సమాజానికి చేరువ.. సంస్కృత విద్యకు వేదిక
eenadu telugu news
Published : 20/10/2021 05:53 IST

సమాజానికి చేరువ.. సంస్కృత విద్యకు వేదిక

జాతీయ హోదా తర్వాత తొలి స్నాతకోత్సవం

సిద్ధమైన రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం

తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తమైన సంస్కృతాన్ని సామాన్యులకు అందించడమే లక్ష్యంగా.. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు సంస్కృతం చేరువ చేయడమే ధ్యేయంగా తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ముందుకు సాగుతోంది. - న్యూస్‌టుడే, తిరుపతి(విద్య)

విద్యాపీఠంలో యూజీసీ స్థాయిలో ఇంటర్మీడియట్‌ అర్హతతో ప్రాక్‌ శాస్త్రీ, శాస్త్రీ, శాస్త్రీ వేదభాష్య, బీఏ, బీఎస్సీ(శాస్త్రీ) ఉన్నాయి. పీజీ స్థాయిలో వివిధ కోర్సులు ప్రవేశపెట్టారు. రోజూ సాయంత్రం పార్ట్‌ టైమ్‌ కోర్సులు ఉన్నాయి. పీజీ డిప్లొమా ఇన్‌ యోగ విజ్ఞాన్‌, పీజీ డిప్లొమా ఇన్‌ నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రొసెసింగ్‌, డిప్లొమా ఇన్‌ టెంపుల్‌ కల్చర్‌, డిప్లొమా ఇన్‌ పురోహిత, డిప్లొమా ఇన్‌ సంస్కృతం అండ్‌ లా, డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ విత్‌ ఓరియంటల్‌, ఓరియంటేషన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు టెంపుల్‌ కల్చర్‌, పురోహిత, జోతిష్యం వంటి సర్టిఫికెట్‌ కోర్సులతో ఎంతో మంది విద్యార్థులకు సంస్కృతాన్ని అందిస్తోంది.

ఆన్‌లైన్‌ కోర్సులకు డిమాండ్‌

కొవిడ్‌ మహమ్మారి కారణంగా విద్యారంగానికి ఆటంకం ఏర్పడటంతో వర్సిటీ ముందుచూపుతో పలు ఆన్‌లైన్‌ కోర్సులను ప్రవేశపెట్టింది. 2020 ఏప్రిల్‌ నుంచి 2021 జూన్‌ వరకు 58 రకాల ఆన్‌లైన్‌ కోర్సులను ఏర్పాటు చేయడంతో 15 దేశాలకు చెందిన 4,319 మంది విద్యార్థులు వర్చువల్‌ విధానంలో పాఠ్యాంశాలు చేర్చుకున్నారు.2019 జులై నుంచి జరుగుతున్న ఆన్‌లైన్‌ కోర్సులకు అమెరికా, బ్రిటన్‌ తదితర 19 దేశాల నుంచి 1400 మంది విద్యార్థులు 58 కోర్సుల్లో అడ్మిషన్లు పొందారు.

అభివృద్ధి పథంలో ..

విద్యాపీఠానికి జాతీయ హోదా వచ్చిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఫైనాన్సింగ్‌ ఏజెన్సీ(హెచ్‌ఈఎఫ్‌ఏ) సహకారంతో వర్సిటీ అభివృద్ధి పథంలో సాగుతోంది. ఆరు అంతస్తులతో 167 గదులు కలిగి 501 మంది విద్యార్థులకు వసతి, 5 అంతస్తులతో తరగతి గదుల సముదాయం, రెండు వర్చువల్‌ తరగతి గదులు, మూడు ఈ-క్లాస్‌ రూమ్‌లు, అధునాతన సదుపాయాలతో స్టూడియో తరగతి గదిని నిర్మించారు. 300 మంది విద్యార్థులకు ఒకేసారి భోజనం చేయడానికి వీలుగా భోజనశాల, 2.50 లక్షల లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసి ఉద్యానానికి వినియోగించేలా శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేశారు. ఆరోగ్య కేంద్రం విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

నేడు వేడుకలు

బుధవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఇందులో విద్యావారధి(పీహెచ్‌డీ) పట్టభద్రులు 67 మందికి, 26 మందికి 53 స్వర్ణ పతకాలు, పీజీ, యూజీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన 1,160 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు.

ప్రస్థానం ఇలా..: 1961లో కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతి సొసైటీ పేరుతో స్వయం ప్రతిపత్తి సంస్థగా సంస్కృత కమిషన్‌(1957) సిఫార్సులపై కొనసాగింది. 1987 తర్వాత కేంద్ర ప్రభుత్వం విద్యాపీఠాన్ని డీమ్డ్‌ విశ్వవిద్యాలయంగా ప్రకటించింది. డీమ్డ్‌ యూనివర్సిటీగా ఉన్న విద్యాపీఠానికి జాతీయ హోదా కల్పించేందుకు 2019లో లోక్‌సభ ఆమోదం తెలపగా.. 2020లో రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపి.. గెజిట్‌ను విడుదల చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని