పట్టని సంక్షేమం..!
eenadu telugu news
Published : 16/09/2021 05:34 IST

పట్టని సంక్షేమం..!

నెలరోజులవుతున్నా సగానికిపైగా విద్యార్థులు వసతికి దూరం

న్యూస్‌టుడే- అనంత సంక్షేమం


రుద్రంపేటలోని గిరిజన బాలుర వసతి గృహంలో ెపెట్టెల కోసం వెతుక్కుంటూ..

‘జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహం-2లో 90 మంది విద్యార్థులు ఉండాలి. బుధవారం కేవలం 27 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. వసతి గృహానికి ఉన్న కిటికీలకు మెష్‌ పూర్తిగా పోయింది. దోమలు కుడుతున్నా ఏర్పాటు చేయడం లేదు. స్నానపు గదుల్లో కొన్ని గదులకు తలుపులు లేవు. డెంగీ, ఇతర సీజనల్‌ వ్యాధులు విజృభిస్తుండటంతో తగు చర్యలు వేగంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.’

జిల్లాలో సంక్షేమశాఖలకు విద్యార్థుల సంక్షేమం పట్టడం లేదు. గత నెల 16వ తేదీ నుంచి వసతి గృహాలు, ఆయా శాఖల పరిధిలోని రెసిడెన్షియల్‌ వసతి గృహాలు ప్రారంభమయ్యాయి. కొవిడ్‌ అనంతరం వసతి గృహాలు ప్రారంభం కావడంతో కనీస మరమత్తులు చేపట్టలేదు. జిల్లాలోని ఆయా సంక్షేమ వసతి గృహాలను పరిశీలించగా సగానికి పైగా విద్యార్థులు వసతికి దూరంగా ఉన్నట్లు తేటతెల్లమైంది. వసతికి దూరం అయ్యారంటే విద్యార్థులు చదువుకు దూరంగా ఉన్నట్లే. విద్యార్థుల్లేక వసతి గృహాలు వెలవెలబోతున్నాయి.

కార్యాచరణపై శ్రద్ధ ఏదీ?

జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమశాఖల ఆధ్వర్యంలో పేద బిడ్డలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. సుదూర ప్రాంతాల్లోని విద్యార్థులు, ఆయా ప్రాంతాలకు అనువైన వసతి గృహాల్లో ఉండి విద్యను అభ్యసిస్తున్నారు. నెల రోజులు అవుతున్నా అధికార యంత్రాంగం విద్యార్థుల హాజరుపై దృష్టి సారించడం లేదు. పాఠశాలలకు విద్యార్థులు ఆశాజనకంగానే హాజరవుతున్నా వసతి గృహాలకు ఎందుకు రావడం లేదన్నది ప్రశ్నగా మారింది.

అనంతపురంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో దెబ్బతిన్న పైకప్పు​​​​​​​

వసతులు పూజ్యం..

కరోనా కారణంగా వసతి గృహాలు చాలా రోజుల పాటు మూతపడ్డాయి. విద్యాలయాలకు నాడు-నేడుతో సౌకర్యాలు కల్పించినా వసతి గృహాల్లో సౌకర్యాలు విస్మరించారు. కిటీకీలకు కనీసం మెష్‌ కూడా లేకపోవడంతో గోనె సంచులు అడ్డంగా ఉంచుకొని నిద్రించాల్సిన పరిస్థితి నెలకొంది. మరుగుదొడ్లకు తలుపులు ఊడిపోయాయి. వసతి గృహాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. వర్షాలు రావడంతో దోమలు పుడుతూ కుడుతున్నాయి.

చర్యలు తీసుకుంటాం...

వసతి గృహాల్లో హాజరు తక్కువగా ఉంది. కొవిడ్‌ కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు చొరవ చూపడం లేదు. వరుసగా పండగలు రావడమూ ఓ కారణం. ఆయా వసతి గృహాల్లో మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. మెస్‌ కొట్టించడానికి నిధుల కొరత ఉంది. - యుగంధర్‌, విశ్వమోహన్‌రెడ్డి, అన్నాదొర, బీసీ, సాంఘిక, గిరిజన సంక్షేమ అధికారులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని