భారీగా అక్రమ మద్యం, గుట్కా స్వాధీనం
logo
Updated : 18/06/2021 05:29 IST

భారీగా అక్రమ మద్యం, గుట్కా స్వాధీనం

పది మంది నిందితుల అరెస్టు


నిందితులు, స్వాధీనం చేసుకున్న మద్యం, గుట్కా సంచులు, వాహనాలతో పోలీసులు

తవణంపల్లె, న్యూస్‌టుడే: అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.50 లక్షల విలువ చేసే మద్యం, నిషేధిత గుట్కా సంచులను పోలీసులు పట్టుకుని వాహనాలను సీజ్‌ చేశారు. అక్రమాలకు పాల్పడిన పదిమందిని అరెస్టు చేశారు. గురువారం తవణంపల్లె పోలీసుస్టేషన్‌లో మీడియా సమావేశంలో ఎస్‌ఈబీ ఏఎస్పీ రిశాంత్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. అక్రమంగా కర్ణాటక మద్యం, గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నారన్న సమాచారంతో జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్‌, ఎస్‌ఈబీ ఏఎస్పీ రిశాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సై రాజశేఖర్‌రెడ్డి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. గాజులపల్లి-జి.గొల్లపల్లి రహదారిలో పట్రపల్లి క్రాస్‌ వద్ద బుధవారం ఓమ్నీ వ్యాను, ఆటో, స్కూటీలో తరలిస్తున్న 15 కేసుల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. గాజులపల్లిలో కారు, స్కూటీలో తరలిస్తున్న 10 కేసుల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎల్‌ఎన్‌పురం సమీపంలో గురువారం 118 బస్తాల గుట్కా ప్యాకెట్లు, 2 కిలోల గంజాయి పొడి, 32 కేసుల కర్ణాటక మద్యం, నిషేధిత మత్తు పదార్థాల బస్తాలను, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకుని మరో ఇద్దరిని అరెస్టు చేశారు. మొత్తం 3 ముఠాలకు సంబంధించి తవణంపల్లె మండలంలోని అరగొండకు చెందిన కిరణ్‌కుమార్‌, ఉప్పొడ్డిపల్లెకు చెందిన నవీన్‌, ఎ.గొల్లపల్లి ఎస్సీ కాలనీకి చెందిన జయప్రకాష్‌, సరకల్లుకు చెందిన రామరాజు, పట్రపల్లికి చెందిన శ్రీనివాసులు, జి.గొల్లపల్లికి చెందిన ఆంజనేయులునాయుడు, బంగారుపాళ్యం మండలంలోని ఎద్దులవారిపల్లె గ్రామానికి చెందిన ధనశేఖర్‌, ఎన్‌.కోటూరుకు చెందిన అమరనాథరెడ్డి, తిరుపతికి చెందిన వెంకటరమణ, గంగాధరనెల్లూరు మండలంలోని వేల్కూరుకు చెందిన నీరజ్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి రెండు కార్లు, ఓ వ్యాను, ఆటో, రెండు స్కూటీలు, భారీగా కర్ణాటక మద్యం, నిషేధిత మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్సై రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని