బోధన కుంటుపడుతోంది
eenadu telugu news
Published : 20/10/2021 01:17 IST

బోధన కుంటుపడుతోంది


పాపిరెడ్డికుంట తండాలో పాఠం చెబుతున్న ఉపాధ్యాయిని

మాచర్ల, న్యూస్‌టుడే : వెల్దుర్తి మండలం అక్షరాస్యతతో జిల్లాలోనే చివరి స్థానంలో ఉంది. ఈ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివేందుకు చాలామందికి ఆసక్తి ఉన్నా సౌకర్యాలు లేక విద్యా వ్యవస్థ చతికిలపడుతోంది. జిల్లా పరిధిలోని 57 మండలాలను పరిశీలిస్తే ఈ మండలంలోని ఉన్న భౌగోళిక పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఒక వైపు నల్లమల అటవీ ప్రాంతం, మరోవైపు కృష్ణానది, గిరిజన గూడేలు, తండాలు ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వ బడులకు డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన సమయంలో ఉపాధ్యాయులు వస్తుంటారు. తర్వాత ఏడాది బదిలీలకు అవకాశం ఇస్తే వెళ్లిపోతారు. దీంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ఆశాజనకంగా ఉన్నా ఉపాధ్యాయుల కొరత వెంటాడుతోంది. ప్రస్తుతం మండలంలో ఇదే పరిస్థితి. మొత్తం 56 సర్కారు పాఠశాలలు ఇక్కడ ఉన్నాయి. ఇందులో 6 జడ్పీ ఉన్నత పాఠశాలలు కాగా, మిగిలినవి ప్రాథమిక పాఠశాలలు. మొత్తం 5600 మంది విద్యార్థులు ఉన్నారు. 14 పాఠశాలలు ఏకోపాధ్యాయులతో నడుస్తున్నాయి.

పిల్లలకు తగిన రీతిలో సార్లు ఏరీ?

మండలంలో ఏకోపాధ్యాయులతో నడుస్తున్న పాఠశాలలు 14. ఇక్కడ 26 మంది విద్యార్థులు దాటితే ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. అయితే ఉపాధ్యాయుల కొరత నేపథ్యంలో ఒకరే 40 నుంచి 60 మంది పిల్లలున్నా పాఠాలు చెప్పాల్సిందే. మాచర్ల పట్టణం నుంచి 8 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులు అవసరం మేర ఉన్నారు. వెల్దుర్తి, శిరిగిరిపాడుతో పాటు చుట్టుపక్కల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో బడులు మాత్రం బోసిపోతున్నాయి. ఏకోపాధ్యాయుడు వెళ్తేనే అక్కడ పాఠాలు చెప్పేది. లేకుంటే సెలవే. ఆ బడి ఉపాధ్యాయుడు సెలవు పెడితే మరో ప్రాంతం నుంచి ఉపాధ్యాయున్ని పంపాలి. ఈ సమస్యల నేపథ్యంలో బోధన కుంటుపడుతోంది. ఒక ఉపాధ్యాయుడు ఉన్నచోట విద్యార్థుల సంఖ్యను బట్టి అదనంగా నియమించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం

వెల్దుర్తి మండలంలో ఉపాధ్యాయుల కొరతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయి. బడులు ఎక్కడా మూతవేయకుండా ఉన్న ఉపాధ్యాయులతో నడిపిస్తున్నాం.  - అల్లి సురేష్‌, ఎంఈఓ, వెల్దుర్తి

మండలంలో మొత్తం పాఠశాలలు 56

మొత్తం విద్యార్థులు 5600

ఒక ఉపాధ్యాయుడుతో నడుస్తున్న పాఠశాలలు 14


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని