ఊపిరి అందదు..!
eenadu telugu news
Published : 27/10/2021 03:42 IST

ఊపిరి అందదు..!

ఈసారి దీపావళి పర్యావరణహితం కావాలి

కృష్ణా, గుంటూరుల్లో 3లక్షల కొవిడ్‌ బాధితులు

ఈనాడు, అమరావతి

కొవిడ్‌ రెండో దశ ప్రభావంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం మూడు లక్షల మంది వరకు వైరస్‌ బారినపడ్డారు. అనధికారికంగా మరో రెండు మూడు లక్షల మంది ఉంటారు. ప్రస్తుతం కొవిడ్‌ అనంతర ప్రభావంతో వీరిలో చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రధానంగా శ్వాసకోస సంబంధ సమస్యలు, ఊపిరి అందకపోవడం, ఆయాసం వంటివి చాలామందిలో ఉన్నాయి. విజయవాడ, గుంటూరు నగరాల్లోని గాలిలో ఉండే కాలుష్య కారకాలతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొవిడ్‌ బారినపడి ఆసుపత్రుల్లో చేరి.. ఐసీయూల్లో పడక వరకు చికిత్స తీసుకున్న వారు, ఆక్సిజన్‌ మీదకు వెళ్లినవారు చాలామంది ఉన్నారు. కొంతమంది ఇప్పటికీ ఇళ్లలో ఆక్సిజన్‌ పెట్టుకుని ఉంటున్నారు. ఇలాంటి సమయంలో వస్తున్న దీపావళి వేడుకలో తీవ్రమైన కాలుష్యాన్ని వెదజల్లే బాణసంచాకు ఈ ఏడాది దూరంగా ఉండాలని పర్యావరణ నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు.

కృష్ణా, గుంటూరు రెండు జిల్లాల్లో ఏటా దీపావళి ఒక్కరోజులోనే రూ.కోట్ల విలువైన బాణసంచాను కాల్చేస్తుంటారు. వీటిలో శివకాశి మతాబులతో పాటు విష రసాయన కాలుష్యాన్ని వెదజల్లే చైనా సరకు కూడా ఉంటోంది. ఏటా దీపావళి సమయంలోప్రమాదకరమైన చైనా టపాసులు విజయవాడ, గుంటూరు సహా చుట్టుపక్కల జిల్లాల్లో భారీఎత్తున సెంట్రల్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ విభాగం పట్టుకుంటోంది. అధికారులు పట్టుకునేవి పది శాతం మాత్రమే.. మిగతా 90శాతం దుకాణాల్లో పెట్టి దొంగచాటుగా విక్రయిస్తూ ఉంటారు. తక్కువ ధరకు రావడం, ఎక్కువ శబ్దం, ప్రభావం ఉండడంతో వీటిని కొనేందుకు బాణసంచా ప్రియులు ఆసక్తి చూపిస్తుంటారు. గత ఏడాది కూడా కొవిడ్‌ సందర్భంగా బాణసంచా పేలుళ్లకు దూరంగా ఉండాలని అధికారులు విస్తృతంగా ప్రచారం చేసినా.. ఒక్క రాత్రిలో రెండు జిల్లాల్లో భారీఎత్తున కాల్చారు.

బాణసంచాను కాల్చడం వల్ల అత్యధికస్థాయిలో విష రసాయనాలు గాలిలో కలుస్తాయి. ప్రధానంగా సల్ఫర్‌, జింక్‌, కాపర్‌, సోడియం వంటివి ఉంటాయి. ఇవి గాలిలో కనీసం ఐదారు రోజులు అలాగే ఉంటాయి. దీపావళి రోజు భారీస్థాయిలో వీటిని మండించడం వల్ల రసాయన వ్యర్థాలు ఐదారు రోజుల వరకూ అలాగే ఉంటాయి. కార్బన్‌ డైఆక్సైడ్‌, కార్మన్‌ మోనాక్సైడ్‌, నైట్రోజన్‌ లాంటివి అధిక స్థాయిలో గాలిలోకి విడుదలవుతాయి. వాటిని పీల్చేవారు తీవ్రమైన శ్వాస సంబంధ అనారోగ్యాలు, తల తిరగడం, వాంతులు చేసుకోవడం, గుండె సంబంధిత సమస్యలు వంటివి ఎదుర్కొనాల్సి వస్తుంది. ఇప్పటికే అనారోగ్యాల బారినపడిన వారిలో ప్రమాద తీవ్రత అధికంగా ఉంటుంది.

శబ్ద తీవ్రతతో ప్రమాదకరమే..

బాణసంచాను కాల్చడం ద్వారా వెలువడే శబ్దకాలుష్యం కూడా తీవ్రస్థాయిలో ఉంటుంది. విజయవాడ, గుంటూరుల్లో ఉన్న ఆసుపత్రుల్లో ప్రస్తుతం కొవిడ సహా అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారున్నారు. ఇలాంటి వారందరిలో టపాసుల వల్ల వచ్చే శబ్దం.. తీవ్ర ఆందోళనను కలిగిస్తుంది. గుండె జబ్బులతో బాధపడేవారి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లేలా చేస్తుంది. సుప్రీంకోర్టు సూచించిన నిబంధనల ప్రకారం దీపావళిలో బాణసంచా శబ్దాలు 125డెసిబుల్స్‌ దాటి ఉండకూడదు. కానీ.. మన దగ్గర దీపావళి రోజు కాల్చే టపాసుల శబ్దాలు.. దీనికి రెట్టింపు స్థాయిలో వెలువరిస్తుంటాయి.

నాలుగైదు రెట్లు అధికంగా..

దీపావళికి ముందు, తర్వాత గాలిలో ఉండే  పీఎం2.5 శాతాలను కాలుష్య నియంత్రణమండలి ఆధ్వర్యంలో లెక్కగడుతూ ఉంటారు. గాలిలో పీఎం 2.5 స్థాయి వంద లోపు ఉండాలి. సాధారణ రోజుల్లోనే విజయవాడ, గుంటూరుల్లోని కీలక ప్రాంతాల్లో 150 నుంచి 180మధ్యలో ఉంటోంది. వాహన కాలుష్యం, భవన నిర్మాణాలు, రహదారుల దుమ్మదూళితో గాలిలో పీఎం 2.5 స్థాయి విపరీతంగా పెరిగిపోతోంది. పండగ తర్వాత రోజు నగరంలో ఎక్కడ పరీక్షించినా.. కనీసం 300 నుంచి 400వరకు ఉంటోంది. ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కొవిడ్‌ దెబ్బకు విలవిలలాడుతున్న వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందన్నారు. గత ఏడాది దీపావళితో పోలిస్తే.. ఈసారి బాధితుల సంఖ్య భారీగా పెరిగింది. రెండో దశలోనే అత్యధికశాతం మంది కొవిడ్‌ వైరస్‌ బారినపడ్డారు.


పిల్లలు, పెద్దవాళ్లు అందరికీ ఇబ్బందే..
- డాక్టర్‌ బత్తుల బాలభాస్కరరావు, ప్రముఖ ఊపిరితిత్తుల వైద్య నిపుణుడు

గాలిలో ఉండే పీఎం 2.5  వంద లోపు ఉండాలి. బాణసంచా వల్ల భారీగా పెరిగిపోతూ ఉంటుంది. దీపావళి మరుసటి రోజు చూస్తే.. చాలాచోట్ల 400కు పైగా పీఎం 2.5 ఉంటోంది.   మళ్లీ సాధారణ స్థాయికి రావడం లేదు. గత పదేళ్లలో వాయు కాలుష్యం పెరుగుతూ వెళుతోంది. దానివల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధుల బారినపడే వారి సంఖ్య పెరుగుతోంది. ఆస్తమా లాంటివి ఉన్నవాళ్లు, కొవిడ్‌ బారినపడి శ్వాస సమస్యలు ఎదుర్కొంటున్న వారికి చాలా సమస్యలు వస్తాయి. గుండె జబ్బులతో బాధపడుతున్న వారికీ ఇబ్బందికరమే.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని