అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
eenadu telugu news
Published : 28/10/2021 03:02 IST

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

సత్యనారాయణపురం, న్యూస్‌టుడే : సత్యనారాయణపురం పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ వివాహిత ఉరేసుకుని చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గాంధీనగర్‌లో కె.రమాదేవి (52), సిద్ధయ్య దంపతులు నివసిస్తున్నారు. భర్త ఫైనాన్స్‌ కంపెనీలో పని చేస్తుంటారు. బుధవారం ఉదయం పనికి వెళ్లి తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంటికి వచ్చారు. తలుపు తాళం వేసి ఉండటంతో, తన దగ్గరున్న మరో తాళంతో తలుపులు తీశారు. భార్య ఇంట్లో ఫ్యానుకు వేలాడడాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమాదేవి తీవ్రమైన అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్నట్లు అందులో పేర్కొన్నారు. భర్త ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.


కొలిక్కి రాని హత్యాయత్నం కేసు

మైలవరం, న్యూస్‌టుడే: మండలంలోని పుల్లూరు సమీపంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న యువకుడిపై హత్యాయత్నం కేసు కొలిక్కి రాలేదు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతి, తనను రమ్మనడంతో పుల్లూరు వచ్చానని, అక్కడికి వచ్చిన ఇద్దరు తన కారులోకే ఎక్కి బ్లేడుతో తన గొంతుకోసి, శాంతినగర్‌ వద్ద బుడమేరులో పడేసి పారిపోయారని యువకుడు చెప్పిన సంగతి తెలిసిందే. హత్యాయత్నానికి గురైన యువకుడికి, యువతితో ఫేస్‌బుక్‌లో పరిచయం తప్ప ముఖాముఖిగా కలవలేదని, కనీసం ఆమె అసలు ఫొటో కూడా అతని వద్ద ఉందో లేదో అన్న సందేహాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మైలవరం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పరిచయం ఉన్న యువతిగా ఆ యువకుడు చూపుతున్న ఫొటోలు అసలు అమ్మాయివి కాదని గుర్తించినట్లు సమాచారం. హత్యాయత్నానికి ముందు అతని కారును ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వెంబడించి, పుల్లూరు, మొర్సుమిల్లి మధ్య ఒక మట్టి రోడ్డులోకి తీసుకెళ్లి గొంతుకోసినట్లు నిర్ధరణకు వచ్చినట్లు తెలిసింది. బాధితుడు కారు తిరిగిన ప్రాంతాల్లోని సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని