పు లేనట్లు చెబుతుంటారు. ఇలాంటి వివాదాలకు కాస్తో కూస్తో తెరదించేందుకు గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌లు ప్రారంభించనున్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లాను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ నెలలో ఇప్పటి వరకు నాలుగు రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. వాటికి చట్టబద్థత కూడా కల్పించారు. వచ్చేనెల నుంచి జిల్లాలో నాలుగు గ్రామ సచివాలయాల్లో ఇవి ప్రారంభించనున్నారు. ఇప్పటికే జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో గ్రామసచివాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది. అక్కడ నాలుగు లావాదేవీలు జరిగాయి.

* జిల్లాలో ప్రస్తుతం ఆస్తుల రిజిస్ట్రేషన్లు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే చేస్తారు. ప్రభుత్వ భూముల విలువ ప్రకారం రిజిస్ట్రేషన్‌ రుసుము చెల్లిస్తే ఆమేరకు పరిశీలన జరిపి రిజిస్ట్రేషన్‌ చేస్తారు. జిల్లాలో మొత్తం మూడు జిల్లా రిజిస్ట్రార్‌ల పరిధిలో 28 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా ఎస్‌ఆర్‌ల పరిధిలోని మండలాలు, గ్రామాల ఆస్తులు మాత్రం రిజిస్ట్రేషన్‌ చేసేవారు. కానీ ప్రస్తుతం ఎనీవేర్‌ విధానం రావడంతో ఎక్కడైనా చేసే అవకాశం ఉంది.

* గ్రామ సచివాలయాల్లో మాత్రం ఆ గ్రామానికి చెందిన ఆస్తులు రిజిస్ట్రేషన్‌లు మాత్రమే జరుగుతాయి. ఎనీవేర్‌ విధానం ఇక్కడ అమలు కాదు.

* దీనివల్ల తప్పుడు రిజిస్ట్రేషన్‌లు జరిగే అవకాశం లేదు. గ్రామం పరిధిలో కావడంతో కొనుగోలుదారులకు, విక్రయదారులకు అంతా తెలిసినవారే ఉంటారు. కాబటి నకిలీ ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఉండవు. డబుల్‌ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండదు.

* సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేసే అవకాశం ఉంది. దీనికి సమయంకూడా తీసుకోదు. అదే రోజు పరిశీలన చేసి విచారణ జరపవచ్ఛు

* సర్వేనెంబర్లు తెలిసినవే ఉంటాయి. తప్పుదోవ పట్టించే అవకాశం ఉండదు. సర్వేయర్‌, డిజిటల్‌ అసిస్టెంట్‌, ఇతర సిబ్బంది అక్కడే అందుబాటులో ఉంటారు.

* పాసుపుస్తకాలు, మ్యుటేషన్‌లు త్వరితగతిన ఇచ్చేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వ భూములు, నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలు అక్కడే అందుబాటులో ఉంటాయి.

* సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరిగిన విధంగానే రుసుములు ఆన్‌లైన్‌లో చలానా ద్వారా చెల్లించి జత చేస్తే.. రిజిస్ట్రేషన్‌ తతంగం పూర్తవుతుంది.

రీసర్వే పూర్తి చేసిన గ్రామాల్లో.. : - కె.మాధవీలత, జేసీ(రెవెన్యూ)

ప్రస్తుతం తక్కెళ్లపాడు సచివాలయంలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈనెల నాలుగు లావాదేవీలు జరిగాయి. అక్కడ భూసర్వే పూర్తి చేసినందున పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాం. వచ్చే నెల 15 నుంచి నాలుగు గ్రామాల్లో ప్రారంభిస్తాం. విజయవాడ డివిజన్‌లో జగ్గయ్యపేట మండలం షేర్‌మహ్మద్‌పేట, గుడివాడ డివిజనులో మెరకగూడెం, నూజివీడు డివిజనులో మర్రిబంధం, బందరు డివిజనులో పోట్లపాలెం గ్రామంలో రీసర్వే పూర్తవుతుంది. అక్కడ వచ్చేనెల నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తాం. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని