తెరుచుకున్న అసమ్మతి ద్వారం!
eenadu telugu news
Published : 16/09/2021 05:44 IST

తెరుచుకున్న అసమ్మతి ద్వారం!

 కాకినాడ కార్పొరేషన్‌లో కదులుతున్న పీఠాలు

 నగర ఎమ్మెల్యే నేతృత్వంలో రహస్య భేటీ

 మేయర్‌, ఒకటో ఉప మేయర్‌ మార్పునకు వ్యూహం


మాట్లాడుతున్న ఎమ్మెల్యే ద్వారంపూడి. కుడా ఛైర్మన్‌ చంద్రకళ, ఉప మేయర్‌-2 ప్రసాద్‌

 

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌, నగరం: కాకినాడ నగర రాజకీయాలు వేడెక్కాయి. మేయర్‌ సుంకర పావనిపై అవిశ్వాస తీర్మానానికి వైకాపా కసరత్తు చేస్తోంది. కాకినాడలోని డి-కన్వెన్షన్‌ హాలులో కార్పొరేటర్లతో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రహస్య సమావేశం నిర్వహించారు. తెదేపా అసమ్మతి, వైకాపా, భాజపా, స్వతంత్ర కార్పొరేటర్లతో ఎమ్మెల్యే సుదీర్ఘంగా చర్చించారు. మేయర్‌, ఉప మేయర్‌ -1 కాలా సత్తిబాబుపైనా అవిశ్వాసం పెట్టే అంశంపై ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చే వరకు వ్యవహారాన్ని గోప్యంగా ఉంచాలని భావించినా.. లోపలి చర్చలు బయటకు పొక్కి.. ఒక్కసారిగా వేడి పుట్టించాయి. మేయర్‌ పావని నాలుగేళ్ల పదవీ కాలం బుధవారంతో పూర్తయిన నేపథ్యంలో తాజా సమావేశం చర్చనీయాంశం అయింది. కార్పొరేషన్‌లో 44 మంది కార్పొరేటర్లకుగాను ఈ రహస్య సమావేశానికి 34 మంది హాజరై మేయర్‌, ఉప మేయర్‌-1కు వ్యతిరేకంగా సంతకాలు చేసినట్లు సమాచారం. తర్వాత ఎమ్మెల్యే నేరుగా కలెక్టరేట్‌కెళ్లికలెక్టర్‌తో చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే నియోజకవర్గ సమస్యలపై చర్చించడానికే కలెక్టర్‌ను కలిశారని ఎమ్మెల్యే వర్గీయులు చెబుతున్నారు.

కొత్త ఆశలెన్నో...

తనను నమ్మి వెంట వచ్చిన వారికి అన్యాయం జరగనివ్వనని కార్పొరేటర్లకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చినట్లు సమాచారం. గతంలో కాలపరిమితి ముగియగానే ఎన్నికలకు అడ్డంకులు ఏర్పడేవి.. ఈసారి ఆలాఉండదని, ఇప్పుడు సహకరించిన వారికి టికెట్లు దక్కేలా చూసి.. గెలుపు దిశగానూ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అసమ్మతి వర్గం జోష్‌ మీద ఉంది. గతంలో మేయర్‌ పీఠాన్ని సగం- సగం ఏళ్లకు పంచుకునే తీరున్నా..నాలుగేళ్ల తర్వాత తొలిసారి అడుగు పడుతోంది.మేయర్‌ పీఠం తెదేపా అసమ్మతి వర్గ కార్పొరేటర్‌కు.. డిప్యూటీ మేయర్‌-1 పదవిని వైకాపా కార్పొరేటర్‌కు ఇస్తారనే ప్రచారం సాగుతోంది.

సంఖా్య.. బలమే..

కార్పొరేషన్‌లో ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉంది. వచ్చేఎన్నికల నాటికి పూర్తిస్థాయి ఆధిపత్యం సాధించేలావైకాపా పావులు కదుపుతోంది.మొత్తం 48 మంది కార్పొరేటర్లలో ముగ్గురు చనిపోగా, ఒకరు రాజీనామా చేశారు. దీంతో 44 మంది ఉన్నారు. వీరు కాకుండా ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా కాకినాడ నగర, గ్రామీణ ఎమ్మెల్యేలు చంద్రశేఖర్‌రెడ్డి, కన్నబాబుతోపాటు (మంత్రి) ఎంపీ వంగా గీత ఉన్నారు. వీరితో కలిపి మొత్తం 47 మంది సభ్యుల్లో.. కోరం ఉండాలంటే 31 మంది అవిశ్వాస తీర్మానానికి నిర్దేశించిన సమావేశానికి హాజరవ్వాలి. వీరిలో 50 శాతం మందితోపాటు ఒక ఓటు అవిశ్వాసానికి అనుకూలంగా పడితే వైకాపా పాచిక పారినట్లే. ఇదే జరిగితే మేయర్‌ను మార్చే వీలుంది. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా పత్రంపై సంతకాలతోపాటు.. భవిష్యత్తులో మాట మార్చకుండా మరికొన్ని కీలక పత్రాలపైనా సంతకాలు తీసుకున్నారని తెలుస్తోంది. ఈ ప్రక్రియకు ముందు న్యాయపరమైన అంశాలపై చర్చించినట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానానికి వీలుగా ప్రత్యేక సమావేశం పెట్టాలని ఈ నెల 17న కలెక్టర్‌ను కోరనున్నట్లు తెలుస్తోంది. తమ బలం తెలిపేందుకు సంతకాలతో కూడిన వినతిని కలెక్టర్‌కు ఇవ్వడానికి వైకాపా, తెదేపా అసమ్మతి, భాజపా, స్వతంత్ర కార్పొరేటర్లు సిద్ధమయ్యారు.

సమావేశానికి హాజరైన కార్పొరేటర్లు

తెదేపా అంతర్మథనం..

సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే అప్పటి తెదేపా ఎమ్మెల్యే కొండబాబుకు, కొందరు కార్పొరేటర్లకు మధ్య పొరపొచ్చాలు ఉన్నాయి. అసెంబ్లీ అభ్యర్థి మార్పును కోరుతూ అధిష్ఠానంపై అప్పట్లో ఒత్తిడి తెచ్చారు. కానీ తెదేపా అధినేత.. కొండబాబునే అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో అలకబూనిన కార్పొరేటర్లు లోపాయికారీగా వైకాపా అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే ద్వారంపూడి వైపు నిలిచారు. దీంతో వైకాపా అధికారంలోకి వచ్చినప్పట్నుంచి పేరుకే తెదేపా మేయర్‌.. సంఖ్యా బలం ఉన్నా.. నగర పాలన ఎమ్మెల్యే అభీష్టానికి అనుగుణంగానే సాగుతోంది. అటు మాజీ ఎమ్మెల్యే కొండబాబుతో అంతర్గత విభేదాలు.. ఇటు కార్పొరేటర్లు దూరమవ్వడంతో మేయర్‌ పావనికి గత రెండేళ్లుగా ఒంటరి పోరాటం తప్పలేదు. ఇప్పుడు పీఠానికే ముప్పు ఏర్పడే పరిస్థితి నెలకొంది. ఆగస్టు 7న ఉప మేయర్‌-2 ఎన్నిక వేళ విప్‌ జారీలో తెదేపా విఫలమవడం గమనార్హం. వెరసి తాజా పరిణామాలపై అధిష్ఠానం ఏరీతిన స్పందిస్తుందో అన్న ఆసక్తి నెలకొంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని