మన్యానికి ఆర్కే సుపరిచితుడే
eenadu telugu news
Published : 15/10/2021 02:20 IST

మన్యానికి ఆర్కే సుపరిచితుడే

 

చింతూరు: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్‌కేకు ఆంధ్రా - ఒడిశా సరిహద్దులు కొట్టినపిండి. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమా, బీజాపూర్‌ జిల్లాల సరిహద్దులోని మాడ్‌ అటవీ ప్రాంతంలో అనారోగ్యంతో గురువారం మృతి చెందినట్లు ఆ రాష్ట్ర పోలీసులు ధ్రువీకరించారు. ఏవోబీ, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రా సరిహద్దులోని దండకారణ్యంలో మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగించారు. తూర్పు మన్యంలోనూ పర్యటించి పార్టీ బలోపేతానికి వ్యూహరచనలు చేశారు. పోలీసులకు చిక్కకుండా కార్యకలాపాలను అమలు చేస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దులోని ఒడిశా రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలు మావోయిస్టు పార్టీ ఆధిపత్యాన్ని కొనసాగించారు. దేశవ్యాప్తంగా పలు కేసుల్లో ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డితో చర్చలు జరిపిన తర్వాత నెలకొన్న సంఘటనలతో ఏపీలోని పార్టీ శ్రేణులను దండకారణ్య ప్రాంతానికి తరలించారు. అక్కడ నుంచే విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని సరిహద్దు గ్రామాల్లో పట్టు సాధించేలా పదునైన వ్యూహరచనతో పలు దాడులు చేయించారు. నాలుగేళ్ల క్రితం జిల్లా సరిహద్దులో ఉన్న బలిమెల అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బులెట్‌ తగిలి గాయపడ్డారు. నక్సల్స్‌ కారిడార్‌గా ఉన్న దండకారణ్యం, ఏవోబీలపై గట్టి పట్టు సంపాదించి పార్టీని ముందుకు నడిపించడంలో ముఖ్య పాత్ర పోషించారు. జిల్లా సరిహద్దులో ఎన్నో కార్యకలాపాలు నిర్వహించిన ఆర్కే ఈ ప్రాంతానికి సుపరిచితుడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని