వైకాపాలో మరోమారు బయటపడిన వర్గ విభేదాలు
eenadu telugu news
Published : 27/10/2021 03:41 IST

వైకాపాలో మరోమారు బయటపడిన వర్గ విభేదాలు

పెదకూరపాడు ఎమ్మెల్యే సమక్షంలో ఎంపీటీసీ సభ్యురాలి భర్తపై దాడి

పెదకూరపాడు, న్యూస్‌టుడే: ఎంపీపీ ఎన్నిక సందర్భంగా వైకాపాలో ఏర్పడిన వర్గ విభేదాలు మరోమారు బయటపడ్డాయి. పెదకూరపాడు ఎమ్మెల్యే సమక్షంలో కర్రలు, చేతులతో కొట్టుకునే వరకు వెళ్లాయి. పెదకూరపాడు గ్రామంలో మొత్తం మూడు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో రెండు స్థానాలు ఒకే వర్గానికి వైకాపా కేటాయించగా వారు ఎన్నికయ్యారు. ఎంపీపీ ఎన్నిక సందర్భంగా రెండు సామాజికవర్గాల మధ్య  పోటీ నెలకొంది. ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు చేరో సామాజికవర్గానికి బహిరంగంగా మద్దతు పలికిన విషయం విదితమే. ఎంపీపీ పదవిని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు రెండు సామాజికవర్గాలకు సర్దుబాటు చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో సోమవారం రాత్రి ఎమ్మెల్యే ఒక వర్గానికి చెందిన గ్రామ వాలంటీరు వివాహానికి హాజరయ్యారు. ఆయన వచ్చిన సమయంలో కొందరు ‘ఎమ్మెల్యే, మరో ఇద్దరు నాయకుల నాయకత్వం వర్దిల్లాలి’ అంటూ ఎంపీటీసీ సభ్యుల అనుయాయులు పెద్దఎత్తున నినాదాలు చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. మాటామాటా పెరిగి ఘర్షణ చోటుచోసుకుంది. ఒక ఎంపీటీసీ సభ్యుడి వర్గానికి చెందిన షేక్‌ బాజీ, జహంగీర్‌ బాషా, షేక్‌ పెదమౌలాలి, షేక్‌ చినమౌలాలి, షేక్‌ బడేమీరా, షేక్‌ బుజ్జి తనపై దాడి చేసి గాయపరిచారని పెదకూరపాడు-2 ఎంపీటీసీ భర్త షేక్‌ బాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తిరుమలరావు తెలిపారు. ఈ ఘటన వైకాపాలో కలకలం రేపింది. సమసిపోతుందనుకున్న వివాదం మరలా రచ్చకెక్కడం చర్చనీయాంశంగా మారింది. వివాహ వేడుక వద్ద జరిగిన ఘటనపై ఎమ్మెల్యే ఇరువర్గాల నాయకులతో చర్చించి రాజీ కుదర్చడానికి యత్నించినట్లు తెలిసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని